విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: బీజేపీ తొలి జాబితా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్టీ శ్రేణులను మరోసారి నిరాశలోకి నెట్టింది. కేవలం రెండు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ఆపార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇంకా 12 నియోజకర్గాలకు అభ్యర్థుల పేర్లు పెండింగ్ లో ఉంచారు. కొల్లాపూర్ నియోజకవర్గ అభ్యర్థిగా ఎల్నేని సుధాకర్ రావు, కల్వకుర్తికి తల్లోజు ఆచారిని ప్రకటించారు. మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య పెద్దగా పోటీ లేకున్నా, ఎందుకు పెండింగ్ లో ఉంచారనేది అ పార్టీ నేతలకే అంతుచిక్కడం లేదు.
కల్వకుర్తి నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన ఆచారి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన పార్టీకి విధేయుడిగా ఉంటూ వస్తుండడంతో ప్రతిసారి ఆయనకే టికెట్ వస్తున్నది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఇక్కడ ఒక్క గ్రామంలో రీకౌంటింగ్ జరగడం.. అక్కడి ఓట్లు కాంగ్రెస్ కే ఎక్కువ పడడంతో ఆచారి అపజయం అంచున నిలిచారు. కల్వకుర్తిలో పార్టీ మారని ఏకైక వ్యక్తిగా ఆచారికి పేరుంది. ప్రతిసారి ఓటమి చెందినా ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల కోసం ఎప్పుడూ ఉద్యమించేవారన్న పేరుంది. ఏ సమస్య వచ్చినా ఇక్కడి ప్రజలు ఆచారి వద్దకు వెళితేనే పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని నిలపుకున్నారు.
కానీ ఎన్నికల్లో మాత్రం విజయం దరి చేరడం లేదు. ఈ సారి ఆచారికే గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని సర్వేలు చెపుతున్నాయి. కానీ ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు వ్యతిరేకత అధికంగా ఉన్నా, కాంగ్రెస్ బలంగా ఉంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ అభ్యర్థి ఆచారి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చూపిన చొరవ అ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఉద్యమ నేతగా పేరు పొందిన ఆచారి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా ఎల్నెని సుధాకర్ రావు పేరు ఖరారైంది.
కొన్నేళ్ల నుంచి బీజేపీని నమ్ముకున్న సుధాకర్ రావు ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించి చాలా రోజులైంది. టికెట్ తనకే వస్తుందనే నమ్మకంతో దూసుకుపోయారు. పదవి లేకపొయినా ఎప్పుడూ ప్రజల వెంట ఉండి, వారి సమస్యల పరిష్కారం కోసం తీవ్ర కృషి చేసేవారనే పేరుంది. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతో బీజేపీ అభ్యర్థి ఎదురీదాల్సిన పరిస్థితి ఉంటుంది. మలి జాబితా కోసం ఎదురుచూస్తున్న 12 నియోజకవర్గాల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. రెండో జాబితా దసరా తరువాతే ఉంటుందని అ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.