• Telugu News
  • /Telangana

పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్..అనుమతిస్తారో.. లేదో?

హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించేందుకు పవన్ కళ్యాణ్‌కు అనుమతి లభిస్తుందా? సభకు నిరాకరణ తర్వాత హైకోర్టును ఆశ్రయించిన జనసేన అధినేత తదుపరి అడుగులపై ఉత్కంఠ నెలకొంది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Jun 02, 2026, 1:24 pm IST
Read Time: 3 mins
పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్..అనుమతిస్తారో.. లేదో?

జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకకు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో పవన్ అనుమతి కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పవన్ వాదనలు వినే ముందు తమ వాదనలు కూడా వినాలని తెలంగాణ వాదులు చిక్కుడి ప్రభాకర్, పాశం యాదగిరి వంటి వారు కూడా కేవీటీ దాఖలు చేశారు. దీంతో పవన్ కల్యాణ్ సభకు అనుమతి విషయమై హైకోర్టు ఏం నిర్ణయిస్తుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ పవన్ కల్యాణ్ సమావేశం నిర్వహిస్తే ఆందోళనలు జరిగే అవకాశం ఉందని, లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని, రెండు వేలమందికి సరిపడా పార్కింగ్ సదుపాయం కూడా లేదని సమావేశానికి పర్మిషన్ ఇవ్వని సైబరాబాద్ పోలీసులు సభకు అనుమతి నిరాకరించారు.

ఇది ఇలా ఉండగానే పవన్ కల్యాణ్ ఈ రోజు సాయంత్రం హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లోనే ప్రెస్‌మీట్ పెడ‌తాన‌ని ట్వీట్ చేయడం మరింత వివాదస్పమైంది. సభకు అనుమతినివ్వని పోలీసులు..కనీసం ప్రెస్‌మీట్ పెట్టేందుకైనా అనుమ‌తిస్తారా చూద్దాం అంటూ ట్వీట్‌ చేశారు. ఒకవేళ పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ కు పోలీసులు అనుమతించిన పక్షంలో ఆయన ఏం మాట్లాడబోతున్నారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పరిణామాలు మరోసారి ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ ను రాజేస్తుండటం హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరామ్, మంత్రి పొన్నం ప్రభాకర్, టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సైతం పవన్ సభ నిర్వహణను ప్రశ్నిస్తూ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.