కాకా వారసులకు కలిసి వస్తున్న పెద్దపల్లి పార్లమెంట్

పెద్దపల్లి పార్లమెంటు స్థానం కాకా కుటుంబానికి కలిసి వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహాలు లేవు

  • Publish Date - April 5, 2024 / 04:31 PM IST

తాత, తండ్రి ఇలకాలో మూడో తరం నాయకుని రాజకీయ అరంగేట్రం. తాత నాలుగు పర్యాయాలు ,తండ్రి ఒక పర్యాయం ఎంపీ గా గెలుపు. మనవడికి కలిసి వచ్చేనా ? వంశీ గెలుపు నల్లేరు పై నడకే అంటున్న కాకా అభిమానులు పదవులన్ని ఒకే కుటుంబానికా అంటూ పలువురి విమర్శలు. మాల, మాదిగ ఈక్వేషన్‌లో మాదిగ సామాజిక వర్గం వ్యతిరేకత విధాత ప్రతినిధి ఉమ్మడి అదిలాబాద్: పెద్దపల్లి పార్లమెంటు స్థానం కాకా కుటుంబానికి కలిసి వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహాలు లేవు. పెద్దపల్లి పార్లమెంటు నియోజవర్గం పరిధిలో కాక స్వర్గీయ జి వెంకటస్వామి కుటుంబం తెలియని వారు లేరని చెప్పవచ్చు. కాక వెంకటస్వామి 1989 నుండి 4 పర్యాయాలు పెద్దపెల్లి ఎంపీగా కొనసాగారు. వెంకటస్వామి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అలాగే కాక వెంకటస్వామి కొడుకు వివేక్ 5 సంవత్సరాలు ఇదే పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా కొనసాగారు.

తాత, తండ్రి ఏలిన ఇలాకాలో మూడోతరం నాయకుడు కాక మనవడు గడ్డం వంశీ 18వ పార్లమెంట్ పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా పోటీకి రంగంలోకి దిగాడు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నవి. అందులో మంచిర్యాల జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలు ఉండగా చెన్నూరు అసెంబ్లీ స్థానంలో గడ్డం వంశీ కృష్ణ తండ్రి వివేక్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే మరో అసెంబ్లీ నియోజకవర్గమైన బెల్లంపల్లిలో వంశీకృష్ణ పెదనాన్న వినోద్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రేమ సాగర్ రావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గలో కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయ రమణారావు, మంథని అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చెందిన అడ్లూరు లక్ష్మణ్ కుమార్, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన మక్కాన్ సింగ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఏడు అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులే ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు.