9న బీజేపీలోకి పిల్లి రామరాజు యాదవ్‌ ?.. కిషన్‌రెడ్డితో మంతనాలు

నల్లగొండ అసెంబ్లీ నియోజవర్గం నేత పిల్లి రామరాజు యాదవ్ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

  • Publish Date - April 7, 2024 / 09:09 AM IST

విధాత, హైదరాబాద్ : నల్లగొండ అసెంబ్లీ నియోజవర్గం నేత పిల్లి రామరాజు యాదవ్ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బీజేపీలో తన చేరికకు సంబంధించి ఇప్పటికే ఆయన కేంద్ర మంత్రి, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. పార్టీలో తన చేరిక..రాజకీయ భవిష్యత్తు వంటి అంశాలపై ఆయన చర్చలు జరిపారు. ఈ నెల 9న రామరాజు బీజేపీలో చేరనున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల తన రాజకీయ భవిష్యత్తు పై అనుచరులు.. కార్యకర్తలు.. అభిమానులతో రామరాజు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. తొలుత కాంగ్రెస్ లో చేరాలని భావించినప్పటికి, ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా వారి కుటుంబ సభ్యులు..ద్వితీయ శ్రేణి నాయకులు బలంగా ఉన్నందునా, బీజేపీలో చేరితే మేలని అనుచరులు రామరాజుపై ఒత్తిడి తెచ్చారు. బీఆరెస్ రెబల్‌గా వ్యవహరించిన రామరాజు అసెంబ్లీ ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా నిలిచి ప్రధాన పార్టీల అభ్యర్థులను టెన్షన్ పెట్టారు. ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి 1లక్ష 7వేల 405, బీఆరెస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి 53వేల 73 ఓట్లు, పిల్లి రామరాజు యాదవ్‌కు 27వేల 96 ఓట్లు పోలయ్యాయి. ప్రధాని మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమలకు ఆకర్షతులై బీజేపీలో చేరాలని రామరాజు నిర్ణయించుకున్నారని ఆయన అనుచరులు తెలిపారు. రామరాజు చేరికతో బీజేపీకి నల్లగొండ పార్లమెంటు పరిధిలో రాజకీయంగా ఓట్ల పరంగా అదనపు బలం చేకూరనుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాదవ సామాజిక వర్గం ఓటర్లు గణనీయ స్థాయిలో ఉండటంతో ఆయన చేరిక బీజేపీకి ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు.

Latest News