విధాత, హైదరాబాద్: తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబును శనివారం ప్రతినిధులు కలిశారు. జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమానికి సంబంధించి 9 ప్రధాన అంశాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచి, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారు.
కాగా.. డిమాండ్లను పరిశీలించి మ్యానిఫెస్టోలో పెట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు కోడూరు శ్రీనివాస్ రావు, జే వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సాధిక్, సహాయ కార్యదర్శి మధు, కార్యదర్శి, ట్రెజరర్ సురేష్, కంచ రాజు పాల్గొన్నారు.