Rain Alert | రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగానే నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు అందించింది. ద్రోణి, క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో రాగల నాలుగైదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్కడక్కడ ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడంగడ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా వేడిగాలుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. దీంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు తెలిపారు.
రాబోయే రోజుల్లో వర్షాలు కురిసినప్పటికీ ఉష్ణోగ్రతల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. చాలా వరకు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందన్నారు. మరికొన్ని జిల్లాల్లో వర్షాలు ఉన్నప్పటికీ మళ్లీ ఆరెంజ్ అలర్ట్లోనే ఉంటాయని స్పష్టం చేశారు. ఈ వర్షాల వల్ల ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు కనిపించదని పేర్కొన్నారు. తేమ శాతం మాత్రం పెరుగుతుందన్నారు.
