రామలింగారెడ్డి.. గన్ను, పెన్నుతో పోరాటం చేశారు: విగ్రహావిష్కరణ సభలో మంత్రి హరీశ్​ రావు

రామలింగారెడ్డి.. గన్ను, పెన్నుతో పోరాటం చేశారు: విగ్రహావిష్కరణ సభలో మంత్రి హరీశ్​ రావు
  • రామలింగారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలంటే
  • దుబ్బాక గడ్డ మీద తెలంగాణ జెండా ఎగురాలి
  • ఉద్యమంలో ఇద్దరం జోడెడ్లలాగా కలిసి పనిచేశాం
  • విగ్రహావిష్కరణ సభలో మంత్రి హరీశ్​ రావు

విధాత, మెదక్ బ్యూరో: దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి వామపక్ష భావజాలంతో గన్ను, పెన్నుతో పోరాటం చేసిన వ్యక్తి అంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కొనియాడారు. దుబ్బాకలో సోమవారం రామలింగారెడ్డి విగ్రహావిష్కరణ అనంతరం మంత్రి మాట్లాడారు. రామలింగారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలంటే దుబ్బాక గడ్డమీద గులాబీ జెండా ఎగరాలని అన్నారు.


తెలంగాణ ఉద్యమంలో రామలింగారెడ్డి, తాను కలిసి జోడెడ్లలా పనిచేశామని గుర్తు చేసుకున్నారు. నిద్రాహారాలు మాని రైలురోకోలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేపట్టామన్నారు. సోలిపేట వైవిధ్యాల సమ్మేళనం అని అన్నారు. తన చేతుల మీదుగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి వస్తుందని తాను ఊహించలేదని అన్నారు.



 రామలింగారెడ్డి శంకుస్థాపన చేసిన పనులకే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు రిబ్బన్ కట్ చేస్తున్నారన్నారు. అరచేతిలో వైకుంఠం చూపెడతానని చెప్పి రఘనందన్​ రావు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. ఆయన చెప్పిన మాయ మాటలు నమ్మి సుజాతక్కకు ఇక్కడి ప్రజలు అన్యాయం చేశారన్నారు.



రామలింగారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలంటే దుబ్బాక గడ్డ మీద గులాబీ జెండా ఎగరేయాలన్నారు. సోలిపేట కుటుంబానికి తాను అండగా ఉండి వారిని రాజకీయంగా నిలబెడుతానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, రామలింగారెడ్డి కుమారుడు సోలిపేట సతీష్ పాల్గొన్నారు.