విధాత: ఇందిరా భవన్‌లో పోడు భూముల పోరాట కమిటీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. గిరిజనుల పోడు భూములకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీయేనని తెలిపారు. దళితులను సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణలో దళితులు, గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. హరితహారం పేరుతో సీఎం కేసీఆర్ గిరిజనుల భూములు గుంజుకున్నారని విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీలకు హక్కులు, రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. దళితులు, గిరిజనులకు ఇచ్చిన సంక్షేమ పథకాలను సబ్‌ప్లాన్ కింద చూపించడం అన్యాయమన్నారు. రైతు బంధు, దళిత బంధు పథకాలు ఎన్నికల హామీలేనని విమర్శించారు. అమ్ముకోవడానికి భూములున్నాయి కానీ, దళితులు.. గిరిజనులకు ఇవ్వడానికి భూములు లేవా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పోడు భూముల ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసి హక్కులు సాధించుకుందామని సీతక్క పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి బలరామ్ నాయక్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు జగన్ లాల్ నాయక్, జాతీయ నాయకుడు బెల్లయ్య నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, బాలూ నాయక్ తదితరులు పాల్గొన్నారు.