విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: రాబోయే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడం తథ్యమని పీసీసీ కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. బుధవారం మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ తో కలసి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
ప్రేమ్ సాగర్ రావును గెలిపిస్తే నియోజకవర్గంలో సమస్యలు లేకుండా అభివృద్ధిపై దృష్టి పెడతారని అన్నారు. గత ఎన్నికల్లో ఒడిపోయినప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. కొక్కిరాల రఘుపతిరావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో ప్రేమ్ సాగర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
20 ఏండ్లు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే దివాకర్ రావు నియోజకవర్గం భవిష్యత్తును అంధకారం చేసారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల జీవితాలు బంగారుమయం అవుతాయని అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజా సంక్షేమ పాలన తెస్తామని అన్నారు.