• Telugu News
  • /Telangana

పర్యావరణ పరిరక్షలో సింగరేణి అద్బుతం !

డోర్లీ-2 గని మూసివేత తర్వాత 162 హెక్టార్లలో అడవిని అభివృద్ధి చేసిన సింగరేణి సంస్థకు కేంద్రం ప్రశంసలు తెలిపింది. పర్యావరణ పరిరక్షణ చర్యలకు గుర్తింపుగా రూ.40 కోట్లు తిరిగి చెల్లించింది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Jun 10, 2026, 5:50 pm IST
Read Time: 3 mins
పర్యావరణ పరిరక్షలో సింగరేణి అద్బుతం !

సింగరేణి బొగ్గు గనుల తవ్వకాల వల్ల ప్రధానంగా వాయు కాలుష్యం, భూగర్భ జలాలు అడుగంటడం, అడవుల నాశనం వంటి తీవ్రమైన పర్యావరణ నష్టాలు జరుగుతున్నాయన్న విమర్శలు విదితమే. ప్రత్యేకించి ఓపెన్‌కాస్ట్ (OCP) గనుల వల్ల స్థానిక జీవావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ఆటంకం కలుగుతోందన్న ఆందోళన తరుచూ వినిపిస్తుంటుంది. అయితే సింగరేణి సంస్థ బొగ్గు తవ్వకాలతో నెలకొన్న పర్యావరణ సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. మూసివేసే బొగ్గు గనుల విషయంలో తాజాగా సింగరేణి సంస్థ పర్యావరణ పరిరక్షణలో అరుదైన ఘనత సాధించడం ఆసక్తికరం.

బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ-2 గని మూసివేతలో పర్యావరణ నిబంధనలను పక్కాగా అమలు చేసినందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకుంది. గని మూసివేతతో చేపట్టిన పర్యావరణ పరిరక్షణ చర్యలతో సంతృప్తి చెందిన కేంద్రం గని ప్రారంభంలో కోల్ కంట్రోలర్ వద్ద డిపాజిట్ చేసిన రూ.40 కోట్లను వడ్డీతో సహా తాజాగా సింగరేణికి తిరిగి చెల్లించడం విశేషం.

గని తవ్విన 162 హెక్టార్లలో దట్టమైన అడవిని పెంచిన సింగరేణి సంస్థ పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలిచింది. త్వరలో డోర్లీ-1 గనికి కూడా పర్యావరణ పరిరక్షణ చర్యల నేపథ్యంలో మరో రూ.60 కోట్లు తిరిగి వచ్చే అవకాశం ఉందని సింగరేణి అధికారులు వెల్లడించారు. ఈ సందర్బంగా డోర్లీ గని ప్రాంతాలలో పర్యావరణం, పచ్చదనం పునరుద్దరణకు సంబంధించి సాధించిన పురోగతితో కూడిన ఫోటోలను సింగరేణి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. మట్టి, రాళ్లతో కూడిన గని ప్రాంత ఫోటోలు..తర్వాత సంస్థ చేపట్టిన పర్యావరణ చర్యలతో పెరిగిన వనాలతో దట్టమైన అడవీ ప్రాంతంగా మారిన గని ఫోటోలు వైరల్ గా మారాయి.