బీఆరెస్‌తోనే.. అయినా దూరం దూరంగానే టీబీజీకేఎస్

సింగరేణి బొగ్గు గనుల సంస్థలో రెండుసార్లు గుర్తింపు కార్మిక సంఘం హోదా దక్కించుకొని,

  • Publish Date - March 31, 2024 / 08:52 AM IST

ఉద్యమాల సమయంలోనే మద్దతు

యూనియన్‌గా ఇక స్వతంత్ర నిర్ణయాలే!

ఏప్రిల్ 24 న సర్వసభ్య సమావేశం

ఏప్రిల్ 2 నుండి 22 వరకు సభ్యత్వ నమోదు

టీబీజీకేఎస్‌ సమావేశం నిర్ణయం

విధాత బ్యూరో, కరీంనగర్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో రెండుసార్లు గుర్తింపు కార్మిక సంఘం హోదా దక్కించుకొని ఇటీవలి ఎన్నికల్లో పోటీకే దూరంగా ఉండిపోయిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తిరిగి తన అస్తిత్వాన్ని నిలబెట్టుకునే దిశగా ముందుకు సాగుతోంది.

నాటి టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్

అనుబంధ సంస్థగా (టిబిజికెఎస్) ఆ పార్టీ నేతల ఆలోచనలకు అనుగుణంగా, వారి ఆదేశాలకు లోబడి పనిచేస్తూ రావడమే ప్రస్తుత దుస్థితికి కారణమనే అంతర్మథనం టీబీజీకేఎస్ నేతల్లో వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్నప్పటికీ ఆ పార్టీపై అతిగా ఆధారపడరాదనే సంచలన నిర్ణయాన్ని టీబీజీకేఎస్ తీసుకుంది. సంఘ నిర్మాణంలో, కార్యాచరణలో బీఆర్ఎస్ అగ్రనేతలతో సహా, మరెవరి ప్రమేయాన్ని అంగీకరించేది లేదని ఆదివారం గోదావరిఖని కేంద్ర కార్యాలయంలో మిర్యాల రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం తేల్చి చెప్పింది. ఈ సమావేశానికి సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలకు సంబంధించిన 40 మంది ముఖ్య నాయకులు హాజరయ్యారు.

వాస్తవానికి వారం రోజుల క్రితం గోదావరిఖనిలో నిర్వహించిన టిబిజికెఎస్ సమావేశంలోనే సంఘం కమిటీలు అన్నింటిని రద్దు చేస్తూ, నేతలు బి వెంకటరావు, కెంగర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి ఇచ్చిన రాజీనామాలను ఆమోదించారు. ఆ సమావేశానికి హాజరైన 100 మందికి పైగా ప్రతినిధులు నూతన స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవిని రాజిరెడ్డికి కట్టబెట్టారు. ఈ క్రమంలో ఆదివారం జరిగిన సమావేశంలో సింగరేణి గుర్తింపు ఎన్నికలు, ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడం, సంఘంపై బీఆర్ఎస్ శాసనసభ్యులు, నేతల విపరీత ఒత్తిళ్లపై చర్చ జరిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో పాల్గొనకుండా కాడి ఎత్తివేయడం చారిత్రక తప్పిదమని టీబీజీకేఎస్ నేతలు అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ శాసనసభ్యులు తమ ఆధిపత్యానికి భంగం ఎక్కడ వాటిల్లుతుందో అనే భావనతో, ముఖ్యమంత్రికి తప్పుడు సలహాలు ఇచ్చారని వారు అభిప్రాయపడ్డారు. “ఇటీవల కొన్ని పత్రికలు, వార్త ఛానెళ్లలో, టీబీజీకేఎస్ బీఆర్ఎస్ మధ్య తెగతెంపులు జరిగాయంటూ”వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని వారు పేర్కొన్నారు.

సంఘంగా తాము స్వతంత్రంగా పనిచేస్తామని, అయితే కార్మిక సమస్యలు, సింగరేణి ప్రైవేటీకరణ విధానాలు, బొగ్గు గనుల వేలం తదితర సమస్యలపై జరిగే పోరాటాల్లో బీఆర్ఎస్ మద్దతు మాత్రం తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. త్వరలో నిర్వహించే సర్వసభ్య సమావేశం అనంతరం ఏర్పాటు కానున్న వర్కింగ్ కమిటీ, సెంట్రల్ కమిటీ సలహాలు, సూచనల మేరకే సంఘ కార్యకలాపాల నిర్వహణ ఉంటుందన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం స్వయం ప్రతిపత్తితో పనిచేయాలన్నదే తమ అభిమతం అని వారు స్పష్టం చేశారు.

ఏప్రిల్ 24 న సర్వసభ్య సమావేశం

ఏప్రిల్ 24 న గోదావరిఖనిలో టీబీజీకేఎస్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని సంఘం నేతలు నిర్ణయించారు. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలకు చెందిన సుమారు 1000 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నట్టు వారు చెప్పారు. ఈ సమావేశంలో 23 మందితో సెంట్రల్ కమిటీ, 77 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీ, ప్రతి ఏరియాకు ఒక ఉపాధ్యక్షుని చొప్పున 11 మందితో పూర్తి సెంట్రల్ కమిటీ నిర్మాణ ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు వివరించారు. ఈ నిర్మాణంలో 35% పదవులు యువతకు కట్టబెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. కమిటీల కూర్పుకు ముందే ఏప్రిల్ 2 నుండి 22వ తేదీ వరకు సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. వాస్తవానికి సింగరేణిలోని కార్మిక సంఘాలు ప్రతి కార్మికుని వేతనం నుండి నెలకు 20 రూపాయలు మినహాయించుకొవడం అనవాయితిగా వస్తోంది. 2008,2013 తరువాత టీబీజీకేఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియకు స్వస్తి పలికింది. కార్మికుల నుండి డబ్బు తీసుకొని సభ్యత్వం ఇచ్చే విధానాన్ని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకించడం వల్లనే టీబీజీకేఎస్ సభ్యత్వ నమోదు అంశాన్ని అటకెక్కించేసింది. కార్మిక సంఘాల్లో సభ్యత్వ నమోదు లేకుండా, కార్మికుల ప్రాతినిధ్యం సరికాదనే భావనకు వచ్చిన టీబీజీకేఎస్ తిరిగి సభ్యత్వ నమోదు అంశంపై దృష్టి సారించింది.

రెండుసార్లు గెలిచి…

సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఏర్పడిన తర్వాత 1998లో మొదటిసారి కార్మిక సంఘాలకు గుర్తింపు ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. రెండేళ్లకు ఒకసారి ఈ ఎన్నికలు నిర్వహించేందుకు సింగరేణి ముందుకు వచ్చింది. మొన్నటి ఎన్నికలకు ముందు ఆరుసార్లు జరిగిన గుర్తింపు ఎన్నికల్లో సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ మూడుసార్లు, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్ టియుసి ఒకసారి, టిఆర్ఎస్ అనుబంధ టీబిజీకేఎస్ రెండుసార్లు గుర్తింపు హోదా దక్కించుకున్నాయి. ఓవైపు రాష్ట్రంలో అధికారంలో ఉండి, మరోవైపు గుర్తింపు సంఘంగా కొనసాగుతూ కూడా టీబీజీకేఎస్ మొన్నటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయింది. సింగరేణి ఎన్నికల్లో గెలుపు విషయంలో నాటి అధికార పార్టీకి ఉన్న ఆందోళనలు, ఆ పార్టీ శాసనసభ్యుల సూచనల మేరకు గుర్తింపు ఎన్నికల్లో పోటీ చేయరాదని బిఆర్ఎస్ భావించింది. దీంతో ఆ సంఘ కార్యకర్తలు, నేతలు లోపాయి కారిగా సిపిఐ అనుబంధ ఏఐటిసికి మద్దతునిచ్చిన విషయం తెలిసిందే.

అయితే గతంలో జరిగిన పొరపాట్లు, గుణపాటాలను దృష్టిలో ఉంచుకొని బిఆర్ఎస్ కు సమ దూరం పాటిస్తూనే, సంఘాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు అవసరమైన కార్యాచరణ దిశగా టీబీజీకే నేతలు అడుగులు వేస్తున్నారు.

 

 

Latest News