Telangana | తెలంగాణలో వరద రాజకీయాలు: సీఎం ఏరియల్ సర్వే..మంత్రులు, ప్రతిపక్ష నేతల క్షేత్ర పర్యటనలు
తెలంగాణలో వరద రాజకీయాలు హాట్ టాపిక్! సీఎం రేవంత్ ఏరియల్ సర్వే, కేటీఆర్, హరీష్ రావు, బండి సంజయ్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనలు.

Telangana | విధాత, హైదరాబాద్ : కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులను పరిశీలించి బాధితులకు భరోసా కల్పించడంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ నేతలు గురువారం పోటాపోటీ పర్యటనలు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తన నివాసంలో మంత్రులతో వరదలపై సమీక్ష నిర్వహించి..ఆ తర్వాతా మెదక్, కామారెడ్డిలలో వరద పరిస్థితులను పరిశీలించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy), పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో(PCC Chief Mahesh Kumar Goud) కలిసి హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే నిర్వహించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ(Minister Damodar Narasimha) మెదక్ జిల్లాలోని రామాయంపేట లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులతో మాట్లాడి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సహాయక చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సిరిసిల్ల, నర్మాల వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి..అక్కడి నుంచి మాచారెడ్డి మండలంలోని వరద ప్రాంతాలను సందర్శించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్నారు. అక్కడ ఆయన పాల్వంచ వాగు ఉధృతిని, తెగిన రోడ్డును పరిశీలించారు. కామారెడ్డి(Kamareddy) వైపు రాకపోకలు నిలిచిపోవడంతో పాల్వంచ నుంచి కేటీఆర్ తిరిగి సిరిసిల్ల(Siricilla) బయలుదేరారు. అటు బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao) మెదక్ జిల్లా హావేలిఘనపూర్ మండలం ధూప్‌సింగ్ తండా, రాజాపేటలలోని ముంపు బాధితులనును పరామర్శించారు. బూరుగుపల్లి గ్రామంలో తెగిపోయిన రోడ్డు పరిశీలించి, గ్రామ ప్రజలతో మాట్లాడారు.
బీజేపీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) వరద బాధిత కరీంనగర్ జిల్లా నర్మాల ప్రాంతంలో పర్యటించారు.