విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ‘సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో కాకుండా వేరే నియోజకవర్గంలో ఇక్కడి కార్యకర్తలతో మీటింగ్ పెట్టిండు. నాపై దయ చూడాలని, ఇకపై నెలకు ఒకసారి మీతో ఉంటా అంటూ అడుక్కునే దుస్థితికి వచ్చిండు. ఇలా బతిమిలాడుకునే సీఎంను గతంలో ఎన్నడూ చూడలేదు’ అని గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తూముకుంట నర్సారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
గత ప్రభుత్వాల్లో చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి కాని ఎప్పుడూ వాళ్ళ కార్యకర్తలను బతిమలాడలేదన్నారు. పదేళ్లలో గజ్వేల్ నియోజకవర్గంలోని మండలాలకు కేసీఆర్ ఇంతవరకు వెళ్ళలేదన్నారు. రైతు ఆత్మహత్యలు చేసుకుంటే, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాక ఎంతోమంది చనిపోయారని.. ఇంతవరకు వారిని పట్టించుకోలేదన్నారు. సిద్దిపేట నుంచి గజ్వేల్‌కు బతికి వచ్చిన కేసీఆర్.. గజ్వేల్‌పై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. ఇంతవరకు గజ్వేల్‌కు ఏమీ చేయలేదని.. ఇకపై చేస్తా అని అంటున్నారు, అంటే ముఖ్యమంత్రికి ఎనిమిదేళ్లు సరిపోదా అని ఆయన ప్రశ్నించారు.
ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లో గజ్వేల్‌లో ఓడిపోతాననే భయంతోనే కార్యకర్తలతో మీటింగ్ పెట్టి బతిమలాడుతున్నారన్నారు. ‘నేను గజ్వేల్ లోకల్. మీతోనే ఉంటా’ అని చెప్పుకొచ్చారు. దత్తత తీసుకున్న గ్రామాల్లో కూడా పెంకుటిల్లు కూల్చి, ఇప్పటివరకు వారికి డబుల్ బెడ్ రూమ్‌లు ఇవ్వలేదన్నారు. వర్గల్‌లో ప్రభుత్వ భూమిని తీసుకొని వారికి సరైన నష్టపరిహారం కూడా ఇవ్వకుండా, వాళ్ళకి ఇస్తానన్న ప్లాట్‌కు కూడా ఇవ్వకుండా ఆ భూములను కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
మల్లన్నసాగర్‌లో భూములు కోల్పోయిన వారికి ఇప్పటికీ ప్యాకేజీలు, డబుల్ బెడ్ రూమ్‌లు ఇవ్వకుండా వాళ్ళను అడ్డా మీద కూలీలను చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే భూ నిర్వాసితులకు సరైన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం, గజ్వేల్ ప్రజల ఆశీర్వాదంతో ఇక్కడ గెలిచాక కేసీఆర్ చేయని అభివృద్ధిని తాను చేసి చూపిస్తానని నర్సారెడ్డి స్పష్టం చేశారు.