తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్న తాము.. నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని కాంట్రాక్టర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించుకున్నారు. గత కొన్నేళ్లుగా పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర విభాగం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాసింది. రాష్ట్రానికి మౌలిక వసతులు నిర్మిస్తూ, కోట్లాది ప్రజలకు సేవలు అందిస్తున్న తాము స్వంత డబ్బులు పెట్టి పనులు పూర్తి చేసి, ఇప్పుడు చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్న దుస్థితిలో ఉన్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం వల్ల కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. బ్యాంకులు, ప్రైవేట్ రుణదాతల ఒత్తిడి పెరిగిపోగా, ఆర్థికంగా కుదేలవుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో ఇప్పటికే 10 మందికి పైగా కాంట్రాక్టర్లు ప్రాణాలు కోల్పోయారని, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు తాము ఎదుర్కొంటున్న బాధను స్పష్టంగా తెలియజేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.
ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడం అభినందనీయమని, కానీ, కాంట్రాక్టర్లు కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక భాగమని గుర్తించాలని కాంట్రాక్టర్లు కోరారు. తాము ప్రత్యక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ, పరోక్షంగా మరెన్నో కుటుంబాల జీవనోపాధికి ఆధారంగా ఉన్నామని గుర్తు చేశారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫున తాము పలుమార్లు ప్రభుత్వాన్ని సంప్రదించినప్పటికీ, సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. సమావేశం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ కూడా ఇప్పటివరకు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్మాణ రంగం బలహీనపడితే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుందని, కాంట్రాక్టర్లు నిలబడలేని పరిస్థితి వస్తే, ప్రాజెక్టులు నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. వెంటనే కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి, పెండింగ్ బిల్లుల విడుదలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది కేవలం తమ సమస్య మాత్రమే కాదని, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అంశమని అన్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఉన్నామని లేఖలో పేర్కొన్నారు.
