వరంగల్‌ ట్రిపుల్‌ మర్డర్‌ కేసును ఛేదించిన పోలీసులు.. భర్తే హంతకుడు.. దొరికిపోయిందిలా…

రాష్ట్రంలో సంచలనం రేపిన వరంగల్‌ ట్రిపుల్‌ మర్డర్‌ కేసును పోలీసులు ఛేదించారు. భర్తే హంతకుడని తేల్చారు. కుమార్తెలకే జన్మనిస్తున్నదంటూ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు గుర్తించారు. కేసు వివరాలను వరంగల్‌ సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ శుక్రవారం మీడియాకు తెలిపారు.

  • By: TAAZ |    telangana |    Published on : Apr 10, 2026 8:05 PM IST
వరంగల్‌ ట్రిపుల్‌ మర్డర్‌ కేసును ఛేదించిన పోలీసులు.. భర్తే హంతకుడు.. దొరికిపోయిందిలా…
  • ఆడపిల్లలకు జన్మనిస్తున్నదంటూ భార్య, ఇద్దరు పిల్లల హత్య
  • భర్తతో పాటు తొమ్మది మంది నిందితుల అరెస్టు
  • నిందితుల్లో పరారీలో ఇద్దరు డాక్టర్లు
  • వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్‌ వెల్లడి

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

తీవ్ర సంచలనం రేపిన వరంగల్‌ ట్రిపుల్‌ మర్డర్‌ కేసును నగర పోలీసులు ఛేదించారు. పదేపదే ఆడపిల్లలకే జన్మనిస్తున్నదంటూ భార్యను, ఇద్దరు కుమార్తెలను అజారుద్దీన్‌ అనే వ్యక్తి హతమార్చినట్టు తేల్చారు. ఈ హత్యలకు పరోక్షంగా కారణంగా నిలిచిన మరో తొమ్మిదిమంది నిందితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ముందుగా అనుమానాస్పద మరణాలుగా భావించినప్పటికీ.. ఆ తర్వాత దర్యాప్తులో ఇవి హత్యలని తేలింది. వరంగల్ నగర శివారు పున్నేలులోని ఓ రిసార్డులోని స్విమ్మింగ్‌పూల్‌లోకి భార్యను, ఇద్దరు కుమార్తెలను తోసి, అది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా చిత్రీకరించేందుకు భర్త అజారుద్దీన్‌ ప్రయత్నించాడని గుర్తించారు. హతురాలు గర్భవతి కావడం గమనార్హం.

ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన వారిలో ప్రధాన నిందితుడు వరంగల్ జిల్లా పున్నెలు గ్రామానికి చెందిన ఎండీ అజారుద్దీన్ (29), నిందితుడి కుటుంబ సభ్యులు ఎండీ చాంద్‌పాషా (49), ఎండీ సలీమా (45), ఎం షరోద్దీన్ (25)లతో పాటు కడిపికొండకు చెందిన బసిక స్రవంతి (32), నెక్కొండకు చెందిన బాల్నె పార్ధు (47), గీసుగొండకు చెందిన బొమ్మెర మనోహర్(39), కొండపర్తికి చెందిన లింగాల నరేష్(37), పున్నేలుకు చెందిన సాట్లరాజు (32), ఏనుగల్లుకు చెందిన వాంకుడోతు భద్రు (60) ఉన్నారు. మరో ఇద్దరు నిందితులు డాక్టర్‌ బాల్నె పూర్ణిమ, డాక్టర్‌ ఎస్ రవళి పరారీలో వున్నారు.

ఈ సంఘటనకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్‌.. మీడియా సమావేశంలో వివరాలు తెలియజేశారు. ఐనవోలు మండలం పున్నెలు గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు అజారుద్దీన్ అదే గ్రామానికి చెందిన మృతురాలు ఫరహాత్‌ను 2016 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి హుమేరా (09), ఆయేషా (06) ఇద్దరు బిడ్డలున్నారు.

నిందితుడి కుటుంబ సభ్యులకు కుమారుడు పుట్టాలని కోరిక వుండేది. 2021, 2022 సంవత్సరాల్లో మతురాలు గర్భం దాల్చడంతో తిరిగి ఆడ పిల్లకు జన్మనిస్తుందనే అపనమ్మకంతో ప్రధాన నిందితుడు, అతని కుటుంబ సభ్యులున్నారు.

ఈ క్రమంలో పున్నెలు గ్రామానికి చెందిన మందుల షాపు నిర్వహిస్తున్న సట్ల రాజుతో పాటు మిగతా నిందితులు ఆర్‌ఎంపీ నరేష్, ల్యాబ్ టెక్నిషియన్ మనోహర్, కాజీపేటలోని సురక్షా హస్పిటల్‌కు చెందిన డాక్టర్ రవళి, నర్సు స్రవంతి, నెక్కొండకు చెందిన ఉపేందర్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ పూర్ణిమ సహకారంతో తన భార్యకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాడు. పుట్టబోయేది మళ్లీ ఆడపిల్లేనని తేలడంతో అప్పటికే మృతురాలి అభీష్టానికి భిన్నంగా రెండు దఫాలు ఆబార్షన్ చేయించారు. మరోవైపు అజారుద్దీన్ తన దూరపు బంధువైన మైనర్‌ను పెళ్ళి చేసుకుంటానని చెప్పాడు. పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న అజారుద్దీన్‌ను ప్రతిపాదనను ఆ బాలిక తిరస్కరించింది. తనకు భార్య, పిల్లలు ఉండటం కారణంగానే ఆ బాలిక పెళ్ళి అంగీకరించడం లేదని భావించిన అజారుద్దీన్‌… తన భార్య, పిల్లలపై కక్ష పెంచుకున్నాడు. ఇదే సంవత్సరం మార్చి నెలలో ఫరహాత్ మరోసారి గర్భం దాల్చింది. మళ్లీ ఆడపిల్లే పుడుతుందేమోననే అనుమానం పెరిగింది. దీంతో మళ్లీ అబార్షన్‌ చేయించుకోవాలని అజారుద్దీన్‌ తల్లిదండ్రులు, తమ్ముడు ఆమెతో గొడవ పడ్డారు. దీనికి తోడు బాలికను మరో పెళ్ళి చేసుకోవాలంటే భార్య,పిల్లలు బతికుండగా సాధ్యం కాదని, వారిని చంపడం ద్వారా ఇది సాధ్యమని అజారుద్దీన్‌ నిర్ణయించుకున్నాడు.

ఇందుకోసం నిందితుడు తాను అనుకున్న ప్రణాళిక ప్రకారం ఈ నెల 1వ తారీఖు రాత్రి సుమారు 7.50 గంటలకు ఐస్ క్రీం తినిపిస్తానని భార్య, పిల్లలను తాను నిర్వహిస్తున్న స్విమ్మింగ్‌పూల్‌ వద్దకు కారులో తీసుకొచ్చాడు. దీనికి ముందు ప్రణాళిక ప్రకారం నిందితుడు స్విమ్మింగ్ పూల్ వద్ద సీసీ కెమెరాలు, కరెంటు నిలిపి వేశాడు. భార్య, ఇద్దరు కుమార్తెలను బలవంతంగా స్విమ్మింగ్‌ పూల్ లోకి నెట్టివేశాడు. వాళ్లు బయటపడకుండా అడ్డుకున్నాడు. చనిపోయేంత వరకూ నీటిలో ముంచాడు.

ముగ్గురూ చనిపోయారని నిర్ధారించుకుని, తన భార్య, పిల్లలు స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయి మృతి చెందారని ప్రచారం చేశాడు. ఈ సంఘటనపై మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకొని నిందితుడు ఆజారుద్దీన్ తన భార్య, పిల్లలలను దారుణంగా హత్య చేసినట్లుగా నిర్థారణకు వచ్చారు.

ఇదిలా ఉండగా నిందితుల్లో స్రవంతిపై మూడు కేసులు, డా. పార్దు మీద నాలుగు కేసులు, పరారీలో వున్న డాక్టర్‌ పూర్ణిమపై నాలుగు కేసులు ఉన్నట్లుగా పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, మామూనూర్ ఏసీపీ వెంకటేష్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, గీసుగొండ ఇన్స్ స్పెక్టర్ విశ్వేశ్వర్, మామూనూర్ ఇన్స్ స్పెక్టర్ శ్రీనివాస్, ఐనవోలు, పర్వతగిరి, మామూనూర్ ఎస్.ఐ లు శ్రీనివాస్, ప్రవీణ్, శ్రీకాంత్, కానిస్టేబుళ్లు హేమకుమార్, శ్రీనివాస్ లను పోలీస్ కమిషనర్ అభినందించారు.