రైత‌న్న సేద్యం… “గ‌ద్ద‌ల‌” భోజ్యం

రబీ సీజన్‌లో దేశంలోని మొత్తం వ‌రి విస్తీర్ణంలో 60 శాతం వరి నాట్లు వేసింది తెలంగాణ రైతులు. అలా దాదాపు 60 లక్షల టన్నులకు పైబ‌డి వ‌రిని పండించిన ఘ‌న‌త తెలంగాణ రైతుల‌ది

రైత‌న్న సేద్యం… “గ‌ద్ద‌ల‌” భోజ్యం
  • సీజ‌న్‌కు రూ. 3 వేల కోట్లు విలువైన బియ్యం లెక్క పెద్ద‌ల‌కు
  • సీజ‌న్‌కు రూ. 1500 కోట్లు లెక్క స్థానిక నేత‌ల‌కు అమ్యామ్యా
  • రైతుల దోపిడీకి రైస్ మిల్ల‌ర్లే మ‌ధ్య‌వ‌ర్తులు
  • అందుకే తెలంగాణలో మిల్ల‌ర్ల‌పై దాడులు నిల్‌
  •  స‌గ‌టున‌ రైతు భూమిలో ప‌ది గుంట‌ల కోత‌
  •  రికార్డుల్లోకి ఎక్క‌ని భూమి ఎక్క‌డంటూ రైతు ఆందోళ‌న‌

విధాత‌: ”రబీ సీజన్‌లో దేశంలోని మొత్తం వ‌రి విస్తీర్ణంలో 60 శాతం వరి నాట్లు వేసింది తెలంగాణ రైతులు. అలా దాదాపు 60 లక్షల టన్నులకు పైబ‌డి వ‌రిని పండించిన ఘ‌న‌త తెలంగాణ రైతుల‌ది. అధికారుల‌ తాజా లెక్కల ప్రకారం, 9.82 లక్షల మంది రైతుల నుండి 60 ల‌క్ష‌ల క్వింటాళ్ల‌ వరిని సేకరించేందుకు రాష్ట్రం సుమారు రూ. 12,280 కోట్లు ఖర్చు చేసింది. కానీ రైతు క‌ష్టాన్ని రైసు మిల్ల‌ర్లు చాలా తెలివిగా కొల్ల‌గొడుతున్నారు. ర‌క‌ర‌కాల పేర్ల‌తో బ‌స్తాకు 10 కిలోల ధాన్యంతో పాటు ఒక‌ క్వింటాకు 5 కిలోల‌పైన బియ్యం మాయం చేసి స్థానిక నేత‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కూ మేపుతున్న‌ట్లు రైతులు చెపుతున్నారు. తెలంగాణ‌లో ఇలా ర‌బీ సీజ‌న్‌లో రైతుల నుంచి కొట్టేసి అమ్ముకున్న ధాన్యం విలువ రూ. 4500 కోట్ల పైమాటే అంటున్నారు. ఇందులో కొంత మంది ముఖ్య నేత‌లకు 3 వేల కోట్లు, స్థానిక నేత‌ల‌కు, అధికారులకు రూ. 1500 కోట్లు ముట్టిన‌ట్లు మిల్ల‌ర్లే బాహాటంగా చెప్పుకుంటున్నారు”.

తెలంగాణ రైతు క‌ష్టం గ‌ద్ద‌ల‌పాలు అవుతోంది. కాయ‌క‌ష్టం చేసి రైతు సాగు చేసి పండించిన‌ వ‌రి ధాన్యం రైతు ఇంట సిరులు కురిపించ‌డం లేదుకానీ, అధికార పార్టీకి చెందిన స్థానిక నేత‌ల నుంచి ముఖ్య నేత‌ల వ‌ర‌కూ కాసుల వ‌ర్షం కురిపిస్తోంద‌ని రైతులు వాపోతున్నారు. రైతు పండించిన ధాన్యం మిల్లుకు తీసుకుపోతే మిల్ల‌ర్లు చేస్తున్న మోసం అంతా ఇంతా కాద‌ని ల‌బోదిబోమంటున్నారు. మిల్ల‌ర్ల దోపిడీ ఇష్టారాజ్యం వ‌ల్ల ధాన్యం దోపిడీకి అడ్డు అదుపూ లేకుండా సాగుతోంద‌ని, త‌రుగు పేరుతో బ‌స్తాకు10 కిలోల కోత‌పెడుతున్న ప్ర‌శ్నించే నాథుడు లేడ‌ని అన్న‌దాత‌లు ఆందోళ‌న చెందుతున్నారు. అద‌నంగా మ‌ర ఆడించగా వ‌చ్చిన బియ్యంలోనూ చేతి వాటం చూపిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

క్వింటా ధాన్యం ఆడితే 5 కిలోలు మాయం?

తెలంగాణ వ్యాప్తంగా రైసు మిల్ల‌ర్లు మ‌ధ్య వ‌ర్తులుగా అధికార పెద్ద‌లు వ‌రి పేరుతో వంద‌లు, వేల కోట్ల దోపిడీకి తెర‌లేపారన్న ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. మిల్లుల్లో ఒక క్వింటాల్‌ ధాన్యం ఆడిస్తే, బాయిల్డ్ రైస్ అయితే 70 కిలోలు బియ్యం వ‌స్తాయి. కానీ మిల్ల‌ర్లు 65 కిలోలే రికార్డుల్లో చూపించి 5 కిలోలు మాయం చేస్తున్న‌ట్లు రైతులు ఆరోపిస్తున్నారు. రా రైస్‌లో సాధార‌ణం ర‌కం అయితే క్వింటాల్ కు 65 కిలోలు బియ్యం వ‌స్తాయి, ఫైన్ క్వాలిటీ ధాన్యం ఆడిస్తే 67 కిలోల బియ్యం వ‌స్తాయి. ఇక్క‌డా రైతుల‌కు నిండా మోసం జ‌రుగుతోంది.. మిల్ల‌ర్లు రైతుల‌కు, రికార్డుల్లో 60 కిలోలు బియ్యం వ‌చ్చిన‌ట్లు చూపించి మిగ‌తావి మాయం చేస్తున్నారని క‌రీంన‌గ‌ర్‌ జిల్లా హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన రైతు మోహ‌న్‌రెడ్డి వాపోయారు.

మోసం, ద‌గాల‌కు కేరాఫ్ ఐకేపీ కేంద్రాలు?

ఇక ధాన్యం కొనుగోలు కోసం ప్ర‌భుత్వం పెట్టిన ఐకేపీ కేంద్రాలు రైతుల శ్ర‌మ‌ను ఆసాంతం దోచేస్తున్నాయన్న విమ‌ర్శ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఆరుగాలం క‌ష్ట‌ప‌డ్డ రైతుకు ఎంత పంట పండినా చేసిన అప్పుల‌కు త‌ప్ప చేతిలో చిల్లిగ‌వ్వ మిగ‌ల‌డం లేదు. ఐకేపీ కేంద్రాల్లో కొంటున్న ధాన్యంలో బ‌స్తాకు 5 కిలోలు తేమ‌పేరుతో, మ‌ట్టిపేరుతో 2కిలోలు, తాలు పేరుతో 2 కిలోలు, గోనెసంచి పేరుతో కిలో మాయం తీసేస్తున్నార‌ని రైతులు గ‌గ్గోలు పెడుతున్నారు. అంటే మొత్తం బ‌స్తాకు 10 కిలోలు త‌రుగు చూపిస్తున్నారన్నార‌ని జ‌గిత్యాల జిల్లాకు చెందిన ఒక రైతు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నిజానికి ఈ త‌రుగు మిల్ల‌ర్ల‌కు మిగులుగా ఉంటోంది. ఇలా త‌రుగు పేరుతో కొట్టేసిన ధాన్యంలో అధికార పార్టీ స్థానిక‌ నేత‌ల‌కు వాటాల రూపంలో చెల్లిస్తున్న‌ట్లు ఆఫ్ ద రికార్డుగా మిల్ల‌ర్లే వాపోతున్నారు. స్థానిక నేత‌ల నుంచి ముఖ్య నేత‌ల వ‌ర‌కూ ఈ దందాలో సీజ‌న్ సీజ‌న్‌కు కోట్ల‌కు కోట్లు ఆదాయం వ‌చ్చిప‌డుతోందని రైతు సంఘం నేత‌లు ఆరోపిస్తున్నారు.

ఈ ర‌బీ సీజ‌న్‌లో ప్ర‌భుత్వం 60 ల‌క్ష‌ల క్వింటాళ్ల‌ వ‌రిని సేక‌రించింది. ఈ 60 ల‌క్ష‌ల క్వింటాళ్ల‌ సేక‌ర‌ణ‌లో త‌రుగు, తేమ‌, మ‌ట్టి, తాలు పేరుతో బ‌స్తాకు 10 కిలోలు మ‌ర ఆడించే ట‌ప్పుడు ఒక క్వింటాల్‌ ధాన్యానికి 5 కిలోల బియ్యం చొప్పున దాచేసిన ధాన్యం, బియ్యం విలువ రూ.4500 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఉంటుందని పేరు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌ని అధికారి తెలిపారు. ఇదే విష‌యాన్ని ఒక రైతు సంఘం నాయ‌కుడు కూడా అంగీక‌రించాడు. ఈ దోపిడీపై ప్ర‌శ్నించే రైతుల‌కు మిల్ల‌ర్లు అదిలించి, బెదిరించి, బుజ్జ‌గించి డ‌బ్బులిచ్చి స‌ముదాయిస్తున్న సంఘ‌ట‌లు అక్క‌డ‌క్క‌డా ఉన్నాయ‌ని ఆ రైతు సంఘం నాయ‌కుడు వెల్ల‌డించారు.

రైతు బంధు పేరుతో ఎక‌రాకు రూ.12 వేలు ఇస్తూ, ధ‌ర‌ణిలో 10 గుంట‌ల భూమిని మాయం చేస్తున్నార‌ని రైతు మోహ‌న్‌రెడ్డి తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నా 10 గుంట‌ల భూమిని రికార్డులో మాయం చేశార‌ని ఏ అధికారిని అడిగినా తాము ఏమి చేయ‌లేమ‌ని స‌మాధానం ఇస్తార‌ని వాపోయాడు. ఇప్ప‌డున్న మార్కెట్ ధ‌ర‌ల ప్ర‌కారం చూస్తే, 10 గుంట‌ల భూమితో దాదాపు రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కు న‌ష్ట‌పోయాన‌ని తెలిపారు. రైతు బంధు పేరుతో 12 వేలు ఇచ్చి ధ‌ర‌ణి పేరుతో 10 ల‌క్ష‌ల న‌ష్టం చేశార‌ని ఇదేం ప‌రిపాల‌న అని స‌ద‌రు రైతు స‌ర్కారు తీరుపై సీరియ‌స్ అయ్యాడు.

మూడేళ్లుగా నిరంత‌ర దోపిడి

మూడేళ్లుగా ఐకేపీ కేంద్రాల పేరుతో మిల్ల‌ర్లు, ప్ర‌భుత్వ పెద్ద‌లు కుమ్మ‌క్కై వంద‌ల కోట్ల రూపాయ‌లు దోపిడి చేస్తున్నార‌ని అఖిల భార‌త కిసాన్ స‌భ ఉపాధ్య‌క్షుడు సారంప‌ల్లి మ‌ల్లారెడ్డి ఆరోపించారు. తూకం వేయ‌క ముందు త‌రుగు తీస్తున్నార‌ని, తూకం వేస‌పిన త‌రువాత కూడా త‌రుగు తీస్తున్నార‌న్నారు. ఈ త‌రుగుల‌న్నీ తీసిన త‌రువాత రూ.1000 బిల్లు ఇస్తే ఇందులో నుంచి న‌గ‌దుగా కేవ‌లం రూ.800 మాత్ర‌మే చెల్లిస్తున్నార‌ని ఆరోపించారు. మిగిలిన రూ. 200 ల గురించి అడిగితే వినిపించుకునే నాధుడే లేడ‌న్నారు. ఐకేపీ సెంట‌ర్లే ఒక బోగ‌స్ అని అన్నారు. ఐకేపీల‌లో జ‌రిగే ధాన్యం దోపిడీపై రైతులు ఎన్ని సార్లు ఆందోళ‌న‌లు చేసినా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. తూకంలో ఎఫ్ఏక్యూ నామ్స్ ప‌ట్టించుకునే వాడులేడ‌ని ఆరోపించారు. బీఆరెస్ ప్ర‌భుత్వంలో ఇచ్చే రైతు బంధు ద్వారా రైతుల‌కు మేలు క‌న్నా న‌ష్ట‌మే ఎక్కువ‌గా జ‌రుగుతుంద‌న్నారు. ప‌క్క రాష్ట్రాలు ఇచ్చిన‌ట్లుగా పండించిన ధాన్యానికి బోన‌స్ ఇస్తే క‌ష్టం చేసి పంట పండించిన రైతుకు మేలు జ‌రుగుతుంద‌న్నారు. కానీ ప్ర‌స్తుతం అనుసరిస్తున్న ఈ విధానంలో రైతు తీవ్ర అసంతృప్తి, ఆగ్ర‌హంతో ఉన్నాడ‌ని సారంప‌ల్లి మ‌ల్లారెడ్డి విధాత ప్ర‌తినిధికు తెలిపారు.