ఇదంతా ఉప ఎన్నిక వ‌రకేనా! ఆ రెండు పార్టీలు అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా

ఉన్నమాట: ప్ర‌జాపంపిణీ వ్య‌వ‌స్థ (పీడీఎస్‌)లో కేంద్రం ప్ర‌భుత్వం వాటా ఉన్న‌ది. కాబ‌ట్టి రేష‌న్ షాపుల్లో ప్ర‌ధాని ఫొటో పెట్టలేద‌ని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ కామారెడ్డి క‌లెక్ట‌ర్‌తో వాగ్వాదానికి దిగారు. దీనిపై సోష‌ల్ మీడియాలో, ప్ర‌ధాన మీడియాలో చ‌ర్చ జ‌రిగింది. కేంద్ర ప్ర‌భుత్వానికి నిధులు ఎక్క‌డి నుంచి వ‌స్తున్నాయి? అన్న‌ది మొద‌టి ప్ర‌శ్న అయితే, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే ప్ర‌శ్న అడుగుతున్నారా? అన్న‌ది రెండో ప్ర‌శ్న‌. ఎందుకంటే ఏపీలో బీజేపీ నేత‌లు కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌నే […]

ఇదంతా ఉప ఎన్నిక వ‌రకేనా! ఆ రెండు పార్టీలు అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా

ఉన్నమాట: ప్ర‌జాపంపిణీ వ్య‌వ‌స్థ (పీడీఎస్‌)లో కేంద్రం ప్ర‌భుత్వం వాటా ఉన్న‌ది. కాబ‌ట్టి రేష‌న్ షాపుల్లో ప్ర‌ధాని ఫొటో పెట్టలేద‌ని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ కామారెడ్డి క‌లెక్ట‌ర్‌తో వాగ్వాదానికి దిగారు. దీనిపై సోష‌ల్ మీడియాలో, ప్ర‌ధాన మీడియాలో చ‌ర్చ జ‌రిగింది. కేంద్ర ప్ర‌భుత్వానికి నిధులు ఎక్క‌డి నుంచి వ‌స్తున్నాయి? అన్న‌ది మొద‌టి ప్ర‌శ్న అయితే, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే ప్ర‌శ్న అడుగుతున్నారా? అన్న‌ది రెండో ప్ర‌శ్న‌.

ఎందుకంటే ఏపీలో బీజేపీ నేత‌లు కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌నే రాష్ట్ర ప్ర‌భుత్వం పేర్లు మార్చి అమ‌లు చేస్తున్న‌ద‌ని ఆరోపిస్తున్నారు. కేంద్ర మంత్రి డిమాండ్ చేసిన‌ట్టే అక్క‌డ కూడా బీజేపీ నేత‌లు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని చాలా కాలంగా నిల‌దీస్తున్నారు. కానీ దీనిపై అటు బీజేపీ అధిష్ఠాన పెద్ద‌లు గాని, కేంద్ర మంత్రులు గానీ వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఎన్న‌డూ అడ‌గటం లేదు.

ఎందుకంటే.. ఆ ప్ర‌భుత్వంతో బీజేపీకి ఎలాంటి రాజ‌కీయ స‌మ‌స్య‌లు లేవు. అలాగే ఆ మ‌ధ్య ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ అన్న‌ట్లు ఏపీలో ఎవ‌రు గెలిచినా ఆ రాష్ట్రంలోని 25 లోక్‌స‌భ స‌భ్యుల మ‌ద్ద‌తు బీజేపీకే ఉంటుంద‌న్నారు. ఆయ‌న అన్న‌ట్టే రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ద్రౌప‌ది ముర్ముకు వంద శాతం ఓట్లు అక్క‌డ వ‌చ్చాయి.

అలాగే రేష‌న్ షాపుల్లో ప్ర‌ధాని ఫొటో పెట్టాల్సిందే అంటే అది రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకోవాల్సిన విధాన‌ ప‌ర‌మైన నిర్ణ‌యం. దీనిపై కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి ఒక లెట‌ర్ రాసి వివ‌ర‌ణ తీసుకోవ‌చ్చు. ఫొటో పెట్టాల‌ని కోర‌వ‌చ్చు. ఈ విష‌యాలు కేంద్ర మంత్రికి తెలియ‌వ‌ని అనుకోలేము.

అయితే కొంత కాలంగా సీఎం కేసీఆర్ కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నారు. మోదీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతున్నారు. ఇదే బీజేపీ పెద్ద‌ల‌కు కంట‌గింపుగా మారింది. అందుకే కేంద్ర ప్ర‌భుత్వ విధానాల ప్ర‌శ్నించ‌కుండా, ఆ ప్ర‌భుత్వం ఎన్ని ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాలు తీసుకున్నా మౌనంగా ఉండే రాష్ట్ర ప్ర‌భుత్వాల జోలికి వెళ్ల‌డం లేదు.

వారిని ఏదీ ప్ర‌శ్నించ‌డం లేదు. కానీ కేంద్రాన్ని ప్ర‌శ్నిస్తే చాలు ఫొటోల గురించి, ఆ రాష్ట్ర ప్ర‌భుత్వాల అప్పుల గురించి, అలాగే కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల ఎందుకు అమ‌లు అమ‌లు చేయ‌డం లేద‌ని ఇట్లా అనేక విష‌యాలు ప్ర‌స్తావించ‌డం కొంత‌కాలంగా చూస్తున్నాం.

ఎఫ్ఆర్‌బీఎం ప‌రిధికి లోబ‌డే అప్పులు చేస్తున్నామ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం వాదిస్తుంటే రాష్ట్ర ప్ర‌భుత్వ అప్పుల భారం పెరుగుతున్న‌ద‌ని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అయితే కేంద్ర ప్ర‌భుత్వమే విడుద‌ల చేసిన అప్పుల రాష్ట్రాల జాబితాలో మొద‌టి ప‌ది స్థానాల్లో తెలంగాణ రాష్ట్రంలో లేదు. మ‌రి మిగ‌తా రాష్ట్రాల‌కు తెలంగాణ రాష్ట్రానికి విధిస్తున్న నిబంధ‌న‌లే అమ‌లు చేస్తున్నారా అనే ప్ర‌శ్న కూడా ఉత్ప‌న్న‌మౌతున్న‌ది.

అంతేకాదు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల వైఫ‌ల్యాలపై అటు టీఆర్ఎస్‌, ఇటు బీజేపీ ఇప్పుడు ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. కానీ ఇంత‌కాలం ఈ రెండు పార్టీలు మౌనంగా ఎందుకు ఉన్నాయని నెటిజ‌న్లు నిల‌దీస్తుంటే.. మునుగోడు ఉప ఎన్నిక అయిపోయే దాకా ఈ వాదోపవాదాలు కొన‌సాగుతాయ‌ని మ‌రికొంద‌రు అంటున్నారు.