Miriam Long : ఒక్కోసారి చిన్నచిన్న పొరపాట్లకే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కొన్ని పొరపాట్లు సంసారాల్లో చిచ్చుపెడుతాయి. మరికొన్ని పొరపాట్లు ఆర్థికంగా దెబ్బతీస్తాయి. ఇంకొన్ని పొరపాట్లు ఏకంగా ప్రాణాలనే తీస్తాయి. డిజిటల్ లావాదేవీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్నచిన్న పొరపాట్లు చేసి వేలు, లక్షలు పోగొట్టుకున్న వాళ్లు ఎందరో ఉన్నారు. కానీ అమెరికాలోని వర్జీనియాలో మిరియం లాంగ్ అనే మహిళ చేసిన పొరపాటుకు నష్టానికి బదులు ఏకంగా రూ.8 కోట్ల లాభం వచ్చింది. అదెలాగో తెలుసుకుందాం..
మిరియం లాంగ్ ఇటీవల వర్జీనియాలోని బ్లాక్స్బర్గ్ నగరంలో ఉన్న సౌత్ మెయిన్ స్ట్రీట్‌లోని సీవీఎస్ స్టోర్‌కి వెళ్లింది. పనిలో పనిగా స్టోర్‌లో ఉన్న వర్జీనియా లాటరీ వెండింగ్ మెషిన్ వద్దకు వెళ్లి ఒక బటన్ నొక్కింది. అయితే నొక్కాలనుకున్న బటన్ కాకుండా రాంగ్ బటన్ నొక్కింది. నిజానికి మిరియం మెగా మిలియన్స్ లాటరీ టికెట్ కొనాలనుకుంది. కానీ పొరపాటున వన్ మిలియన్ పవర్ బాల్ ప్రైజ్ టికెట్‌కు సంబంధించిన బటన్ నొక్కింది. దాంతో ఆమె అనుకున్నది కాకుండా వేరే టికెట్ వచ్చింది.
ఆ తర్వాత తనకు నచ్చిన టికెట్ కాకుండా పెద్దగా అక్కరకు రాని టికెట్ కొన్నానని కొన్నాళ్లు ఆవేదన చెందింది. తీరా లాటరీ డ్రా తీసిన తర్వాత ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే ఆ లాటరీలో మిరియం లాంగ్‌కు భారీ జాక్‌పాట్ తగిలిందది. ఏకంగా ఒక మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ వచ్చింది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.8 కోట్లు. పొరపాటున కొన్న లాటరీ టికెట్టే కోట్లు తెచ్చిపెట్టడంతో మిరియం సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది.
ఊహించని విధంగా జాక్‌పాట్ తగలడంతో ఆనందాన్ని పట్టలేకపోతున్నానని మిరియం తెలిపింది. పొరపాటున లాటరీ టికెట్ కొన్నా మంచే జరిగిందని సంతోషం వ్యక్తం చేసింది. ‘ఇది నా జీవితంలో చేసిన చాలా మంచి పొరపాటు’ అంటూ మురిసిపోయింది. ఇంత పెద్ద మొత్తం నగదు గెలుచుకున్నందుకు షాక్ తిన్నానని చెప్పింది. తన గుండె సంతోషంతో వేగంగా కొట్టుకుంటోందని తెలిపింది.