Munugode: రాజగోపాల్ కాదు.. రేవంతే వారి టార్గెట్?
ఉన్నమాట: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. అయితే అదే ఆ పార్టీని పతనావస్థకు తీసుకెళ్తున్నది. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసినా కాంగ్రెస్ క్యాడర్ పెద్దగా చెక్కు చెదరలేదు. అంతేకాదు ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తే ఆయన మూడో స్థానానికే పరిమితం అవుతారని వివిధ సర్వేలు వెల్లడించాయి. అయితే ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ మొదటి నుంచి రేవంత్‌రెడ్డి మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంపై విమర్శలు చేశారు. మాణిక్యం ఠాగూర్ పార్టీ […]

ఉన్నమాట: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. అయితే అదే ఆ పార్టీని పతనావస్థకు తీసుకెళ్తున్నది. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసినా కాంగ్రెస్ క్యాడర్ పెద్దగా చెక్కు చెదరలేదు. అంతేకాదు ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తే ఆయన మూడో స్థానానికే పరిమితం అవుతారని వివిధ సర్వేలు వెల్లడించాయి. అయితే ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ మొదటి నుంచి రేవంత్‌రెడ్డి మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంపై విమర్శలు చేశారు. మాణిక్యం ఠాగూర్ పార్టీ అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
అయితే వారి లక్ష్యం రేవంత్‌రెడ్డే అన్నది అందరికీ తెలిసిందే. రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంతో తనకు సంబంధం లేదంటూనే ఎంపీ వెంకట్‌రెడ్డి ఉప ఎన్నిక బాధ్యతల విషయంలో మాత్రం అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేసి పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటూ.. పరోక్షంగా తమ్ముడి గెలుపు కోసం క్యాడర్ పనిచేయాలని కోరినట్టు వార్తలు కూడా వచ్చాయి.
నిజానికి మునుగోడు కాంగ్రెస్ కంచు కోట. అక్కడ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని రేవంత్‌తో పాటు మధుయాష్కీ, భట్టి విక్రమార్క లాంటి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఉమ్మడి నల్గొండ సీనియర్ నేతలైన జానారెడ్డి, దామోదర్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు రేవంత్ రెడ్డి ప్రయత్నాలను అడ్డుకునే విధంగా వ్యవహరించారు.
ప్రధానంగా అక్కడ పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉండబోతున్నదని స్పష్టమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు రాజగోపాల్ రెడ్డిని, అటు టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొవాలంటే బలమైన నేత కావాలని… అందుకు కృష్ణారెడ్డి అయితే మునుగోడు స్థానాన్ని నిలబెట్టుకోవచ్చని కార్యకర్తలు, నియోజకవర్గ నాయకులు భావించారు. రేవంత్ రెడ్డి కూడా మునుగోడు ఉప ఎన్నిక సెమీ ఫైనల్‌గా తీసుకుని చండూరు సభ ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీలను ఓడించేలా కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.
అయితే ఇప్పటికే తమను పరిగణనలోకి తీసుకోవడం లేదని, ఈ ఉప ఎన్నికలో గెలిస్తే ఎక్కడ రేవంత్‌కు అధిష్టానం దగ్గర మరింత ప్రాధాన్యం పెరుగుతుందనే అక్కసు సీనియర్ నేతల్లో మొదలైందట. అందుకే పార్టీ గెలుపు కంటే ఓటమే లక్ష్యంగా వారు యత్నిస్తున్నారని నియోజకవర్గంలో టాక్ నడుస్తున్నది.
దివంగత పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి కూతురు స్రవంతిపై ఎవరికీ భేదాభిప్రాయాలు లేకున్నా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడ కృష్ణారెడ్డి మాత్రమే సరైన అభ్యర్థి అనే అభిప్రాయం కార్యకర్తల్లో ఉన్నది. కానీ ఈ ముగ్గురు సీనియర్ నేతలు అధిష్ఠానాన్ని ఒప్పించి స్రవంతికి టికెట్ ఇప్పించడంతో మొన్నటి దాకా రాజగోపాల్ పిలిచినా వెళ్లని క్యాడర్ అంతా ఇప్పుడు మూకుమ్మడిగా బీజేపీ వైపు వెళ్తున్నారట. దీనికి ఈ సీనియర్ల వైఖరే కారణమట.
రేవంత్ రెడ్డిని ఏదో చేయబోయి కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గంలో కనుమరుగు చేసేలా వాళ్ల వ్యవహారశైలి ఉన్నదని కార్యకర్తలు వాపోతున్నారట. ఉప ఎన్నికలు ఎప్పుడూ అధికార పార్టీకే అనుకూలంగా ఉంటుంది. అయితే మునుగోడులో నెల రోజుల కిందట ఆ పరిస్థితి లేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టు ఉన్నది.
కమ్యూనిస్టులకు కూడా దాదాపు 5-6 శాతం ఓటు బ్యాంకు ఉన్నదని వారిని కలుపుకోకపోతే గెలుపు కష్టమనే గులాబీ బాస్ భావించి వారి మద్దతు కూడగట్టారు. అయితే ఈ సీనియర్ నేతలు ఇవేవీ ఆలోచించకుండా రేవంత్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారట.
అలాగే నియోజకవర్గ ఎంపీ వెంకట్‌రెడ్డి కూడా తెర వెనుక చేస్తున్న రాజకీయాలు, జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డిల అనాలోచిత నిర్ణయాలతో కార్యకర్తలు నైరాశ్యం నెలకొన్నదట. అందుకే వాళ్లంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యే పరిస్థితికి తీసుకొచ్చారట.
అక్కడ ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే ఆ ఉప ఎన్నిక బాధ్యతల నుంచి రేవంత్‌ను దూరం చేశామని సీనియర్లు అనుకుంటున్నారు. కానీ గెలిచినా ఓడినా ఆయన పోయేది ఏమీ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి అన్నది ఆలోచించడం లేదని నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలు సీనియర్ నేతలపై మండి పడుతున్నారట. రేవంత్‌ను ఏదో చేయబోయి వాళ్లే బొక్క బోర్లా పడబోతున్నారని అంటున్నారు.