మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్తు పోరాటం: సునీల్ భన్సల్

విధాత, నల్గొండ: మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో బీజేపీ గెలుపుతో రాష్ట్రంలో నియంతృత్వ సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనపోయి రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జి సునీల్ భన్సల్ అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ బీజేపీ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన భన్సల్ మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త అహర్నిశలు పనిచేసి మునుగోడు ఎన్నికల ప్రాధాన్యతను ప్రజలకు వివరించేందుకు కృషి […]

మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్తు పోరాటం: సునీల్ భన్సల్

విధాత, నల్గొండ: మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో బీజేపీ గెలుపుతో రాష్ట్రంలో నియంతృత్వ సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనపోయి రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జి సునీల్ భన్సల్ అన్నారు.

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ బీజేపీ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన భన్సల్ మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త అహర్నిశలు పనిచేసి మునుగోడు ఎన్నికల ప్రాధాన్యతను ప్రజలకు వివరించేందుకు కృషి చేయాలన్నారు. పార్టీ ప్రచారంలో అనుసరించాల్సిన తీరును వివరించారు.

పార్టీలోకి వస్తున్న కొత్త వారికి పార్టీ బలోపేతం దృష్ట్యా స్వాగతించి సమన్వయం తో పనిచేయాలని సూచించారు.మునుగోడులో బీజేపీ గెలువబోతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్తు సంబంధించిన పోరాటమన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఆత్మ గౌరవాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడిన తరహాలో మునుగోడు ప్రజలు కూడా సీఎం కేసీఆర్ కుటుంబ, అవినీతి, నియంతృత్వ పాలనకు బుద్ధి చెప్పే తీర్పునివ్వాలన్నారు.

ప్రజలు ఎనుకున్న ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడినివ్వకుండా, నేరుగా కలిసి చెప్పుకునేందుకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా, సమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వకుండా ప్రజాతీర్పును అవమానించారన్నారు. మునుగోడు ప్రజలు ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి బాటలు వేసినట్లవుతుందని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సహకారం తో డబుల్ ఇంజన్ ప్రభుత్వం వచ్చి తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.

మునుగోడు పార్టీ ఇంచార్జీ మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ.. మునుగోడులో ఓటమి భయంతోటే ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం కేసీఆర్ భారత రాష్ట్ర సమితి అంటూ జాతీయ రాజకీయాల డ్రామా చేస్తున్నారన్నారు. మసీ బూసీ గారడి మాటలు మాట్లాడి ప్రజలను మోసం చేయడం అలవాటుగా మారిపోయిందన్నారు.

రాష్ట్రంలో అవినీతి నియంతృత్వ పాలన సాగించిన కేసీఆర్ ఇంకా భారత దేశంలో ప్రజలను ఉద్దరిస్తానంటూ మాయమాటలు చెబుతున్నాడని విమర్శించారు. మునుగోడు బై ఎలక్షన్ ఫ్రీ ఫైనల్ లాంటిదని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే పేదలకు ఇండ్ల సమస్య తీరుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ, కాళేశ్వరం స్కీం లను స్కామ్ లుగా మార్చి వేల కోట్ల అవినీతి చేశారన్నారు.

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నేను పెట్టిన కన్నీళ్లు, బాధ రాజగోపాల్ రెడ్డి కి రానివ్వనని, బీజేపీ పార్టీ ఎక్కడ ఉంది అన్న వాళ్లకు ఈ మునుగోడు, నల్లగొండ ప్రజలు త్వరలో చూపిస్తారన్నారు. రేపు ఖమ్మంలో కూడా బీజేపీ రాబోతోందన్నారు. ఏ ఆశయం కోసం తెలంగాణ రాష్టాన్ని సాధించుకున్నామో అదంతా 8 సంవత్సరాల్లో కనుమరుగైపోయిందని,
బాగుపడ్డది ఒక కేసీఆర్ కుటుంబమేనన్నారు. పదవులకు రాజీనామాలతో ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని రగిలించామని, ఈనాడు కేసీఆర్ అహంకారాన్నీ బొంద పెట్టడానికి మళ్ళీ రాజీనామా ఉద్యమానికి శ్రీకారం చుట్టామన్నారు.

రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం వేరే పార్టీలోకి పోయేది ఉంటే ఆనాడు కాంగ్రెస్ నుంచి 12 మంది పోయినప్పుడే పొయ్యేవాడన్నారు. భారత దేశం లో పార్టీ పెడుతా అనుకుంటున్నావ్ గా యూపీ, బీహార్ కి పొయ్యి సత్తా ఉందా కేసీఆర్ అంటూ ప్రశ్నించారు. ఆరునూరైన మునుగోడు ఎన్నికలలో బీజేపీ గెలుస్తుందన్నారు.

ఈ సమావేశంలో మాజీ ఎంపీకొండా విశ్వేశ్వర్ రెడ్డి, పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులుశ్రీదర్ రెడ్డి, నాయకులు గార్లపాటి జితేంద్ర కుమార్ , బండారు ప్రసాద్ , మైనార్టీ రాష్ట్ర నాయకులు సయ్య ద్ పాషా, శక్తి కేంద్రాల ఇంచార్జిలు, మోర్చాల అధ్యక్షులు జిల్లా, మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు