ఉత్తరాన బీజేపీకి ఎదురుగాలి
విధాత : దేశంలో కొత్తగాలి వీస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ పాలనకు వ్యతిరేకంగా వ్యతిరేకపవనాలు మొదలయ్యాయని దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికలు సూచిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తరభారతంలో హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలలో జరిగిన ఉప ఎన్నికలలో దాదాపు అన్ని స్థానాల్లో బీజేపీ ఓటమి పాలయింది. హిమాచల్‌లో బీజేపీకి చెందిన మండి లోక్‌సభ స్థానాన్ని సైతం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ ఈ స్థానాన్ని నాలుగు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచింది. మూడు అసెంబ్లీ స్థానాల్లో […]

విధాత : దేశంలో కొత్తగాలి వీస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ పాలనకు వ్యతిరేకంగా వ్యతిరేకపవనాలు మొదలయ్యాయని దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికలు సూచిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తరభారతంలో హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలలో జరిగిన ఉప ఎన్నికలలో దాదాపు అన్ని స్థానాల్లో బీజేపీ ఓటమి పాలయింది. హిమాచల్‌లో బీజేపీకి చెందిన మండి లోక్‌సభ స్థానాన్ని సైతం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ ఈ స్థానాన్ని నాలుగు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచింది. మూడు అసెంబ్లీ స్థానాల్లో కూడా బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.
రాజస్థాన్‌లో రెండు అసెంబ్లీ స్థానాల్లో మంచి మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా జుబాల్-కోల్‌ఖాయి అసెంబ్లీ స్థానంలో డిపాజిటు కూడా కోల్పోయింది. రెండు స్థానాల్లో ఒకటి మొన్నటివరకు బీజేపీ ప్రాతినిధ్యం వహించింది. ధరియావాడ్ లో బీజేపీ మూడవస్థానానికి పడిపోగా, వల్లభ్‌నగర్‌లో నాలుగోస్థానానికి పడిపోయింది. హర్యానాలో అభయ్ చౌతాలా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాజీనామా చేసి ఈ ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి మంచి మెజారిటీతో విజయం సాధించారు.
హిమాచల్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో కూడా 30 ఏళ్లుగా బీజేపీ గెలుస్తున్న స్థానాన్ని ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అయితే కాంగ్రెస్‌కు బలమైన ఒక నియోజకవర్గాన్ని ఈ సారి బీజేపీ గెలిచింది. బెంగాల్‌లో నాలుగు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అన్నీ తృణమూల్ కాంగ్రెస్ భారీ మెజారిటీతో కైవసం చేసుకుంది. బీహార్‌లో రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం బొటాబొటి మెజారిటీతో అధికార జేడీయూ గెలిచింది.
మార్చి-మే 2022లో పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలను ఒక కొలమానంగా భావిస్తున్నారు. వ్యవసాయ చట్టాలతోపాటు అధిక ధరలు ఉప ఎన్నికలను బాగా ప్రభావితం చేసినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తర భారతం అంతటా ఇదే ధోరణి ప్రబలితే బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. బీజేపీ ఇప్పటికే దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో ఒక వేళ సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వ వ్యతిరేక శక్తులను కూడగట్టగలిగితే బీజేపీకి గడ్డు పరిస్థితి తప్పక పోవచ్చు. 2019 ఎన్నికల సమయంలో నరేంద్రమోడీపై వ్యతిరేకత లేదు. ఆయన మరోసారి గెలవాలన్న ఆకాంక్ష అప్పట్లో బలంగా ఉండింది. ఏ నాయకుడికయినా రాజకీయాల్లో ఒకసారి ఘనమైన విజయం లభిస్తుంది.
నరేంద్రమోడీకి 2019 ఎన్నికల ఫలితాలే ఘన విజయం. అంతకంటే ఘనమైన విజయం ఆయన ఇక చూడలేరు. పైగా గత సార్వత్రిక ఎన్నికలనాడు మిత్ర పక్షాలుగా ఉన్న శివసేన, శిరోమణి అకాలీదళ్ ఇప్పుడాయనతో లేవు. నితీష్‌కుమార్ నాయకత్వంలోని జేడీయూ కూడా అయిష్టమైత్రినే కొనసాగిస్తున్నది. ఆర్జేడీ, జేడీయూ కూటముల మధ్య ఢీ అంటే ఢీ అన్నట్టుగా పోటీ ఉంది. వచ్చే ఎన్నికల నాటికి అది ఎటువంటి రూపుదాల్చుతుందో తెలియదు.
బీజేపీకి ఆశాజనకంగా ఉన్నది ఒక్క ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే. అక్కడ అన్ని రాష్ట్రాలు కలిపినా ఉన్నది 25 లోక్‌సభ స్థానాలు మాత్రమే. గత ఎన్నికల్లోనే అక్కడ పద్నాలుగు స్థానాలను గెలిచింది. వచ్చే ఎన్నికల్లో ఇంతకంటే పెరిగే అవకాశం లేదు.