చెప్పుల్లో జిపీఎస్​ ట్రాకర్​తో భార్య భండారం బట్టబయలు చేసిన భర్త

అనుమానంతో భార్య చెప్పుల్లో GPS ట్రాకర్ పెట్టిన భర్త, లొకేషన్ ఆధారంగా ప్రియుడితో ఉన్నప్పుడు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నాడు. ఘర్షణ పెరిగి విషయం చివరికి పోలీస్ స్టేషన్​కు చేరింది.  

Reported by: ADHARVA | వైరల్ న్యూస్ | Apr 11, 2026, 11:09 pm IST
Read Time: 5 mins
చెప్పుల్లో జిపీఎస్​ ట్రాకర్​తో భార్య భండారం బట్టబయలు చేసిన భర్త చెప్పుల్లో దాచిన జిపీఎస్ ట్రాకర్‌తో భార్య కదలికలను గమనించిన భర్త… లొకేషన్ ఆధారంగా ఎదురెదురుపడి రోడ్డుపై ఘర్షణ. (AI ప్రతీకాత్మక చిత్రం)

Slippers reveal the truth: Husband shocks wife with hidden GPS

విధాత వైరల్​ డెస్క్​ | హైదరాబాద్​:

అనుమానం… టెక్నాలజీ… గూఢచర్యం… చివరికి రోడ్డుమీద గొడవ! బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త, ఎవరూ ఊహించని విధంగా షాకింగ్ నిజాన్ని బయటపెట్టాడు.

అనుమానం పెరిగిచెప్పుల్లోనే ట్రాకర్

సినిమాల్లో జరిగే ఓ వింత ఘటన బీహార్​ రాజధాని పాట్నాలో జరిగింది. పాట్నాలోని ఫుల్వారిశరీఫ్ ప్రాంతానికి చెందిన ఏకతానగర్ నివాసికి  తన భార్య ప్రవర్తనపై కొంతకాలంగా అనుమానం వచ్చింది. తరచూ బయటకు వెళ్లడం, అడిగితే సరైన సమాధానం ఇవ్వకపోవడం వంటి అంశాలు అతడిలో అనుమానాన్ని మరింత పెంచాయి. నేరుగా అడిగినా నిజం బయటపడదని భావించిన అతడు, టెక్నాలజీ సహాయంతో ఆమె కదలికలను గమనించాలని నిర్ణయించుకున్నాడు.

మార్కెట్‌లో లభించే చిన్న జిపిఎస్​ ట్రాకర్‌ను కొనుగోలు చేసి, ఎవరికి తెలియకుండా భార్య చెప్పుల సోల్​లో అమర్చాడు. ఈ పరికరం ద్వారా తన మొబైల్‌లో ఆమె లొకేషన్‌ను రియల్ టైమ్‌లో ట్రాక్ చేయగలిగేలా ప్లాన్ చేశాడు. భార్యకు ఈ విషయం తెలియకపోవడంతో, ఆమె తన పనుల నిమిత్తం బయటకు వెళ్లిన ప్రతిసారి భర్త ఆమె కదలికలను గమనించడం ప్రారంభించాడు. ఇలా కొద్ది రోజుల పాటు గమనించిన తర్వాత, ఒక రోజు ఆమె ఒకే ప్రదేశంలో ఎక్కువసేపు ఉన్నట్లు ట్రాకర్ ద్వారా కనిపించింది.

భార్య లొకేషన్కు చేరుకున్న భర్తరోడ్డుమీదే ఘర్షణ

ట్రాకర్‌లో కనిపించిన లొకేషన్ ఆధారంగా భర్త వెంటనే అక్కడికి చేరుకున్నాడు. అక్కడ తన భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటం గమనించి ఒక్కసారిగా తీవ్రఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే అక్కడే భార్యను, ఆమె ప్రియుడ్ని నిలదీసాడు. ఈ వాగ్వాదం క్రమంగా తీవ్రంగా మారి, రోడ్డుమీదే పెద్ద గొడవగా మారింది.

ఈ ఘటనను గమనించిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడ చేరడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న ఫుల్వారిషరీఫ్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, భర్త, భార్యతో పాటు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా కొంతసేపు వాగ్వాదం కొనసాగినట్లు పోలీసులు తెలిపారు.

స్టేషన్ హౌస్ ఆఫీసర్ షానవాజ్ అలం తెలిపిన ప్రకారం, సమాచారం అందగానే సంఘటన స్థలానికి చేరుకుని ముగ్గురినీ స్టేషన్‌కు తీసుకువచ్చామని, వారిమధ్య వివాదం కారణంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని చెప్పారు. అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు వారెవరూ అధికారికంగా ఫిర్యాదు చేయలేదని, విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.