లోకసంక్షేమం కోసం షోడశదిన సుందరకాండ దీక్ష
వసంత మండపంలో 16 రోజుల పాటు పారాయణం లోక సంక్షేమం కోసం, కరోనా వ్యాధిని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ షోడశదిన సుందరకాండ దీక్షను తిరుమలలోని వసంత మండపంలో సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఈ దీక్ష మే 18వ తేదీ వరకు జరుగనుంది. షోడషాక్షరి మహామంత్రం ప్రకారం మొదటి రోజు రా అనే అక్షరానికి ఉన్న బీజాక్షరాల ప్రకారం సుందరకాండలోని మొదటి సర్గలో 211, రెండో సర్గలో 58 కలిపి మొత్తం 269 శ్లోకాలను పారాయణం చేశారు. […]

వసంత మండపంలో 16 రోజుల పాటు పారాయణం
లోక సంక్షేమం కోసం, కరోనా వ్యాధిని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ షోడశదిన సుందరకాండ దీక్షను తిరుమలలోని వసంత మండపంలో సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఈ దీక్ష మే 18వ తేదీ వరకు జరుగనుంది.

షోడషాక్షరి మహామంత్రం ప్రకారం మొదటి రోజు రా అనే అక్షరానికి ఉన్న బీజాక్షరాల ప్రకారం సుందరకాండలోని మొదటి సర్గలో 211, రెండో సర్గలో 58 కలిపి మొత్తం 269 శ్లోకాలను పారాయణం చేశారు. అదేవిధంగా బాలరామాయణం, యోగవాశిష్ఠంలోని విషూచిక మహామంత్ర పారాయణం చేశారు. ఇందులో భాగంగా మొదట సంకల్పంతో ప్రారంభించి శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన చేశారు. ఆ తరువాత 16 మంది ఉపాసకులు శ్లోక పారాయణం చేశారు. మంగళవారం నాడు మూడో సర్గ నుండి ఆరో సర్గ వరకు మొత్తం 152 శ్లోకాలను పారాయణం చేయనున్నారు.

ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ ఆచార్య కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని మాట్లాడుతూ సీతా సమేతుడైన శ్రీరామచంద్రమూర్తి, ఆంజనేయస్వామివారి అనుగ్రహంతో ప్రపంచంలోని మానవులు ధర్మాని ఆచరిస్తూ, సకల శుభాలను పొందాలని ఆకాంక్షిస్తూ షోడశదిన సుందరకాండ దీక్ష కార్యక్రమాన్ని టిటిడి నిర్వహిస్తోందన్నారు. వసంత మండపంలో శ్లోక పారాయణంతోపాటు ధర్మగిరి వేద పాఠశాలలో మరో 16 మంది ఉపాసకులు 16 రోజుల పాటు జప, హోమ కార్యక్రమాలు నిర్వహిస్తారని వివరించారు.
శ్రీవారి సన్నిధిలోని వసంత మండపంలో షోడశదిన సుందరకాండ దీక్ష చాలా విశిష్టమైనది. ” రాఘవస్య పద ద్వంద్వం దద్యాదమిత వైభవమ్ ” అనే వాక్యాన్ని అనుసరించి సీతాపతి అయిన శ్రీరామచంద్రమూర్తి విజయాన్ని ఇచ్చుగాక అనే అర్థం కలిగివుంటుంది. ఇందులోని నియమాల ప్రకారం కటపయాది సంఖ్యలు పరిగణలోనికి తీసుకుంటే ఒక్కొక్క అక్షరానికి విలువను లెక్కించి, అందుకు అనుగుణంగా ఆయా రోజులలో అన్ని సర్గలు పారాయణం చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం ప్రతిరోజూ ఉదయం 8.30 గంటల నుండి ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
కార్యక్రమంలో ఆరోగ్యశాఖాధికారి డా.ఆర్ఆర్.రెడ్డి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ, తదితరులు పాల్గొన్నారు.