లోకక్షేమం కోసమే షోడశదిన సుందరకాండ దీక్ష
లోక సంక్షేమం కోసం, కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకు శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలో 16 రోజుల పాటు నిర్వహించిన షోడశదిన సుందరకాండ దీక్ష మంగళవారం మహాపూర్ణాహుతితో ముగిసిందని టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. మహాపూర్ణాహుతి కార్యక్రమంలో అదనపు ఈవో దంపతులు పాల్గొన్నారు.

లోక సంక్షేమం కోసం, కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకు శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలో 16 రోజుల పాటు నిర్వహించిన షోడశదిన సుందరకాండ దీక్ష మంగళవారం మహాపూర్ణాహుతితో ముగిసిందని టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. మహాపూర్ణాహుతి కార్యక్రమంలో అదనపు ఈవో దంపతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ ధర్మారెడ్డి మాట్లాడుతూ ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో ప్రస్తుతం నక్షత్రసత్ర మహాయాగం జరుగుతోందని, త్వరలో ధన్వంతరీ మహాయాగం నిర్వహిస్తామని తెలిపారు. నాదనీరాజనం వేదికపై సుందరకాండ పారాయణం పూర్తయిన తరువాత ఒకేరోజు అన్ని శ్లోకాలతో అఖండ పారాయణం నిర్వహిస్తామన్నారు. ఆ తరువాత యుద్ధకాండ పారాయణం చేపడతామన్నారు. ఎస్వీబీసీ ద్వారా ప్రసారమవుతున్న ఇలాంటి కార్యక్రమాలను భక్తులు తమ ఇళ్లలోనే వీక్షించి అనుసరించాలని కోరారు.
కాగా, ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలోని ప్రార్థనా మందిరంలో శ్రీ రామ విశ్వశాంతియాగంలో భాగంగా కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకు విశేష మంత్రాలతో సర్వకుండేషు విశేష ఉక్త హోమాలు చేపట్టారు. లోక క్షేమం కోసం 16 రోజుల పాటు వైఖానస పండితులు అకుంఠిత దీక్ష, శ్రద్ధలతో శ్రీ రామ మూల మంత్రానుష్ఠానం 6 లక్షలు, శ్రీ సీతాయై నమః మూల మంత్రానుష్ఠానం 6 లక్షలు, శ్రీ లక్ష్మణాయ నమః మూల మంత్రానుష్ఠానం 7 లక్షలు, శ్రీ హనుమతే నమః మూల మంత్రానుష్ఠానం 7 లక్షలు కలిసి మొత్తం 26 లక్షల సార్లు జపించారు.
ముందుగా టిటిడి వైఖానస ఆగమసలహాదారు శ్రీ నల్లూరి వెంకట మోహనరంగాచార్యులు పర్యవేక్షణలో భగవత్ ప్రార్థన, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, సర్వకుండేషు అగ్నిప్రణయణం, కుంభారాధన, అర్చన, నివేదన, నీరాజనం నిర్వహించారు. అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు హోమ శక్తి ద్వారా కుంభంలో నిక్షేపణ చేసిన కుంభ శక్తిని శ్రీరామచంద్రమూర్తికి ప్రోక్షణ చేసి, శ్రీ ఆంజనేయస్వామివారికి 16 కలశాలతో విశేష అభిషేకం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబిసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
అంతకుముందు తిరుమల వసంత మండపంలో ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని ఆధ్వర్యంలో సుందరకాండ శ్లోక పారాయణం ముగిసింది. ముగింపు రోజున శ్రీరామపట్టాభిషేకం శ్లోకాలను కూడా పఠించారు. వసంత మండపంలో '' రాఘవస్య పద ద్వంద్వం దద్యాదమిత వైభవమ్ '' అనే మహామంత్రం ప్రకారం సుందరకాండలోని మొత్తం 68 సర్గల్లో గల 2,821 శ్లోకాలను 16 మంది వేద పండితులు 16 రోజుల పాటు అత్యంత దీక్షాశ్రద్ధలతో పారాయణం చేశారు. అదేవిధంగా, ధర్మగిరి వేద పాఠశాలలో మరో 16 మంది వైఖానస పండితులు 16 రోజుల పాటు జప- తర్పణ- హోమాదులను నిర్వహించారు.
అనంతరం టిటిడి అదనపు ఈవో 32 మంది ఉపాసకులను శాలువతో సన్మానించి శ్రీవారి ప్రసాదం, సంభావన అందజేశారు.
ఈ కార్యక్రమంలో సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్, విజిఓ బాలిరెడ్డి, హెచ్‌డిపిపి కార్యనిర్వాహక మండలి సభ్యులు శ్రీ సుబ్బారావు ఇతర అధ్యాపకులు, వేద పండితులు పాల్గొన్నారు.