ఖమ్మం.. ‘కారు’లో ఏం జరుగుతుంది?

ఉన్నమాట: ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నది. అయితే ఇటీవల కేసీఆర్‌ సిట్టింగులను మార్చమని ప్రకటించడంతో రాజకీయంగా ఎవరికి వారు ఇప్పటి నుంచే అవకాశాల కోసం చూస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ బలంగానే ఉన్నది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం అంతటా ఉన్నప్పటికీ ఆ జిల్లాలో మాత్రం ఒక్క స్థానానికే పరిమితమైంది. మొదటిసారి కొత్తగూడెంలో జలగం వెంకట్రావు గెలవగా, రెండోసారి పువ్వాడ అజయ్‌ మాత్రమే గెలిచారు. […]

ఖమ్మం.. ‘కారు’లో ఏం జరుగుతుంది?

ఉన్నమాట: ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నది. అయితే ఇటీవల కేసీఆర్‌ సిట్టింగులను మార్చమని ప్రకటించడంతో రాజకీయంగా ఎవరికి వారు ఇప్పటి నుంచే అవకాశాల కోసం చూస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ బలంగానే ఉన్నది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం అంతటా ఉన్నప్పటికీ ఆ జిల్లాలో మాత్రం ఒక్క స్థానానికే పరిమితమైంది.

మొదటిసారి కొత్తగూడెంలో జలగం వెంకట్రావు గెలవగా, రెండోసారి పువ్వాడ అజయ్‌ మాత్రమే గెలిచారు. ఈసారి టీఆర్‌ఎస్‌ ఆ జిల్లాలో ఎన్ని గెలుస్తుంది అన్న సంగతి పక్కన పెడితే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు లాంటి వాళ్ల దారి ఏ పార్టీ వైపు అన్న చర్చ మాత్రం ఎంతో కాలంగా జరుగుతున్నది.

ఇదిలాఉండగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మన్రాజుపల్లిలో పర్యటించారు. టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో నాకు చిన్న వయసులోనే ఎన్టీఆర్‌ అవకాశం ఇచ్చారు.

ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది. మంత్రిగా ఉన్నప్పుడు అనేక ప్రాజెక్టులు పూర్తి చేశాను. కేసీఆర్‌ నాయకత్వంలో సీతారామ ప్రాజెక్టు రూపకల్పన జరిగిందన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకు రూ.45 వేల కోట్ల నిధులు తెచ్చానని చెప్పారు. ఎన్టీఆర్‌ సాక్షిగా నన్ను గెలిపిస్తా మన్నందుకు ఆయన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

గతంలో ఖమ్మం ఎంపీగా గెలుపొందిన పొంగులేటి చాలా కాలంగా పదవి కోసం ఎదురు చూస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అధిష్ఠానంపై నేరుగా విమర్శలు చేయకున్నా.. ప్రస్తుత ఎంపీ నామా నాగేశ్వర్‌రావు ఉండగా ఆయనకు అవకాశం వస్తుందా అన్నది ఒక చర్చ అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో కాంగ్రెస్‌ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డిపై ఓడిపోయిన తుమ్మలకు మళ్లీ టికెట్‌ దక్కకపోవచ్చు అంటున్నారు.

ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మందిలో ఉపేందర్‌రెడ్డి కూడా ఒకరు. బహుశా ఈ నేపథ్యంలోనే తుమ్మల నాగేశ్వర రావు సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపిస్తూనే.. తాను మంత్రిగా ఉన్నపుడు జిల్లా అభివృద్ధికి చేసిన తన కృషి గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నారు. పొంగులేటి, తుమ్మల పార్టీ అధిష్ఠానంపై విధేయత చూపిస్తూనే.. తమకు రాజకీయంగా అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్న స్థానిక నేతపై అడపాదడపా విమర్శలు చేస్తున్నారు.

ఆయన వల్లే తమకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిందని వాళ్లు భావిస్తున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్‌ సిట్టింగులందరికీ మళ్లీ టికెట్లు అనగానే సేఫ్‌ సైడ్‌గా ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు. ఒకవేళ పోటీ చేసే అవకాశం రాకపోతే అప్పటికప్పుడు పార్టీ మారినా ప్రయోజనం ఉండదని, అందుకే ముందుగానే ప్రజల్లో ఉండి బలప్రదర్శన చేయాలని చూస్తున్నారు. దీన్ని ధిక్కార స్వరం అనలేము కానీ తమను గుర్తించాలని కోరుతున్నట్టు పొంగులేటి, తుమ్మల వ్యాఖ్యలను బట్టి అర్థమౌతున్నది.

కొసమెరుపు ఏమిటి అంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు పెత్తనం మనకు కావాలా? అని కేసీఆర్‌ ప్రశ్నించి ఆ కూటమిని దెబ్బకొట్టారు. ఇవాళ అదే టీడీపీ కార్యకర్తలు తుమ్మల గెలుపు కోసం కృషి చేస్తామని పేర్కొనడం గమనార్హం.