- నిర్మాణం లేదు… నిప్పులు లేవు గదే పాత పద్ధతి
- రెండున్నరేళ్ళుగా గంపగుత్తా పద్ధతిలోనే పార్టీ
- మళ్ళీ బీఆరెస్ ఆవిర్భావ దినోత్సవ ప్లీనరీ
- ఫాంహౌజ్ నుంచి చక్రం తిప్పుతున్న కేసీఆర్
- కేటీఆర్, హరీశ్ కుటుంబ నేతలదే పెత్తనం
- పాత నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతోనే కార్యక్రమాలు
- ఎన్నికలన్నీ పూర్తయినా కింది వారికి గుర్తింపేది?
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
అధికారంలో ఉన్నా…లేకపోయినా తమ ధోరణి మారదని బీఆరెస్ నాయకత్వం పదేపదే నిరూపిస్తున్నారనే విమర్శలున్నాయి. ముఖ్యంగా పార్టీలో కింది స్థాయి కార్యకర్తలు, నాయకులకు గుర్తింపు కల్పించడమంటే ఆ పార్టీకి మొదటి నుంచి అంతగా రుచించదని పలువురు అంటున్నారు. పార్టీ నిర్మాణం, కమిటీలు, సమావేశాలు, చర్చలు, నిర్ణయాల పొడగిట్టదనే తీరుగా వ్యవహరిస్తుంటారనే విమర్శలున్నాయి. విమర్శలకు తగిన విధంగా నాయకత్వం అదే తీరుగా వ్యవహరించడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. పార్టీలలో ప్రాంతీయ పార్టీల తీరే వేరయ అంటే జాతీయ పార్టీగా రూపాంతరం చెంది, మళ్లీ ప్రాంతీయ పార్టీగా చెప్పుకొంటున్న బీఆర్ఎస్ తీరు మరీ వింతగా ఉంటుందంటున్నారు. తెలంగాణ ఉద్యమకాలంలో, అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలంటే వేరు, అధికారం పోయి ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తున్నప్పటికీ ఆ పార్టీ ప్రధాన నాయకత్వంలో ఏ విధమైన మార్పూ కనిపించడం లేదని ఆ పార్టీ వర్గాలే విమర్శిస్తున్నాయి. ఏడాది క్రితం వరంగల్ జిల్లా ఎలుకతుర్తి సమీపంలో భారీ జనసమీకరణతో జరిగిన పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల బహిరంగ సభలో చెప్పిన మాటలకు ఇప్పటికీ అతీగతీ లేకుండా పోయాయి. ఇగ చూడండంటూ ఏప్రిల్ 27న సభ ముగిస్తే నెలరోజుల్లో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామంటూ ఆ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటన జరిగి ఏడాది కావస్తోంది. మళ్ళీ రేపోమాపో రంగారెడ్డి జిల్లాలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ లేక జనరల్ బాడీ ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏడాది క్రితం ఇచ్చిన హామీ ఏమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనీసం ఈసారైన ఆ నిర్మాణ కమిటీలుంటాయా? అంటే ఏమో అనే సమాధానమే పలువురి నుంచి వస్తోంది.
అధికారం కోల్పోయి రెండున్నరేళ్ళయినా
రాష్ట్రంలో బీఆరెస్ అధికారం కోల్పోయి రెండున్నరేళ్ళు కావస్తున్నది. ఇప్పటికీ ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఒకటి, అర సందర్భాలు మినహా పూర్తిగా ఫాం హౌజ్ కే పరిమితమయ్యారు. అక్కడి నుంచే సందేశాలు అందిస్తూ రాష్ట్రంలో బీఆర్ఎస్ రాజకీయ చక్రాన్ని తిప్పుతుండగా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ హోదాలో కుమారుడు కేటీఆర్, అసెంబ్లీలో పార్టీ ఉప నేతగా అల్లుడు హరీష్ రావు ప్రజాక్షేత్రంలో నేతలుగా కొనసాగుతున్నారు. కుమార్తె కల్వకుంట్ల కవిత పార్టీకి దూరమై… సొంత పార్టీ పెట్టుకునే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారు. పార్టీ నుంచి సస్పండ్ అయిన తర్వాత కవిత అనేక విషయాలు లేవనెత్తారు. పార్టీ నిర్మాణంపై విమర్శలు గుప్పించారు. పార్టీలో వ్యవస్థాపక అధ్యక్షుడు తప్ప ఎవరికీ ఏ బాధ్యతలు లేవని, తనను ప్రధాన కార్యదర్శి పేరుతో సస్పండ్ చేయడమేంటంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికీ కూడా కొందరికి మాత్రమే కొన్ని ‘రాష్ట్ర స్థాయి నిర్మాణ పదవులు’ అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి.
నిర్మాణం లేదూ…నిప్పులు లేవు గదే పాతపద్ధతి
రాష్ట్రస్థాయిలో వర్కింగ్ ప్రసిడెంట్‌గా కేటీఆర్, ప్రధాన కార్యదర్శులుగా కొందరి పేర్లు అప్పుడప్పుడు తెరపైన కనిపిస్తుంటాయి. పార్టీ రాష్ట్ర కమిటీ, పొలిట్ బ్యూరో పదవులు ఇప్పుడు పెద్దగా కనిపించడంలేదు. పార్టీ అనుబంధ సంఘాల్లో కూడా టీఆర్ఎస్వీ తప్ప మిగిలిన సంఘాల జాడ సందర్భానుసారం వినిపిస్తుంటాయి. ఇక జిల్లాలో అధికారంలో ఉన్నపుడు నియమించిన పార్టీ అధ్యక్షులే ఇప్పటి కొనసాగుతున్నారు. ఇందులో కొందరు పార్టీలు మారారు. మరి కొన్ని చోట్ల ఖాళీగా ఉన్నాయి. గమ్మత్తేమిటంటే 33 జిల్లాలను ఏర్పాటు చేసి పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించి, కొన్ని చోట్ల పార్టీ జిల్లా కార్యాలయాలు నిర్మించి, కొన్ని చోట్ల శిలాఫలాకాలు వేసినప్పటికీ తిరిగి మళ్ళీ పాత జిల్లా కేంద్రంగానే ఇప్పుడు కార్యకలాపాలు సాగుతున్నాయి. ఆ జిల్లా అధ్యక్షులే ఇప్పుడు దిక్కుగా మారారు. ఇక్కడ కూడా జిల్లా కమిటీల జాడ కనిపించదు. ఇదిలా ఉండగా మొన్నటి వరకు శాసనసభా పక్ష నేత ఒక్క కేసీఆర్ ఉండగా ఈ మధ్యలోనే ఉప నేతలుగా హరీష్ రావు, శ్రీనివాస్ యాదవ్, సబితా రెడ్డిలను నియమించారు.
పాత ఇన్‌చార్జ్‌లతోనే కాలం వెళ్లదీస్తున్న నేతలు
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా కొనసాగారు. ఎమ్మెల్యేలు లేనిచోట మాత్రం పార్టీ ఇన్‌చార్జ్‌లను నియమించారు. వారే ఇప్పటికీ అనధికారికంగా అంతా తామై వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు అనేక మంది ఎమ్మెల్యేలపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. పార్టీలోనే తిరుగుబాట్లు, బహిరంగ విమర్శలు వెల్లువెత్తాయి. జనగామ లాంటి ఒకటిరెండు చోట్ల తప్ప ఎక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చలేదు. దీంతో పార్టీ ఓటమిపాలై అధికారం కోల్పోయేందుకు కారణమైందనే అభిప్రాయం ఉన్నది. అయినప్పటికీ గత రెండున్నరేళ్ళుగా అదే ఇంచార్జులతో కాలం వెల్లదీస్తున్నారు. దీంతో పార్టీలోని గ్రూపులు, పాత ఇన్‌చార్జ్‌లపై ఉన్న వ్యతిరేకత ప్రస్తుతం కనిపించకపోయినప్పటికీ అంతర్గతంగా వారంటే గిట్టిని వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఈ రెండున్నరేళ్ళ కాలంలో ఈ ఇన్‌చార్జ్‌లతో ఎంపీ, ఎమ్మెల్సీ, గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఈ ఎన్నికలు, అభ్యర్ధుల ఎంపిక తదితర అన్నింటా వీరే కీలకంగా వ్యవహరించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్ళు దగ్గరికొస్తున్నందున వచ్చే ఏడాది మినహా తర్వాత ఎన్నికల సంవత్సరమే అయినందున ఇప్పటికైనా పార్టీని గ్రామ స్థాయి నుంచి నిర్మాణం చేసి యేళ్ళుగా పార్టీని నమ్ముకున్న వారికి ఓ గుర్తింపును కల్పిస్తారా? అనే చర్చసాగుతోంది. ఇక పార్టీ నేత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తారా? లేకుంటే ఎన్నికల నాటి వరకు ఇదే తరహా కేటీఆర్, హరీష్ రావులతో పార్టీని నడిపిస్తారా? అనే చర్చ సాగుతోంది. లేకుంటే టీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు అలవాటైన పద్ధతిలో భారీ బహిరంగసభలు నిర్వహించి అక్కడే ఒక్కడుగా భారీ ఉపన్యాసాలిచ్చి తిరిగి పార్టీకి పూర్వ వైభవం తెస్తారా? అనే అభిప్రాయం కూడా మరో వైపు ఉంది.
Read Also |
బీహార్‌లో ‘జాంబీ డ్రగ్’ ఎఫెక్ట్..బొమ్మలా మారిన యువకుడు!
సుంచింద్రం కోనేటిలో వెలుగు చూసిన కాంస్య విగ్రహం
Head Bath | ఈ మూడు రోజుల్లో తల స్నానం చేస్తే.. ఆ ఇంట్లో కనకవర్షమే..!
