BRS Organizational Elections | గులాబీ సంస్థాగతం ఊసేది? డిజిటల్ సభ్యత్వాలని ఇప్పటికి రెండు నెలలు!

BRS Organizational Elections | బీఆర్ఎస్ పార్టీలో సంస్థాగత ఎన్నికల నిర్వహణ ఎప్పుడు చేపడుతారన్న అంశంపై గులాబీ కార్యకర్తలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఓ వైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత ఎన్నికల సందడి కొనసాగుతున్నది. పీసీసీ కమిటీలను పూర్తి చేసుకున్న ఆ పార్టీ.. జిల్లా, బ్లాక్, మండల, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటులో నిమగ్నమైంది. ఇందుకోసం ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్‌చార్జ్‌లను సైతం నియమించింది. అటు బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో బూత్, గ్రామ, మండల, జిల్లా కమిటీల ఎన్నికతో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎంపిక కూడా పూర్తి చేసుకుంది. ఈ నెలలో పూర్తి స్థాయి రాష్ట్ర కమిటీ ఏర్పాటుకు కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీజేపీల సంస్థాగత ఎన్నిక ప్రక్రియ తుది దశకు చేరుకోగా.. బీఆర్ఎస్‌లో మాత్రం సంస్థాగత ఎన్నికల ఊసు వినబడకపోవడం రాజకీయ విశ్లేషకులను సైతం అశ్చర్యపరుస్తున్నది. ప్రాంతీయ పార్టీ.. అందునా కుటుంబ ఆధిపత్యంలోని పార్టీగా ఉన్న బీఆరెస్‌లో సంస్థాగత ఎన్నికల వ్యవహారంపై ప్రశ్నించడం కాదు సరికదా.. కనీసం ప్రస్తావన చేసే సాహసానికీ ఎవరూ పూనుకోని నేపథ్యంలో కేసీఆర్ కుటుంబం ఏక నాయకత్వమే చెల్లుబాటు అవుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సంస్థాగత నిర్మాణం లేకుండా పార్టీని ఎంతకాలం నడిపిస్తారన్న ప్రశ్న క్యాడర్ నుంచి కూడా వినిపిస్తున్నది. రాష్ట్రంలో అధికారం కోల్పోయి ఏడాదిన్నర గడిచినా.. పార్లమెంటు ఎన్నికల్లో ఒక్కటి కూడా గెలుచుకోకపోయినా.. ఇంకా పార్టీ నిర్మాణంపై అధినాయకత్వం దృష్టి సారించకపోవడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ విలీనం ప్రతిపాదనలు తెచ్చారన్న కేసీఆర్ కూతురు కవిత మాటలను ప్రస్తావిస్తున్నకొందరు.. వేరొక పార్టీలో విలీనమయ్యేదానికి ఇంక సంస్థాగత నిర్మాణం ఎందుకనుకున్నారా? అన్న సెటైర్లు కొందరి నుంచి వెలువడుతున్నాయి.
మేనెల మొదటి వారంలోనే అంటూ ఆర్భాటం
గత ఏప్రిల్ 27న బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ సభకు జనసమీకరణ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు. క్యాడర్‌లో జోష్ నింపేందుకు ప్రయత్నించిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రజతోత్సవ సభ ముగిశాక మే మెుదటి వారం నుంచి సభ్యత్వం నమోదు చేపడుతామని ప్రకటించారు. సభ్యత్వాలు కూడా డిజిటల్ రూపంలో ఉంటాయని తెలిపారు. గ్రామ, మండల, జిల్లా కమిటీలు సహా అనుబంధ సంఘాల కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆక్టోబర్‌లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. కార్యకర్త కేంద్రంగా పార్టీ నిర్మాణం జరుగుతుందని గొప్పగా చెప్పారు. కమిటీల ఏర్పాటు తర్వాత జిల్లాల వారీగా శిక్షణా తరగతులు నిర్వహిస్తామని కూడా చెప్పారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తయితే కనీసం పార్టీ పదవులైనా దక్కుతాయన్న ఆశావహులలో కేటీఆర్ ప్రకటన ఆశలు రేపింది. కానీ రజతోత్సవ సభ ముగిసిపోయి రెండున్నర నెలలు గడిచిపోయినా మళ్లీ కేటీఆర్ నోటి నుంచి పార్టీ సంస్థాగత ఎన్నికల ఊసు వినిపించకపోవడంతో వారంతా ఇంకెప్పుడా? అని ఎదురుచూస్తున్నారు.
గ్రామం నుంచి రాష్ట్ర కమిటీ దాక కార్యవర్గాలు ఖాళీ
ఏ రాజకీయ పార్టీ మనుగడకైన సైద్ధాంతిక పునాది, సంస్థాగత నిర్మాణం కీలకం. బీఆర్ఎస్‌కు సైద్ధాంతిక పునాది తెలంగాణ నినాదమే. తెలంగాణ అభివృద్ధి, దాని హక్కుల కోసమే పోరాడుతున్నానని చెబుతూ ఉంటుంది. బీఆర్ఎస్‌గా పేరు మార్చుకున్న పిదప పార్టీలో తెలంగాణ ఆత్మ కొరవడిందన్న విమర్శలు వచ్చాయి. ఇక సంస్థాగతం ప్రక్రియ చూస్తే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో సక్రమంగానే సాగిన గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీల ఎన్నికలు పార్టీ అధికారంలోకి వచ్చాక గాడి తప్పాయి. పార్టీ రాష్ట్ర కమిటీని చివరి సారిగా 2017లో ప్రకటించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చాక సంస్థాగత ఎన్నికల ప్రక్రియను కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతోనే పార్టీని నడిపిస్తున్నారు. మధ్యలో 2021లో గ్రామ, మండల కమిటీలను వేశారు. 2022లో 33జిల్లాలకు జిల్లా అధ్యక్షులను ప్రకటించినప్పటికి జిల్లా కార్యవర్గాలు.. అనుబంధ కమిటీల నిర్మాణాలను విస్మరించారు. ఇక అప్పటి నుంచి సంస్థాగత ఎన్నికల నిర్వహణ కోసం గులాబీ క్యాడర్ ఎదురుచూస్తున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల పెత్తనం ఇష్టంలేని వారంతా వారి గెలుపు కోసం పనిచేయకపోవడం కూడా పార్టీ ఓటమికి ఒక కారణమన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆ ధోరణి పార్లమెంటు ఎన్నికల్లో మరింత పెరిగింది. అధికారం కోల్పోయాకైనా ఆత్మవిమర్శ.. అంతర్మథనంతో పార్టీ ప్రక్షాళన.. పునర్నిర్మాణం చేస్తారనుకున్న వారికి ఎప్పటిలాగే నిరాశే ఎదురవుతోందని పార్టీ వర్గాలు వాపోతున్నాయి. పార్టీ పదవులైనా లేకుండా ఖర్చులు పెట్టుకుని పార్టీని నడిపించడం ఎందుకన్న స్తబ్దత క్యాడర్‌ను ఆవహించిందని కొందరు నాయకులు ప్రైవేట్ సంభాషణల్లో చెబుతున్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో బీఆర్ఎస్ అధిష్ఠానం పార్టీ సంస్థాగత పదవులను భర్తీ చేస్తుందా? లేక స్థానిక ఎన్నికలు ముగిశాకే నిర్వహిస్తారా అన్న గందరగోళం పార్టీ క్యాడర్‌లో నెలకొంది.