SC Classification | జస్టిస్‌ గవాయ్‌ ప్రసంగంతో మళ్లీ చర్చనీయాంశంగా ఎస్సీ క్రీమీలేయర్‌!

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో క్రీమీలేయర్‌ను అమలు చేయకపోవడం మూలంగా పట్టణ ప్రాంతం, ఉద్యోగులైన వారి సంతానంతో గ్రామీణ ఎస్సీ విద్యార్థులు పోటీపడలేకపోతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్జిస్ బీఆర్ గవాయి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

SC Classification | జస్టిస్‌ గవాయ్‌ ప్రసంగంతో మళ్లీ చర్చనీయాంశంగా ఎస్సీ క్రీమీలేయర్‌!

హైదరాబాద్, విధాత ప్రతినిధి:

SC Classification | వెనకబడిన కులాలు (ఓబీసీ)లకు క్రీమీలేయర్ విధానాన్ని అమలు చేస్తున్నారు. షెడ్యూల్డు కులాల(ఎస్సీ)కు మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. షెడ్యూల్డు కులాల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చిన సమయంలో క్రీమీలేయర్‌పై స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది. ఉప వర్గీకరణను సమర్థించిన ఆరుగురు జడ్జీలలో నలుగురు జడ్జీలు.. ఎస్సీలలో క్రీమీలేయర్ అమలు చేయాల్సిందేననని స్పష్టం చేశారు. ఆరుగురిలో ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌ కూడా ఉన్నారు. తెలంగాణలో ఎస్సీ ఉప వర్గీకరణపై నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏక సభ్య కమిషన్ కూడా క్రీమిలేయర్‌ను సిఫారసు చేసింది. అయితే ఈ సిఫారసును తెలంగాణ మంత్రి మండలి తిరస్కరించింది.

ఎస్సీలలో ఉప కులాల వర్గీకరణపై గతేడాది ఆగస్టు నెలలో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఉప వర్గీకరణతో పాటు క్రీమీలేయర్‌పై స్పష్టతనిచ్చారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో క్రీమీలేయర్‌ను అమలు చేయకపోవడం మూలంగా పట్టణ ప్రాంతం, ఉద్యోగులైన వారి సంతానంతో గ్రామీణ ఎస్సీ విద్యార్థులు పోటీపడలేకపోతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్జిస్ బీఆర్ గవాయి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నెల 16వ తేదీన ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుకున్న సందర్భంగా గవాయ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. షెడ్యూల్డ్‌ కులాలు రిజర్వేషన్లు, ఉప వర్గీకరణపై ఈయన కీలక వ్యాఖ్యలు చేశారు. పట్టణాల్లో చదివే ఉన్నతాధికారుల సంతానం, గ్రామంలో ఉండే వ్యవసాయ కూలీ పిల్లలు.. ఇద్దరూ ఎస్సీలే అయినప్పటికీ, వారిని సమానంగా చూడలేమన్నారు. అలా చూస్తే వారి సమాన అవకాశాలను నిరాకరించడమేనని చెప్పారు. కొందరికీ ఇప్పటికీ రిజర్వేషన్ ఫలాలు దక్కని పరిస్థితులు ఉన్నాయని, అలాంటి వారికి న్యాయం చేసేందుకు ఉప వర్గీకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగిస్తూ తీర్పునిచ్చామని ఆయన గుర్తు చేశారు. ఉప వర్గీకరణతో పాటు క్రీమీలేయర్ అమలు చేయాలని తీర్పునివ్వగా, తనను తీవ్రంగా నిందించారని ఆయన గుర్తు చేసుకున్నారు. క్రీమీలేయర్‌పై నేను ఇచ్చిన తీర్పును ఈ రోజు కూడా సమర్థించుకుంటున్నానని ఆయన స్పష్టం చేశారు. ఇందిరా సాహ్నీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ఇతరుల తీర్పులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నేను చదివానన్నారు. ఓబీసీలకు అమలు చేసిన విధంగానే ఎస్సీలకు అమలు చేయాలనేది నా అభిప్రాయమని గవాయ్ స్పష్టం చేశారు.

ఉప వర్గీకరణపై తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ బీఆర్ గవాయ్, విక్రమ్ నాథ్, బేలా త్రివేదీ, మనోజ్ మిశ్రా, సతీష్ చంద్ర, పంకజ్ మిథాల్ ఉన్నారు. ఉప వర్గీకరణను ఆరుగురు న్యాయమూర్తులు సమర్థించగా, బేలా త్రివేది మాత్రమే విభేధించారు. ఎస్సీ, ఎస్టీ కులాల్లో క్రీమీలేయర్ గుర్తించి, మినహాయించే విధానాన్ని గుర్తించాలని గవాయ్ తన తీర్పులో పేర్కొన్నారు. రిజర్వేషన్ పొందిన ఎస్సీ సంతానాన్ని, రిజర్వేషన్ పొందని సంతానంతో సమాన స్థాయిలో పెట్టలేమని గవాయ్ అన్నారు. ఓబీసీలకు అమలు చేసిన విధంగానే ఎస్సీలకు అమలు చేయాలన్నారు. తొలి తరానికి మాత్రమే రిజర్వేషన్ ఫలాలు పరిమితం చేయలని, ఆ తరువాతి తరానికి రిజర్వేషన్ అర్హత ఉండవద్దని జస్టిస్ పంకజ్ మిథాల్ స్పష్టం చేశారు. పదోన్నతులలో రిజర్వేషన్లు అమలు చేసే సమయంలో క్రీమీలేయర్ మినహాయింపునివ్వాలని జస్టిస్ సతీష్ చంద్ర సూచించారు.

Women Journalists : ట్రోలింగ్స్‌పై సజ్జనార్‌కు మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు

ఏకసభ్య కమిషన్ సిఫారసు బుట్టదాఖలు

తెలంగాణ రాష్ట్రంలో ఉప వర్గీకరణ అంశం అధ్యయనం చేసి పరిష్కరించేందుకు ప్రభుత్వం 2024 అక్టోబర్ నెలలో జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ వేసింది. 60 రోజుల్లో సమగ్ర సిఫారసులతో నివేదిక అందచేయాలని ప్రభుత్వం కోరింది. గడువు సరిపోకపోవడంతో 2025 మార్చి 10వ తేదీ వరకు పొడిగించారు. ఈ కమిషన్ లోతుగా విచారణ జరిపిన తరువాత సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరంగా వెనుకబాటుతనాన్ని పరిశీలించి పలు సిఫారసులు చేసింది. రాష్ట్రంలోని 33 జిల్లాలు సందర్శించి ప్రజల నుంచి 4,750 వినతులు స్వీకరించింది. ఆన్ లైన్‌లో 8,681 వినతులు వచ్చాయి. ఎస్సీల్లో 59 కులాల ఆర్థిక, ఉద్యోగ, విద్యా అవకాశాలను అధ్యయనం చేసి 199 పేజీలతో సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. అందులో ప్రధానమైన నాలుగు సిఫారసులలో క్రీమీలేయర్ అంశం కూడా ఉంది. క్రీమీలేయర్ అమలు చేయాల్సిందేనని అక్తర్ ప్రతిపాదించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పక్కనబెట్టింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, మేయర్లు వంటి ప్రజా ప్రతినిధులు, గ్రూప్ వన్ అధికారులను క్రీమీలేయర్ గా పరిగణించాలని జస్టిస్ అక్తర్ సూచించారు. ఎస్సీ కులాల నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో రాష్ట్ర మంత్రి మండలి క్రీమీలేయర్ ను తిరస్కరిస్తూ మిగతా మూడు సిఫారసులకు ఆమోదం తెలిపింది.

ED Enters iBomma Piracy Case : ఐబొమ్మ కేసు.. రంగంలోకి ఈడీ

క్రీమీలేయర్ వద్దే వద్దన్న ప్రజా ప్రతినిధులు

ఎస్సీ ఉప కులాల వర్గీకరణ పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు తరువాత 2024 ఆగస్టు రెండో వారంలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన ప్రజా ప్రతినిధుల బృందం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసింది. ప్రతినిధి బృందంలోని సభ్యులు, బీజేపీ ఎంపీ ఫగ్గన్ కులస్తే మాట్లాడుతూ, క్రీమీలేయర్ పై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకూడదని ప్రధాన మంత్రిని కోరామన్నారు.

క్రీమీలేయర్ అంటే ఏమిటీ

  • సుప్రీంకోర్టు 2000 నాటి తీర్పులో ఈ అంశంపై పూర్తి స్పష్టతనిచ్చింది.
  • అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు అయిన ఓబీసీలు రిజర్వేషన్ ప్రయోజనాలకు అనర్హులు అని తీర్పునిచ్చింది.
  • ఆదాయ పరిమితిని సంవత్సరానికి రూ.8 లక్షలుగా ఓబీసీలకు నిర్ణయించారు.
  • అయితే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును అమలు చేయడం లేదు.

ఇంకా వెనకబడి ఉన్నారు… మల్లేపల్లి లక్ష్మయ్య

సామాజికంగా, సాంస్కృతికంగా వెనకబడి ఉన్నారని ఎస్సీలకు రాజ్యాంగంలో రిజర్వేషన్ హక్కులు కల్పించారని బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. ఎస్సీ ఉప వర్గీకరణ చేయాలని 2004 లో తీర్పు ఇచ్చినా అమలు చేయలేదని ఆయన గుర్తు చేశారు. బ్యాక్ లాగ్ పోస్టులను ఏళ్ల తరబడి భర్తీ చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముందు అన్ని శాఖలలో బ్యాక్ లాగ్ పోస్టు భర్తీ చేయాలని, ఆ తరువాత క్రీమీలేయర్ అంశం పరిశీలిద్దామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ ఎస్సీలు సామాజికంగా, సాంస్కృతికంగా వెనకబడి ఉన్నారని ఆయన వివరించారు. క్రీమీలేయర్‌పై జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలు సరైంది కాదని, వాటితో తాను ఏకీభవించడం లేదని లక్ష్మయ్య స్పష్టం చేశారు.

Read Also |

Andhra Pradesh : ఏపీలో హై అలర్ట్.. రాష్ట్రంలో 60–70 మంది మావోయిస్టులు
కడుపులో ఉన్న కవలలు మృతి.. మనస్తాపంతో తండ్రి, చికిత్స పొందుతూ తల్లి మృతి
Mahabubabad : చావు దగ్గరికి వెళ్లాడు….పట్టాలపై పడుకొని……
iBomma Case | వందకుపైగా పైరసీ వెబ్‌సైట్ల నెట్‌వర్క్ – వీడు మామూలోడు కాదు