రాజకీయ, నిర్మాణ, పోరాట కర్తవ్యాలు.. బీఆర్ఎస్ త్రిముఖ వ్యూహం

పార్టీ ఆవిర్భవించి 25 యేళ్ళు ముగిసిన సందర్భంగా రజతోత్సవ ముగింపు సమావేశాల పేరుతో తెలంగాణ భవన్‌లో సోమవారం నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యలపై ఎక్కడికక్కడ ప్రజలను సమీకరించి పోరాటం చేయాలని కేసీఆర్ పిలుపు నిచ్చారు.

రాజకీయ, నిర్మాణ, పోరాట కర్తవ్యాలు.. బీఆర్ఎస్ త్రిముఖ వ్యూహం
  • ఎట్టకేలకు ఒక్కడుగు ముందుకు
  • కార్యాచరణ బాధ్యత తిరిగి కేటీఆర్‌కే
  • బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన కేసీఆర్‌ ఆదేశం
  • కవిత పార్టీని పట్టించుకోవాల్సిందేమీలేదని వ్యాఖ్య
  • జీవన్ రెడ్డికి ప్రాధాన్యతనిచ్చిన పార్టీ చీఫ్‌

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఎట్టకేలకు ఒక్కడుగు ముందుకు వేసేందుకు సూత్రబద్ధంగా నిర్ణయించారు. ఇంతకాలం పార్టీ ముఖ్యనేతల నిర్ణయాలతో సా…గుతూ వస్తున్న పార్టీ ముఖ్యమైన మూడు అంశాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ తీర్మానించారు. తెలంగాణలో అధికారం కోల్పోయిన మూడేళ్ళ తర్వాత.. మూలకు పెట్టిన అంశాలకు ప్రాధాన్యతనిస్తూ మూడు ప్రధాన కర్తవ్యాలను నిర్ధేశిస్తూ త్రిముఖ వ్యూహాన్ని ఖరారు చేశారు. పార్టీ నిర్మాణం, రాజకీయ స్పందన, ప్రజాసమస్యలపై పోరాట కర్తవ్యాలను రూపొందించుకోవాలని నిర్ణయించారు. ఈ మూడు అంశాలతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంతోపాటు అమలు బాధ్యత పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్‌కు అప్పగించారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర పార్టీ ముఖ్యులందరికీ దిశానిర్దేశం చేశారు.

ఒక వైపు సొంత కుమార్తె కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేయడం, మరో వైపు రానున్న రెండేళ్ళలో ఎన్నికలు రానున్నందున పార్టీని నిర్లక్ష్యం చేస్తే మొదటికే మోసం వస్తోందని భావించారా? కారణమేదైనా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేసీఆర్ హాజరై తీసుకున్న తాజా నిర్ణయాలపై నాయకులతో పాటు కిందిస్థాయి కార్యకర్తల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో పార్టీ పేరు చెప్పి నాయకులుగా చెలామణి అవుతున్న కొందరి నాయకులకు ఈ సందర్భంగానైనా చెక్ పడుతుందని ఆశిస్తున్నారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో ఇటీవల పార్టీలో చేరిన జీవన్ రెడ్డికి కేసీఆర్ ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సిరికొండ మధుసూధనాచారి కంటే కూడా జీవన్ రెడ్డికి అవకాశం కల్పించారు. సమావేశంలో కూడా ఆయన వెంటనే కూర్చున్నారు. సమావేశంలో ప్రత్యేకంగా జీవన్ రెడ్డిని పరిచయం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా గతంలో కేసీఆర్ పక్కనే కూర్చున్న ఆలె నరేంద్ర, విజయశాంతి, విజయరామారావు, తాజాగా పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? జీవన్ రెడ్డిది కూడా కొద్ది కాలం సాగుతుందేమో.. అంటూ ఆ పార్టీ నాయకల్లో చర్చ జరుగడం గమనార్హం.

జ్ఞాపకాలు నెమరేసిన కేసీఆర్

2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఆవిర్భావానికి రాజకీయ పరిస్థితులను కేసీఆర్ మరోసారి ఏకరువు పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ హయంలో రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భవించి 25 యేళ్ళు ముగిసిన సందర్భంగా రజతోత్సవ ముగింపు సమావేశాల పేరుతో తెలంగాణ భవన్‌లో సోమవారం నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యలపై ఎక్కడికక్కడ ప్రజలను సమీకరించి పోరాటం చేయాలని కేసీఆర్ పిలుపు నిచ్చారు.

మహిళా బిల్లుపై లేటు స్పందన

మహిళా రిజర్వేషన్‌ విషయంలో కేంద్రం అనుసరించిన వైఖరిని జగిత్యాల సభలో నామమాత్రంగానైనా ప్రస్తావించని విషయం తెలిసిందే. లోక్‌సభలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఉమ్మడి రాష్ట్ర విభజనను పాకిస్తాన్ విభజనతో పోల్చిన అంశంపైనా మాట మాట్లాడలేదు. కానీ.. ఈ సమావేశంలో వాటి విషయంలో తీర్మానం చేశారు. తేజస్వి వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్రంగా స్పందిస్తూ ‘వెధవ’ అంటూ మండిపడ్డారని సమాచారం. పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు బహిర్గతమైందని వివరించారు. 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలున్నా జీరో ఫర్ తెలంగాణ అనే తీరుగా మారిందన్నారు.

ఎట్టకేలకు నిర్మాణం పైన దృష్టి

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ళు, తాజాగా మూడేళ్ళు అంతగా పట్టించుకోని పార్టీ నిర్మాణ అంశానికి తాజా సమావేశాల్లో మోక్షం లభించింది. పార్టీని నిర్మాణపరంగా పటిష్టం చేసేందుకుగానూ సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామ స్థాయి నుంచి కమిటీలను నియమించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉనికిలో ఉన్న రాష్ట్ర కమిటీ మినహా అన్ని కమిటీలను రద్దు చేశారు. ఈసారి సభ్యత్వం సందర్భంగా రాశి కంటె వాసికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించడం గమనార్హం. గతంలో ఎమ్మెల్యేలు, నేతలు పోటీలు పడి ‘సంఖ్యా బలాలను ప్రదర్శించిన’ నేపథ్యంలో ఈసారి తగిన జాగ్రత్త తీసుకోవాలని భావించినట్లున్నారు. నాయకులు సభ్యత్వం విషయంలో లక్ష దాటిందీ….రెండు లక్షలు దాటిందని పోటీపడకుండా క్వాలిటేటివ్‌గా, నిజంగా, నిఖార్సుగా పార్టీ సభ్యత్వం చేయాలని సూచించారు. ఈ క్రియాశీల సభ్యులు కమిటీల్లో ఉంటారు. టాప్ టూ బాటమ్ వీరికే ప్రాధాన్యం ఉంటుందని, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ పటిష్ట నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఈ అమలయ్యే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

ఇంకా ధోకాబాజీలున్నారు

ఇప్పటికీ పార్టీలో కొందరు ధోకాబాజీ నాయకులున్నారని కేసీఆర్ విమర్శించారు. అధికారం కోల్పోయినా ఇంకా అహంకారంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో పనిచేసే వారికే ప్రాధాన్యం ఉంటుందని తేల్చిచెప్పారు. గతంలో మాదిరి ముఖం చూసి టికెట్ ఇచ్చేది లేదంటూ స్పష్టం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా ప్రజలకు, పార్టీకి అందుబాటులో ఉండాలని తేల్చిచెప్పారు. టికెట్ ఇచ్చే ముందు వారు సోషల్ మీడియాతో పాటు ఫీల్డ్లో కూడా ఉన్నారా? లేదా పరిశీలిస్తామన్నారు.

కవితను పట్టించుకోవాల్సిందేమీ లేదు: కేటీఆర్

కవిత ఏర్పాటు చేసిన పార్టీపై కేటీఆర్ స్పందిస్తూ ఆ పార్టీతో తమకు ఏ ఇష్యూ రాలేదన్నారు. పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయంటూ రాష్ట్రంలో 25యేళ్ళు పూర్తిచేసుకున్న పార్టీలు వేళ్ళమీదుంటాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనైతే టీడీపీ, టీఆర్ఎస్ లాంటివితప్ప వేరే లేవు. ఆమె పార్టీని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదంటూ కొట్టిపారేశారు. ఇక సీఎం రేవంత్ గురించి మాట్లాడుతూ చీఫ్ మినిస్టర్ చీప్ మాటలు మాట్లకూడదని, ఆయనకు తెలివిలేదంటూ విమర్శించారు. బీఆర్ఎస్ కు ఎక్స్‌పైరీ అయిపోయిందనీ రేవంత్ మాట్లాడిన అంశం పై స్పందిస్తూ వాళ్ళ పార్టీ కాంగ్రెస్ చతికిలపడి 12 యేండ్లు అయిందంటూ సెటైర్ విమర్శించారు. సీఎం రేవంత్ ది ఐడెంటిటీ క్రైసిస్ అంటూ విమర్శించారు.