KCR: అసెంబ్లీకొచ్చి అటాక్ చేస్తారా? అటెండెన్స్‌తో సరిపెడతారా? కేసీఆర్ ప్లానేంటి?
తాను రాజకీయంగా తీవ్రంగా వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆయన సహించలేక పోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాను ఇప్పటి దాకా కూర్చొన్న ముఖ్యమంత్రి సీట్లో రేవంత్‌రెడ్డిని చూడటం ఇష్టంలేకే ఆయన ఇంతకాలం అసెంబ్లీకి డుమ్మాకొడుతున్నారన్న చర్చలూ ఉన్నాయి.

(విధాత ప్రత్యేకం)
KCR : ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎట్టకేలకు సుదీర్ఘ విరామం అనంతరం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకాబోతున్నారు. ఒక శాసనసభ్యుడి సభ్యత్వం రద్దు కాకుండా ఉండాలంటే 60 రోజులకు ఒకసారి సమావేశాలకు హాజరుకావాల్సి ఉంటుంది. బుధవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే.. అనర్హత వేటు తప్పించుకునేందుకు కేవలం అటెండెన్స్ వేయించుకుని వెళ్లిపోతారా? లేక ప్రభుత్వ విధానాలపై తనదైన శైలిలో అటాక్ చేస్తారా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర అంశంగా ఉన్నది. మొన్న మీడియాతో చిట్‌చాట్ చేసిన ఆయన కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఆయన హాజరు విషయంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హాజరువుతారంటూనే కాంగ్రెసోళ్ల పిచ్చికూతలు వినాల్సి వస్తుందనే ఆయన రావడం లేదని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా.. కాంగ్రెస్ పార్టీలో ఆయన స్థాయి నాయకులు లేరని.. ఓ కొడుకుగా తాను కేసీఆర్ అసెంబ్లీకి రావద్ధనే కోరుకుంటున్నానని సన్నాయి నొక్కులు కూడా నొక్కారు. అయితే కేసీఆర్ గతంలో మాదిరిగా బడ్జెట్ సమావేశాలకు హాజరై గవర్నర్ ప్రసంగం విని మీడియా పాయింట్‌లో మాట్లాడి వెళ్లవచ్చని బీఆర్ఎస్ వర్గాల కథనం. బీఏసీ సమావేశంలోనూ, గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చలోనూ కేసీఆర్ పాల్గొనే అవకాశం మాత్రం కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఈ దఫా అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ మాత్రమే కాకుండా కీలకమైన ఎస్సీ వర్గీకరణ బిల్లు, విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాలకు డిలిమిటేషన్‌తో జరుగబోయే నష్టంపై తీర్మానం పెట్టి, కేంద్రానికి పంపించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ దఫా అసెంబ్లీ సమావేశాలు కీలకాంశాలకు వేదిక కాబోతున్నాయి.
పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం
కేసీఆర్ మంగళవారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపైన, వాయిదా తీర్మానాలు, డిమాండ్ చేయాల్సిన అంశాలపైన ఆయన పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తాను అసెంబ్లీ సమావేశాలలో గవర్నర్ ప్రసంగం రోజుతో పాటు బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు హాజరవుతానని చెప్పడం గమనార్హం. అవసరమైతే తర్వాత కూడా వస్తానని చెబుతూ.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా సమావేశాలకు హాజరై ప్రభుత్వ వైఫల్యాలపైన, హామీల అమలుపైన ప్రభుత్వాన్ని ఎండగట్టాలని సూచించడం చర్చనీయాంశంగా మారింది.
అనర్హత భయంతో అటెండెన్స్ కోసమేనా..
తాను అసెంబ్లీకి వస్తానని.. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతానని.. ఇప్పటికే ప్రభుత్వానికి చాల సమయమిచ్చామంటూ ఇటీవల ఫామ్ హౌస్‌లో నిర్వహించిన పార్టీ ముఖ్యుల సమావేశంలో మాట్లాడిన కేసీఆర్.. అన్న మాట మేరకు అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీని నిలదీస్తారా? అన్నది ప్రశ్నార్ధకంగానే కనిపిస్తున్నది. శాసనసభకు 60 రోజులు వరుసగా హాజరుకాకుంటే అనర్హత వేటు పడుతుందన్న భయంతోనే అసెంబ్లీకి హాజరవుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం.. ఒక ఎమ్మెల్యే 60 రోజులపాటు అసెంబ్లీకి హాజరుకాకపోతే ఆ స్థానాన్ని ఖాళీగా ప్రకటించే అధికారం స్పీకర్‌కు ఉంది. అయితే… అసెంబ్లీ ప్రొరోగ్ అయినా, సమావేశాలు జరుగుతున్నప్పుడు 4 రోజులకన్నా ఎక్కువ సెలవులు వచ్చినా వాటిని ఈ 60 రోజుల్లో లెక్కలోకి తీసుకోరు. తాజాగా పక్క రాష్ట్రం ఏపీలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా 60 రోజుల నిబంధన భయంతో అనర్హత టెన్షన్‌తో బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. అయితే గవర్నర్ ప్రసంగం రోజును వర్కింగ్ డేగా పరిగణించరని అసెంబ్లీ అధికారులు వెల్లడిస్తున్నారు. స్పీకర్ అధ్యక్షతన సభ జరిగితేనే వర్కింగ్ డే అవుతుందని.. గవర్నర్ ప్రసంగం అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు జరిగే లాంఛనమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ లెక్కన జగన్ అనర్హత వేటు తప్పించుకోవాలంటే ఈ సెషన్‌లో కానీ, వచ్చే శీతాకాల సమావేశాల్లో కానీ మరోసారి అసెంబ్లీకి హాజరుకావాల్సిన అనివార్యత నెలకొంది. ఇక్కడ తెలంగాణలోనూ కేసీఆర్ సైతం గవర్నర్ ప్రసంగం రోజునే అసెంబ్లీకి వస్తే మాత్రం జగన్ ఎదుర్కొన్న పరిస్థితినే ఆయన కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ తాను గవర్నర్ ప్రసంగం రోజున, బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున అసెంబ్లీకి వస్తానని చెప్పారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంటే కేసీఆర్ అసెంబ్లీకీ అనర్హత వేటు తప్పించుకునేందుకే వస్తున్నారన్న అంశం తేలిపోయిందని కాంగ్రెస్ విమర్శలు సంధిస్తున్నది. ఇదే విమర్శలను ఢిల్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా చేశారు. ప్రతిపక్ష నేతగా, పదేళ్లు రాష్టాన్ని పాలించిన మాజీ సీఎంగా ప్రజాసమస్యలపైన అసెంబ్లీలో చర్చించేందుకు కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. కాగా కేసీఆర్ ఈ ధఫా బడ్జెట్ సమావేశాలకు వస్తే ఎన్ని రోజులు వస్తారు? ఏం మాట్లాడుతారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కేసీఆర్ పై స్పీకర్ కు కాంగ్రెస్ ఫిర్యాదు
కేసీఆర్ అసెంబ్లీ వస్తారా లేదా అన్న అంశంపై చర్చ కొనసాగుతుండగానే ఇంకోవైపు అసెంబ్లీకి రాని కేసీఆర్ జీత భత్యాలను నిలిపివేయాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. అసెంబ్లీకి రాకుండా ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా తన బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తూనే కేసీఆర్ జీతభత్యాలు పొందుతున్నారని..వెంటనే వాటిని నిలిపివేయాలని కాంగ్రెస్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
రేవంత్‌రెడ్డి ఫ్యాక్టర్!
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం కేసీఆర్ వ్యవహరించిన తీరు రాజకీయ పరిశీలకులును నిశ్చేష్టులను చేసింది. ఎవరైనా ఓడిపోతే.. గౌరవంగా గవర్నర్ వద్దకు వెళ్లి రాజీనామా సమర్పించడం, ప్రజల ముందుకు వచ్చి తమకు ఇప్పటి వరకూ అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలియజేయడం కనీస రాజకీయ హుందాతనం కిందికి వస్తుందని పలువురు అంటున్నారు. దీనికి పూర్తి భిన్నంగా ఆనాడు వ్యవహరించిన కేసీఆర్.. రాజీనామాను వేరొకరి చేత రాజ్‌భవన్‌కు పంపి, కనీసం ప్రజలకు ఒక్క మాట కూడా చెప్పకుండానే ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయారు. దీనిపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. తాను రాజకీయంగా తీవ్రంగా వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆయన సహించలేక పోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాను ఇప్పటి దాకా కూర్చొన్న ముఖ్యమంత్రి సీట్లో రేవంత్‌రెడ్డిని చూడటం ఇష్టంలేకే ఆయన ఇంతకాలం అసెంబ్లీకి డుమ్మాకొడుతున్నారన్న చర్చలూ ఉన్నాయి. మరి ఈ విమర్శలకు తాళం వేస్తూ ఇకనైనా కేసీఆర్ అసెంబ్లీకి క్రమం తప్పకుండా హాజరవుతారా? లేక అదే దర్పాన్ని ప్రదర్శిస్తూ ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతారా? అన్నది వేచిచూడాలి.