Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్ విచారణలో కొత్త ట్విస్ట్.. తుమ్మలను ఈటల ఇరికించారా?
ఖమ్మం జిల్లా నుంచి దశాబ్దాలుగా వేర్వేరు క్యాబినెట్‌లలో తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. తొలుత టీడీపీ, ఆ తరువాత బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్ అండ్ బీ మంత్రిగా పనిచేసిన ఆయన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితంగా మెలిగారు కూడా.

Kaleshwaram Commission | కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారణ ప్రారంభించి మొదలు ఇప్పటి వరకు 14 నెలల వ్యవధిలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పేరు ఎక్కడా విన్పించలేదు. కానీ శుక్రవారం మల్కాజిగిరి బీజీపీ ఎంపీ ఈటల రాజేందర్ తన విచారణ సందర్భంగా కమిషన్ ముందు తుమ్మల పేరును ప్రస్తావించడం రాజకీయంగా సంచలనం రేపింది. సబ్ కమిటీలో తాను, హరీశ్‌తోపాటు తుమ్మల నాగేశ్వర్‌రావు కూడా ఉన్నారని ప్రస్తావన చేసిన నేపథ్యంలో తుమ్మలను కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణకు పిలుస్తుందా? కేసీఆర్ సర్కార్‌లోనూ మంత్రిగా ఉన్నందున వదిలేస్తారా? అనే చర్చ మొదలైంది. తెలంగాణ మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ప్రస్తుత మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం బీఆర్ కేఆర్ భవన్ ఎనిమిదో అంతస్తులో ఉన్న కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ముందు హాజరై.. తన వాదనలు వినిపించారు. కమిషన్ అడిగిన ప్రశ్నల్లో ఒక ప్రశ్నకు సమాధానంగా రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పేరును వెల్లడించారు. ఖమ్మం జిల్లా నుంచి దశాబ్దాలుగా వేర్వేరు క్యాబినెట్‌లలో తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. తొలుత టీడీపీ, ఆ తరువాత బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్ అండ్ బీ మంత్రిగా పనిచేసిన ఆయన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితంగా మెలిగారు కూడా. కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్ కోసం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీలో అప్పటి మంత్రి టీ హరీశ్ రావు చైర్మన్‌గా ఉండగా, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్ రావు సభ్యులుగా ఉన్నారు.
ప్రాజెక్టు స్థల మార్పు నిర్ణయంలో భాగస్వామ్యం!
అప్పట్లో తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడంలో ఈ కమిటీయే నిర్ణయం తీసుకున్నది. వీరిచ్చిన నిర్ణయం ప్రకారమే అప్పుడు మంత్రి మండలిలో చర్చించి కాళేశ్వరం ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చారు. అయితే గత పద్నాలుగు నెలలుగా జరుగుతున్న విచారణలో ఎక్కడ కూడా తుమ్మల పేరు బహిర్గతం కాలేదు. ఈటల సమాధానం బట్టి జ్యుడిషియల్ కమిషన్ మున్ముందు తుమ్మలకు నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిచే అవకాశాలపై చర్చలు నడుస్తున్నాయి. రీ డిజైన్‌లో ఆయన పాత్ర ఉన్నందున విచారణకు పిలిచే అంశాన్ని తోసిపుచ్చలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే విచారణ తరువాత తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బీ మహేష్ గౌడ్, ఎంపీ సీహెచ్ కిరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి.. ఈటలను తూర్పారబట్టారు. బీఆర్ఎస్‌తో బీజేపీకి ఉన్న లోపాయికారీ ఒప్పందం మేరకే కేసీఆర్‌ను కాపాడేందుకు ఈటలతో వివరణ ఇప్పించారా? అని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. దీనిపై బీజేపీ నాయకత్వం సమాధానం చెప్పాలని, లేదంటే ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ పెద్దలకు కూడా వాటాలు ముట్టినట్లేనని, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేననే నిజమేనని ప్రజలంతా భావించాల్సి వస్తుందన్నారు. కమిషన్ ముందు రాజేందర్, మాజీ సీఎం కేసీఆర్ అవినీతి చేయలేదని క్లీన్ చిట్ ఇచ్చారని, దీనిపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఈటల మాటలు చూస్తుంటే.. అంతర్గతంగా ఏదైనా డీల్ కుదిరిందా? అని అనుమానం కలుగుతోందన్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లినప్పుడు కేసీఆర్, హరీశ్‌పై పెద్ద పెద్ద డైలాగులు వేసిన ఆయన.. కమిషన్ ముందుకు వెళ్లగానే ఏమైందని నిలదీశారు. ఢిల్లీ బీజేపీ పెద్దల డైరెక్షన్ లో కేసీఆర్‌కు ఈటల క్లీన్ చిట్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఈ విమర్శల నేపథ్యంలో మున్ముందు మరిన్ని ఆరోపణలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నందున విచారణ మరికొన్ని నెలలు పొడిగించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హరీశ్, కేసీఆర్ చెప్పే సమాధానాలను బట్టి మరికొందరు పేర్లు మున్ముందు బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ విచారణ ఎన్ని మలుపులు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
Satellite Internet | ఇండియాలో ఇక మస్క్ ఇంటర్నెట్.. స్టార్‌లింక్‌కు కేంద్రం ప్రత్యేక అనుమతి
Viral Video | లాలూ కుమార్తె మీసా భారతి విలాసవంతమైన భవనం ఇదేనా? ఆమె రెస్పాన్స్ ఏంటి?
Etala Rajender: కాళేశ్వరం కమిషన్ విచారణలో ఈటల రాజేందర్ కు కీలక ప్రశ్నలు!