Operation Kagar | కగార్‌కు వ్యతిరేకంగా గళమెత్తుతున్న పార్టీలు.. ఒత్తిడికి కేంద్రం లొంగేనా?
మావోయిస్టుల సమస్య పరిష్కారం కోసం కాకుండా వారిని పూర్తిగా నిర్మూలించే క్రమంలో సాగుతున్న ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

- శాంతి చర్చలు జరపాలని డిమాండ్లు
- చర్చలకు పలు రాజకీయ పక్షాలు మద్దతు
- పట్టుదలతో ఉన్న కేంద్రం మెట్టు దిగేనా!
విధాత ప్రత్యేక ప్రతినిధి:
Operation Kagar | మధ్య భారతంలో ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు కేంద్రీకృతమై ఉన్నారు. వారి నిర్మూలనే లక్ష్యంగా గత కొద్దికాలంగా అప్రతిహతంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట సాయుధ చర్యలు కొనసాగిస్తున్నది. ఈ ఆపరేషన్‌పై తెలంగాణ వేదికగా రాజకీయ నిరసన గళాలు విచ్చుకుంటున్నాయి. రోజురోజుకు ఈ స్వరాలు పెరుగుతున్నాయి. నక్సలైట్ అనుకూల, వ్యతిరేక విధానాలను పక్కకు పెట్టి, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సాయుధ బలగాల ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న రక్తపాతం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాయుధ బలగాల దాడుల్లో అమాయక ఆదివాసీ యువత మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ యుద్ధంలో ఇరువైపులా ప్రాణ నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ కగార్ నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ క్రమంగా పెరుగుతున్నది. కొన్ని నెలలుగా ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతంలో నిత్యం పదుల సంఖ్యలో మావోయిస్టులు మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే. ఇరువర్గాల మధ్య యుద్ధకాండలో సాయుధ బలగాల ప్రతినిధులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. మధ్యలో ఆదివాసీలు నలిగిపోతున్నారు. గిరిజన గూడాలు, పల్లెలు నిత్యం దాడులతో తల్లడిల్లిపోతున్నాయి.
మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా ముందుకు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్‌లో కొద్దికాలం క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ పేరుతో దాడి కొనసాగిస్తున్నాయి. అటవీ ప్రాంతాలలో వేల సంఖ్యలో సాయిధబలగాలను మోహరించి, బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాలపై ఉక్కు పాదాన్ని మోపుతున్నాయి. మావోయిస్టులకు కేంద్రంగా నిలిచిన అబూజ్ మాడ్ లాంటి కీలకమైన స్థావరంతోపాటు కర్రెగుట్టలను కూడా సాయిధ బలగాలు స్వాధీనం చేసుకొని బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి మావోయిస్టుల ఉనికి లేకుండా చేయాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో గత ఏడాదిన్నర కాలంగా జరుగుతున్న యుద్ధంలో ఇప్పటికే 250 పైగా మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్యులు, ప్రధాన నాయకులు ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో మావోయిస్టు సాధారణ కార్యకర్తలు, సానుభూతిపరులు, కొందరు నాయకులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ వరుస ఎన్‌కౌంటర్లలో మరణించినవారిలో ఎక్కువమంది ఆదివాసీలు కావడం గమనార్హం. వచ్చేయేడాది మార్చి నెలాఖరు లక్ష్యంగా దేశంలో మావోయిస్టులనే వారు లేకుండా నిర్మూలిస్తామంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పదేపదే ప్రకటిస్తూ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు.
స్పందించిన తెలంగాణ సమాజం
ఇటీవలి వరుస ఎన్‌కౌంటర్లు, మృతుల సంఖ్య, సాయుధ బలగాలు అటవీ ప్రాంతంలో సాగించిన ఆధిపత్యం, వేల సంఖ్యలో బలగాలు మావోయిస్టు స్థావరాలను చుట్టుముట్టి చేస్తున్న దాడులు తెలంగాణ సమాజాన్ని కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోని పౌర సమాజం, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక శక్తులు తీవ్రంగా స్పందించాయి. శాంతి చర్చలకు ప్రతిపాదన చేస్తూ ఒక కమిటీ ఏర్పడింది. శాంతి చర్చల కమిటీ ప్రతిపాదనకు మావోయిస్టు పార్టీ కూడా సానుకూలంగా స్పందించింది. దీంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం సాగుతోంది. మరోవైపు దీనిలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంటే బాగుంటుందని అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది. ఇలా ఉండగా శాంతి చర్చల కమిటీ ఏర్పడకం ముందు నుంచి సీపీఐ, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, జనశక్తి, మాస్ లైన్, సీపీఎం, టీజెఎస్ లాంటి పార్టీలు ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
శాంతి చర్చల కమిటీతో ఎజెండాపైకి సమస్య
రాష్ట్రంలో శాంతి చర్చల కమిటీ ఏర్పాటు తర్వాత ఈ విషయం మరింతగా చర్చల్లోకి వచ్చింది. తాజాగా కర్రెగుట్టలను వేల సంఖ్యలో సాయుధ బలగాలు చుట్టుముట్టడంతో భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అయింది. అదృష్టవశాత్తు ఈ సంఘటనలో ప్రాణ నష్టం తప్పినప్పటికీ తెలంగాణ సమాజంలో విస్తృత చర్చకు దారితీసింది. ఇదే సమయంలో శాంతి చర్చల కమిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఆదివారం సమావేశం కావడం, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడంతో చర్చ మరింత పెరిగింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేయడంతో గొంతులు మరింత పెరిగాయి. సోమవారం ఇదే విషయమై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాజీ హోం మంత్రి జానారెడ్డి, కేశవరావులతో చర్చలు జరపడంతో ఈ అంశానికి మరింత ప్రాధాన్యత చేకూరింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు లేదా దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ అధికార బీజేపీపై ఒత్తిడి తెచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఎవరి రాజకీయ అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుంటే మంచిదనే అభిప్రాయం తెలంగాణ సమాజంలో మరోసారి వ్యక్తం అవుతుంది.
ఇవి కూడా చదవండి..
Operation Kagar | బేషరతుగా శాంతి చర్చలకు సిద్ధమన్న మావోయిస్టుల.. లేఖ విడుదల
ఆపరేషన్ కగార్‌ను ఖండిస్తున్నాం.. వెంటనే ఆపేయాలి
Telangana: అడవుల్లో శాంతి నెలకొనేనా! చర్చల కమిటీ ప్రయత్నం ఫలించేనా?