Telangana Hot Politics | అపరిచితుడి చుట్టూ తెలంగాణ రాజకీయాలు!

ప్రతి పార్టీ రాజకీయ పార్టీ తన ప్రత్యర్థి పార్టీ నాయకులు ఇచ్చిన హామీలు, వివిధ సమస్యలపై చెప్పిన మాటలను గుర్తు చేస్తూ సినిమా అపరిచితుడిని వాడేస్తుండగా.. జనం మాత్రం అన్ని పార్టీల నాయకుల్లోనూ నిజమైన అపరిచితులను చూడాల్సి వస్తుండటం విషాదమేనని ఊసూరుమంటున్నారు.

Telangana Hot Politics | అపరిచితుడి చుట్టూ తెలంగాణ రాజకీయాలు!

(విధాత ప్రత్యేకం)
Telangana Hot Politics | తెలంగాణ రాజకీయాలు ఇటీవల అపరిచితుడి చుట్టూ తిరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ అపరిచుతుడి జపం చేస్తుండటంతో ఆయన క్రేజ్ మరింత పెరుగుతున్నది. చట్టసభల్లోనే కాదు.. బయట కూడా నాయకులు అపరిచితుడి నామస్మరణ చేస్తుండటంతో జనం సైతం ఆసక్తి చూపుతున్నారు. అపరిచితుడిని తొలుత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయాల్లోకి తెచ్చినప్పటికీ ఇప్పుడు పీసీసీ చీఫ్ కూడా ఆయన స్మరణ చేయడం ఆసక్తికరం. చిత్రంగా పొగడ్తలకు, విమర్శలకూ కూడా నాయకులు అపరిచితుడినే వాడేస్తున్నారు. నిజానికి అపరిచితుడి పాత్ర హీరో విక్రమ్ త్రిపాత్రాభినయంతో నటించిన సినిమాలోనిది. ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ ముగ్గురిలా ప్రవర్తించడం.. తాను ముగ్గురిగా ప్రవర్తిస్తున్న సంగతి అతనికి గుర్తుండకపోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే అపరిచితుడు సినిమాలో హీరో మాదిరిగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ తరుచూ కేటీఆర్ సెటైర్లు విసురుతున్నారు. రుణమాఫీ, రైతు భరోసా, రాష్ట్ర అప్పుల లెక్కలు సహా పలు సమస్యలు, ఎన్నికల హామీలపై సీఎం రేవంత్ రెడ్డి పొంతన లేకుండా వేర్వేరు సందర్భాల్లో వేర్వేరుగా మాట్లాడుతున్నారంటూ కేటీఆర్‌ ఈ విమర్శ చేశారు. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లోనూ రేవంత్ రెడ్డి అపరిచితుడిలా మాట్లాడుతున్నారని, రామునా, రెమోనా అని ప్రశ్నించారు. ఒకసారి ఫార్మాసిటీ, మరోసారి ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ అంటూ రియల్ ఎస్టేట్‌ను కుప్పకూల్చుతున్నారని ఫైర్‌ అయ్యారు. అలా కేటీఆర్ విమర్శలతో అపరిచితుడు తెలంగాణ అసెంబ్లీలోనూ తన ఉనికిని చాటుకున్నాడు.

కట్ చేస్తే…

ఇప్పుడు ఢిల్లీలో 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి జంతర్ మంతర్ వద్ధ బీసీ సంఘాలు నిర్వహించిన ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డిని అపరిచితుడితో పోల్చుతూ పీసీసీ చీఫ్ బీ మహేశ్‌ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ఒక అపరిచితుడని, ఆయనలో ఒక రెడ్డి, బీసీ, దళితుడు, ముస్లిం, క్రిస్టియన్, యాదవ్, గౌడ్ ఇలా అన్ని వర్గాల వారు ఉన్నారని పొగిడారు. దీంతో మరోసారి అపరిచితుడు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

అటూ ఇటూ అపరిచితులే!

వాస్తవానికి రాజకీయ పార్టీలన్నింటిలోనూ అపరిచితులు.. గజినీలు ఉన్నారని పరస్పర ఆరోపణల ద్వారా బహిర్గతమైంది. ఉద్యమకాలంలో బీఆర్ఎస్ సారధి కేసీఆర్ చెప్పిన దళిత సీఎం, రామోజీ ఫిల్మ్ సిటీ లక్ష నాగళ్ల దున్నకం, కరీంనగర్, పాతబస్తీలను డల్లాస్, లండన్ నగరాలుగా మార్చేస్తామన్న మాటలు, కేజీ టూ పీజీ ఉచిత విద్య వంటి హామీలన్నీ కేసీఆర్‌ను అపరిచితుడిగా మార్చేశాయని కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇక కేటీఆర్ తరుచూ చెప్పే మాటలను కూడా కాంగ్రెస్‌ నేతలు ప్రస్తావిస్తున్నారు. ‘సీఎం నియంత కాదు.. బాస్‌ కాదు. ఓ పెద్దపాలేరు మాత్రమే. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా.. అందరూ పబ్లిక్ సర్వెంట్సే’ అని ఆయన చెప్పిన మాటలు కూడా ఆయనలో కూడా అపరిచితుడు ఉన్నాడనేందుకు నిదర్శనమంటున్నారు. బీఆర్ఎస్ పాలకులు పదేళ్లు అధికారంలో ఉండి ప్రగతి భవన్.. గడీ పాలన.. ఫామ్ హౌస్ పాలన సాగించినప్పుడు ఈ మాటలన్నీ మరిచిపోయారని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. హెచ్‌సీయూ విద్యార్థులను ఈడ్చుకెళ్లి కొడుతున్నారంటూ మొసలి కన్నీరు కారుస్తున్న కేటీఆర్.. బాసర ఐఐటీ విద్యార్ధుల పట్ల, గ్రూప్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీపైన, ఉద్యోగాల కోసం కొట్లాడిన విద్యార్ధుల పట్ల ఏ విధంగా వ్యవహరించారన్నది మర్చిపోయారని సెటైర్లు వేస్తున్నారు.

హెచ్‌సీయూ భూములను కేటీఆర్‌ అన్యాక్రాంతం చేసిన సంగతేంటి?

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు.. ఏడో హామీ ప్రజాపాలన విస్మరించారంటున్న కేటీఆర్.. గతంలో బీఆర్ఎస్ ఎన్నికల హామీలను మరిచిపోయాడని.. ధర్నాచౌక్ ఎత్తివేసిన సంగతి మరిచిపోయి అందరికంటే ముందుగానే అపరిచితుడు అయ్యాడని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. హెచ్ సీయూ భూముల పచ్చదనంపై గగ్గోలు పెడుతున్న కేటీఆర్ గతంలో అదే హెచ్ సీయూ భూములను అన్యాక్రాంతం చేసిన తీరును మరిచిపోయిన సంగతిని ప్రస్తావిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో 11,422.47హెక్టార్ల అటవీ భూములను ఇతర అవసరాలకు మళ్లించడాన్ని.. 2016 నుంచి 2019 వరకు తెలంగాణలో 12,12,753 వృక్షాల తొలగించడాన్ని మరిచిపోయి అపరిచితుడి.. గజినీగా కేటీఆర్ తయారయ్యాడని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఇక ఫిరాయింపులపై రచ్చ చేస్తున్న కేసీఆర్, కేటీఆర్.. గతంలో వారి హయాంలో సాగిన ఫిరాయింపుల బాగోతం జరుగనే లేదన్నట్టు మాట్లాడుతున్నారని చెబుతున్నారు. ఇన్ని చేసి.. తమను అపరిచితుడు క్యారెక్టర్‌తో పోల్చుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

రేవంత్‌రెడ్డిలో అపరిచితుడు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్రమంగా ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జన్సీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన రోజున చెప్పిన ప్రజాపాలన.. ఇందిరమ్మ రాజ్యం.. కంచెల తొలగింపు, నిర్బంధాల ఎత్తివేత, గడీల, దొరల పాలన అంతం అంటూ చెప్పిన మాటలు విస్మరించి అపరిచితుడిగా మారాడని బీఆర్ఎస్, బీజేపీలు విమర్శిస్తున్నాయి. లగచర్ల, హెచ్ సీయూ వివాదంలో, ఉస్మానియా యూనివర్సిటీలో నిషేధాజ్ఞలు, అసెంబ్లీ వేదికగా జర్నలిస్టులను బట్టలిప్పి కొడుతానంటూ చేసిన వ్యాఖ్యలు.. ఆయనలో అపరిచితుడు ఉన్నాడనేందుకు నిదర్శనమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రగతి భవన్ కంచెలు పీకేసి, ఎక్కడ ప్రజాందోళనలు చేసినా అక్కడ కంచెలు కడుతున్నాడని ఆరోపిస్తున్నాయి. ఇక బీజేపీ విషయానికొస్తే నల్లధనం వెనక్కి తెచ్చి పేదల ఖాతాల్లో రూ.15లక్షల హామీ మరిచి ప్రధాని మోదీ దేశానికే పెద్ధ అపరిచితుడిగా మారాడని ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. ఇలా ప్రతి పార్టీ రాజకీయ పార్టీ తన ప్రత్యర్థి పార్టీ నాయకులు ఇచ్చిన హామీలు, వివిధ సమస్యలపై చెప్పిన మాటలను గుర్తు చేస్తూ సినిమా అపరిచితుడిని వాడేస్తుండగా.. జనం మాత్రం అన్ని పార్టీల నాయకుల్లోనూ నిజమైన అపరిచితులను చూడాల్సి వస్తుండటం విషాదమేనని ఊసూరుమంటున్నారు.