Debate on Journalists: దుర్భాషలాడే జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి దుర్భాషల ప్రహసనం..

జర్న‌లిస్టుల‌పై(సోషల్ మీడియా జర్నలిస్టులపై) సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదిక‌గా చేసిన హెచ్చరిక‌లు ఇటీవల హాట్ టాపిక్ గా మారాయి. కొన్ని యూ ట్యూబ్ చానల్స్ అభ్యంత‌ర‌క‌ర‌మైన జుగుప్సాక‌ర‌మైన భాష‌తో సీఎం రేవంత్ రెడ్డిపై విమ‌ర్శ‌లు చేయ‌డం వివాదానికి కారణమైంది.

Debate on Journalists: దుర్భాషలాడే జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి దుర్భాషల ప్రహసనం..

Debate on Journalists: జర్న‌లిస్టుల‌పై, ప్రత్యేకించి సోషల్ మీడియా జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదిక‌గా చేసిన హెచ్చరిక‌లు ఇటీవల హాట్ టాపిక్ గా మారాయి. కొన్ని యూ ట్యూబ్ చానల్స్ అభ్యంత‌ర‌క‌ర‌మైన, జుగుప్సాక‌ర‌మైన భాష‌తో సీఎం రేవంత్ రెడ్డిపై విమ‌ర్శ‌లు చేయ‌డం వివాదానికి కారణమైంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న సోషల్ మీడియా యూట్యూబ్ చానల్స్.. తమ ఇష్టారాజ్యమన్నట్లుగా వార్తా కథనాలు వండి వార్చడం వివాదాస్పదమవుతున్నది. సీఎంగా ఉన్న తనపై కూడా సోషల్ మీడియా చానల్స్ అభ్యంతరకర భాషతో అభూత కల్పనలతో రాజకీయ ప్రేరేపిత కథనాలు వెలువరించడంతో రేవంత్ రెడ్డి గతం అంతా మర్చిపోయి ఒక్కసారిగా అగ్గిమీద గుగ్గిలమయ్యారు. సోషల్ మీడియా ఆగడాలపై సీఎంగా చ‌ట్ట‌ప‌రిధిలోనే స్పందిస్తానంటునే శాస‌న స‌భా వేదిక‌గా అన్ పార్ల‌మెంట‌రీ భాషలోనే మాట్లాడుతూ త‌ప్పు చేసిన జ‌ర్నలిస్టుల‌ను తోడ్క‌లు తీస్తా.. బ‌ట్ట‌లు విప్పదీసి కొడుతాం.. రోడ్డుపైన తిప్పిస్తానంటూ హెచ్చ‌రించడం చర్చనీయాంశమైంది.

నాడు అలా..నేడు ఇలా!

ప్ర‌తిప‌క్షంలో ఉన్నప్పుడు యూ ట్యూబ్ చానళ్ల‌ను తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి వినియోగించుకున్నారు. నాటి బీఆరెస్ పాలనపై విసుగెత్తిన అనేక మంది స్వచ్ఛందంగా గులాబీ పార్టీని సామాజిక మాధ్యమాల్లో ఉతికి ఆరేశారు. అవన్నీ ఫలించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకానీ.. కేవలం ఆయన పనితీరు లేదా కాంగ్రెస్ గొప్పతనం చూసి ప్రజలు ఓటేయలేదు. కానీ.. ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి త‌న విష‌యంలో అవి భ‌స్మాసుర హ‌స్తం కాగానే వాటికి అడ్డుక‌ట్ట వేయాల‌ంటూ గ‌ర్జించారు. వాస్తవానికి ఎలాంటి నియంత్ర‌ణ లేకుండా పుట్టుకొస్తున్న యూట్యూబ్, సోష‌ల్ మీడియా ప్ర‌చార‌, ప్ర‌సార సాధ‌నాలు, పీడీఎఫ్ ప‌త్రిక‌లు, వెబ్ సైట్లు అందిస్తున్న వార్తలు.. విశ్లేష‌ణలపై రచ్చ గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడమే అన్నట్లుగా మారింది. అయితే ప్ర‌జాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పేరొందిన మీడియాపై శాస‌న స‌భా వేదిక‌గా చేసే హెచ్చ‌రిక‌లు హుందాగా ఉండాల్సింద‌న్న వాద‌న వ్య‌క్తమ‌వుతోంది.

ఎందుకంటే రాజు చూసి ర‌మ్మంటే కాల్చి వ‌చ్చే సేవ‌కుల కాలం ఇది. సాక్షాత్తు సీఎం స్థాయి వ్య‌క్తినే తీవ్ర ప‌ద‌జాలంతో జర్నలిస్టులపై హెచ్చ‌రిక‌లు చేస్తే ఇక కింది స్థాయిలో అధికారులు ముఖ్యంగా పోలీసులు, చోటా మోటా నాయ‌కులు ఈ ప‌రిణామాన్ని అలుసుగా తీసుకుంటే క్షేత్ర స్థాయిలో జ‌ర్న‌లిస్టుల వృత్తి మ‌రింత కత్తిమీద సామే కానుంది. సీఎం హెచ్చ‌రిక‌ల వ్య‌వ‌హారం ఇందిర‌మ్మ రాజ్యం.. అంటే  ఇందిరమ్మ పాలనలో  ఎమ‌ర్జ‌న్సీ నాటి ప‌రిణామాల‌లో మీడియాపై అంక్షలను త‌ల‌పించేదిగా ఉందన్న విమ‌ర్శ‌లకు సైతం ఆస్కార‌మిచ్చింది. స‌రిగా ఇదే స‌మయంలో ఉస్మానియా యూనివ‌ర్సిటీలో ఆందోళ‌న‌లపై నిషేధం విధించడం ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన మ‌రో అంశం.

అజమాయిషి కోసమే నియంత్రణలా?

సోష‌ల్ మీడియాపై నియంత్ర‌ణ‌ చ‌ట్టాలు చేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్న సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఎన్నిక‌ల ప్రచారంలో వాటిని త‌న‌కు అనుకూలంగా, అనాటి అధికార ప‌క్షాల‌కు వ్య‌తిరేకంగా వార్ రూమ్ పెట్టి మ‌రి వాడుకున్న విష‌యం విస్మ‌రించ‌డం విడ్డూర‌మే. అంటే త‌న వ‌ర‌కు వ‌స్తే గాని సారుకు త‌త్వం బోధప‌డ‌లేద‌న్నట్లుగా తాను, త‌న కుటుంబం బాధితులుగా మారాక.. ఇప్పుడు పెడ‌బొబ్బ‌లు పెట్టారంటున్నాయి విపక్షాలు. సీఎం రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి అధికార బీఆర్ఎస్ పాలకులు మీడియాపై వ్యవహరించిన తీరును తప్పుపడుతూ నిర్బంధ చర్యలతో మీడియాను అధికార పార్టీ తన దొడ్లో కట్టేసుకోవాలని చూస్తుందంటూ చేసిన విమర్శలు జ్ఞప్తికి రాక మానవు. తాజాగా రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా చేసిన హెచ్చరికల వెనుక జ‌ర్న‌లిజాన్ని.. ప్ర‌ధానంగా సోష‌ల్ మీడియాను త‌న దొడ్లో కట్టేసుకోవాలన్న తెంప‌రిత‌న‌మే ఉందంటున్నాయి విపక్షాలు. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 19(1)ఏ ప్ర‌కారం వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీక‌ర‌ణ స్వేచ్చ అంద‌రికీ ఉంది. దీని అధారంగా నడుస్తున్న మీడియాకు స్వీయ నియంత్ర‌ణ బ‌ల‌హీన‌మైన ప్ర‌తిసారీ లక్ష్మణ రేఖ అంశం తెర‌పైకి వ‌స్తునే ఉంటుంది. మీడియా ప్ర‌ధానంగా సోష‌ల్ మీడియా లక్ష్మణ రేఖ ప్రశ్నార్ధ‌కం కావ‌డానికి పాల‌క, ప్ర‌తిపక్ష పార్టీలు కూడా ఎంత‌వ‌ర‌కు కార‌ణ‌మ‌న్న‌దానిపై కూడా ఆత్మ విమ‌ర్శ జరుగాలి.

తిట్లు కొత్తవి కాదు

గత పాల‌కుల‌ను ప‌రుష భాష‌తో విమ‌ర్శించి, త‌మ‌కు వ‌త్తాసు ప‌లికిన సోష‌ల్ మీడియా జ‌ర్న‌లిస్టు ఒకరిని ఏకంగా చట్టసభల ప్రతినిధిని చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిదేనని అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ జర్నలిస్టు  ప్రభుత్వ విధానాల‌ను ప్ర‌శ్నించి.. ప్రజాతీర్పును గంప గుత్తగా హైజాక్ చేసేసి.. తాను లేక‌పోతే మీరు అధికారంలోకి వ‌చ్చే వారే కాదన్న బ‌డాయి మాటలకు ఎదిగిపోయాడు. ఇందుకు తను ఎంత కారణమో రేవంత్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్ప‌టికే పెయిడ్ జ‌ర్న‌లిజం నేరారోప‌ణ‌ల‌తో త‌మ‌కు న‌చ్చిన‌ట్లుగానే మ‌హిళా జ‌ర్నలిస్టుల‌ను చ‌ట్టాలు, న్యాయ సూత్రాల ఉల్లంఘనలు ప‌ట్టించుకోకుండానే దౌర్జన్యకర స్థాయిలో అరెస్టు చేసి రిమాండ్ చేశారు. ఈ ఘటన తర్వాత కూడా జర్నలిజంపై శాస‌న స‌భా వేదిక‌గా తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం మీడియాను భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నంగానే విశ్లేషించడంలో అతిశయోక్తి లేదు. పుష్పా 2 సినిమా ప్రీమియం షో ఘ‌ట‌న అవకాశంగా తీసుకుని సినిమా వారిని అసెంబ్లీ వేదికగా.. చట్టపరంగా భయపెట్టి దారికి తెచ్చుకునేందుకు చేసిన ప్ర‌యత్నం మాదిరిగానే ఇప్పుడు క‌ట్టుత‌ప్పిన సోష‌ల్ మీడియా చాన‌ల్స్ ను అడ్డుపెట్టుకుని మీడియాను గుప్పిట పట్టే ప్ర‌య‌త్నాన్ని రేవంత్ రెడ్డి చేశార‌న్న వాద‌న కూడా వినిపిస్తున్నది.

ఎవరు జర్నలిస్టు..!

సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలలో మ‌రొక‌టి ఎవ‌రు జ‌ర్న‌లిస్టు అనేది. గుర్తింపు కార్డు లేని జర్నలిస్టులను క్రిమిన‌ల్స్ గా చూస్తాం.. వారి వార్తలు విశ్లేషించి.. అభ్యంతరకరమైతే చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్న వ్యాఖ్య‌లు నిజంగా చ‌ర్చించాల్సిందే. ప్ర‌భుత్వ గుర్తింపు కార్డు ఉంటేనే..లేదా ప‌త్రికా సంస్థ‌లు, చాన‌ల్స్ ఇచ్చే కార్డులు ఉన్న‌వారే జ‌ర్న‌లిస్టులు అంటే వారిచ్చే కార్డుల జారీ వెనుక ఎన్ని మ‌త‌ల‌బులుంటాయో కూడా ఈ సంద‌ర్భంగా ఆలోచించాలి. జర్నలిస్టులలో వారు చేసే వృత్తిపర విభాగాలను అనుసరించి రకరకాలుగా ఉన్నారు. అయితే పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొస్తున్న యూ ట్యూబ్ చానల్స్, పీడీఎఫ్ పేప‌ర్లు, వెబ్ సైట్లు.. విలేక‌రుల‌ను ఇష్టారాజ్యంగా ఎలాంటి వేత‌నాలు, రెమ్యునరేష‌న్లు ఇవ్వ‌కుండా నియ‌మించుకుంటున్నాయి. పైగా.. మీకింత మాకింత అన్న‌ట్లుగా అక్ర‌మ వ‌సూళ్ల‌ను ప్రొత్స‌హిస్తున్నాయి. తమ సంస్థలో పనిచేయాలంటే జిల్లా స్థాయిలో ఒక రేటు, డివిజన్, మండల స్థాయిల్లో ఒక రేటు నిర్ణయించి మరీ ఐడీ కార్డులు అందిస్తున్న దుస్థితిని నేడు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్ప‌టికే జర్నలిజం కమర్షియల్ జాడ్యం బారిన పడింది. బ్లాక్ మెయిల్ వార్త‌లు, పెయిడ్ న్యూస్ …వంటివి జర్నలిజం విలువ‌ల‌ను పాత‌రేస్తుండ‌గా..అక్ర‌మ దందాలు చేసే వారు మీడియా ముసుగు వేసుకుని జ‌ర్నలిస్టుగా అవ‌తారాలు ఎత్తి సమాజానికి చీడపురుగులుగా తయారయ్యారు. రాజకీయ పార్టీలు సైతం ప్రధాన మీడియాను ప్రభావితం చేస్తూ.. యూట్యూబ్ ఛానల్స్ ను కొనుగోలు చేసి ప్రోత్సహిస్తూ తమ స్వీయ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తుండటం బహిరంగ రహస్యమే. మీడియాలో క్విడ్ ఫ్రోకో పెరిగిపోవ‌డంతో స‌మాజానికి..అలాగే ప్ర‌జాస్వామ్యా ప‌రిరక్షణ‌కు వాచ్ డాగ్ ల వంటి జ‌ర్న‌లిస్టుల వృత్తి నిబ‌ద్ధ‌త నిత్యం శీల ప‌రీక్షకు నిల‌బడాల్సి వస్తోంది. న‌చ్చిన పార్టీలకు, నాయ‌కులకు బాకాలుగా మారిన మీడియా సంస్థల‌ను, జ‌ర్న‌లిస్టుల‌ను ప్ర‌భుత్వం నియంత్రించాల‌నుకోవ‌డం ప్రహసనమే.

15 నెలలైనా కొత్త అక్రెడిటేషన్లు ఇవ్వలే!

గొట్టం పట్టుకొని రోడ్డుమీద పడి చెప్పి మరీ తిట్టించేవాడు జర్నలిస్టూ కాదు.. యూట్యూబ్‌ చానళ్లలో పనిచేస్తున్నవాళ్లంతా జర్నలిస్టులు కాదు.. అలా అని యూట్యూబ్‌లో పనిచేస్తున్నవాళ్లంతా జర్నలిస్టులు కాకపోరు. చాలామంది ప్రజలకు మంచి సమాచారం అందిస్తున్నారు. ప్రధాన మీడియా పనితీరు ప్రశ్నార్ధకమైనప్పుడు సోషల్ మీడియా ప్రజలకు ప్రత్యామ్నయంగా నిలబడుతోంది. జర్నలిస్టులు రెండుమూడు దశాబ్దాలుగా రాత్రిపగలు కష్టపడి బెత్తెడు జీతాలు తీసుకుంటూ.. షుగర్లు, బీపీలే ఆస్తులుగా సంపాదించుకుంటూ తీవ్ర ఒత్తిళ్ల మధ్య పనిచేస్తున్నారు. అటువంటి వారికి ప్రభుత్వాలు కనీసం హెల్త్ కార్డులు.. అక్రెడిటేషన్లు కూడా సక్రమంగా ఇవ్వని పరిస్థితి. పాలకులు మారినా జర్నలిస్టుల హెల్త్ కార్డులు.. అక్రెడిటేషన్ల జారీలో చిత్తశుద్ధి కరువైంది. ప్రజా ప్రభుత్వం..ఇందిరమ్మ పాలనలో 15 నెలలైనా కార్డులు జారీ కాకపోవడం విచారకరం. ఈ పరిస్థితుల్లో కార్డులు లేని జర్నలిస్టులను క్రిమినల్ గా చూస్తామని.. శిక్షిస్తామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అనుకుంటే.. ముందు జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇవ్వాలి. బూతులు తిట్టేవాళ్లను, తిట్టించేవాళ్లను ఆ తర్వాత జైళ్లలో పెట్టాలి. ఇందుకోసం కొత్త చట్టం తెచ్చినా అప్పుడు అంతా స్వాగతిస్తారు.

రాజకీయ వ్యవస్థ డొల్లతనం సంగతేంటి?

జ‌ర్న‌లిస్టుల‌లో త‌ప్పుడు మనుషులున్నారనుకుంటే మరి రాజ‌కీయ వ్య‌వ‌స్థలో ఉన్న వారంతా స‌చ్చీలురా? అన్న చ‌ర్చ కూడా ఈ సంద‌ర్భంగా విస్మ‌రించ‌లేనిదే. మీడియా, లేక సోష‌ల్ మీడియాలోని త‌ప్పులు లెక్కిస్తున్న చ‌ట్ట‌స‌భ ప్ర‌తినిధులలో ఎంత‌మంది పై ఎలాంటి కేసులున్నాయి.. వారు ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారు.. అధికారంలోకి వచ్చాక వారు చేస్తున్న అక్రమాల సంగతి ఏమిటి అన్న చర్చ ఇక్కడ ప్రస్తావనార్హమే. కేవలం రాజ‌కీయ నాయకుడైతే చాలు సాటి వ్య‌వ‌స్థ‌ల‌ను విశ్లేషించ‌వ‌చ్చన్న పేటెంట్ ఏదో ఉన్న‌ట్టుగా ముఖ్యంగా ఫోర్త్ ఎస్టేట్ లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసేసి ఎవరు జర్నలిస్టు.. వారు ఏం రాస్తున్నారో మేం విశ్లేషిస్తాం.. నియంత్రిస్తామంటే.. అది ద‌య్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లేన‌నడంలో అతిశ‌యోక్తి లేదు. రాజ్యంగ బద్ధంగా ఎన్నికైన ప్రజాస్వామిక ప్రభుత్వ సారధులమన్న సోయి మాని అప్రజాస్వామిక రహస్య జీవోలతో పాలన సాగిస్తున్న నాయకత్వం ఫోర్త్ ఎస్టేట్ కు పాఠాలు నేర్పజూడటం విడ్డూరమే. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మార్చి 14 వరకు 1లక్ష 99,115 జీవోలు జారీ కాగా.. వాటిలో పబ్లిక్ డొమైన్ లో 82,657 మాత్రమే(41.51శాతం) ఉండటం..మిగతావన్ని రహస్యంగానే ఉంచడం ప్రభుత్వాల పారదర్శకతను ప్రశ్నిస్తుంది. కనీసం ఆర్టీఐ చట్ట పరిధిలో సమాచారం ఇవ్వకుండా అంతర్గత అదేశాలిచ్చిన పరిస్థితుల్లో జర్నలిస్టులకు సమాచార సేకరణ కూడా ఇబ్బందికరమే.  వ్య‌వ‌స్థ‌ల‌ కంచెల‌న్ని.. చేను మేసిన చందంగా త‌యారైన ప‌రిస్థితుల్లో వాటిని స‌త్య‌పీఠంపై నిల‌బెట్టానుకోవ‌డం బడాయి తనమే. ప్ర‌జాస్వామ్యానికి నాలుగు స్తంభాలైన‌ శాస‌న‌, కార్య‌నిర్వాహ‌క‌, న్యాయ వ్య‌వ‌స్థ‌..ఫోర్త్ ఎస్టేట్ మీడియాల ప‌విత్రత‌ గురించి చ‌ర్చలోకి వెళ్లడం పెను ప్రహసనమే.