Banakacharla Project | బనకచర్ల చుట్టూ రెండు రాష్ట్రాల రాజకీయాలు!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు చుట్టూనే తిరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ ప్రత్యర్థులను ఇరకాటంలో పడేసేలా ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నాయి. మరోవైపు రెండు మూడు రోజులుగా రెండు రాష్ట్రాల రాజకీయాలను ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారన్న చర్చలు వినిపిస్తున్నాయి.

Banakacharla Project | హైదరాబాద్, జూలై 19 (విధాత): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు చుట్టూనే తిరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ ప్రత్యర్థులను ఇరకాటంలో పడేసేలా ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నాయి. మరోవైపు రెండు మూడు రోజులుగా రెండు రాష్ట్రాల రాజకీయాలను ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారన్న చర్చలు వినిపిస్తున్నాయి. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన సీఎంల సమావేశంలో ఏం జరిగిందో బయటపెట్టాలని స్వయంగా కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ బనకచర్ల అస్త్రం
కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ నిర్వహించిన సమావేశం ఎజెండాలో ఫస్ట్ ఐటమే బనకచర్ల అని బీఆర్ఎస్ అంటున్నది. బనకచర్లపై చర్చించినట్టు, పరిష్కారం కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్టు ఏపీ మంత్రి చెప్పారని హరీశ్‌రావు లేవనెత్తుతున్నారు. ఏపీకి, చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకు ప్రజలు రేవంత్ రెడ్డికి సీఎం పదవిని అప్పగించలేదని మండిపడ్డారు. బనకచర్లపై సీఎంల సమావేశంలో చర్చ జరిగిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కూడా బీఆర్ఎస్ ప్రస్తావించింది. ఈ అంశాన్ని ఆసరాగా తీసుకుని కాంగ్రెస్‌ను, సీఎం రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు కారు పార్టీ అస్త్రాలు సంధిస్తున్నది. ఢిల్లీ వేదికగా జరిగిన సీఎంల భేటీపై బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు వరుసగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి, రేవంత్ రెడ్డి సర్కార్ తీరును తప్పుబట్టారు. అసలు ఈ సమావేశంలో బనకచర్లపై చర్చ జరగలేదనేది ప్రభుత్వ వాదన. ఈ వాదన కంటే తన వాదనను ప్రజల్లోకి వెళ్లేలా బీఆర్ఎస్ ప్రయత్నించింది. బీఆర్ఎస్ ప్రచారాన్ని కాంగ్రెస్ సర్కార్ సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయిందనేది రాజకీయ విశ్లేషకుల మాట.
ఏపీలోనూ బనకచర్లపైనే చర్చ
ఆంధ్రప్రదేశ్‌లోనూ బనకచర్ల చుట్టూ రాజకీయం సాగుతున్నది. ఢిల్లీలో సీఎంల సమావేశం జరుగుతున్న సమయంలోనే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్.. బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. జగన్ తీరును అక్కడి అధికార పార్టీ తప్పుబడుతున్నది. ఎగువ నుంచి లభ్యమయ్యే గోదావరి మిగులు జలాలను చంద్రబాబు సర్కార్ ప్రభుత్వం సరిగా అంచనా వేయడంలో విఫలమైతే.. రూ.80 వేల కోట్లతో నిర్మించాలనుకుంటున్న బనకచర్ల వల్ల ప్రయోజనం లేకుండా పోతుందనేది జగన్ వాదన. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని గోదావరి ఉప నదులపై ప్రాజెక్టుల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెబుతున్నారు. ఇంద్రావతి, ప్రాణహిత, శబరి వంటి గోదావరి ఉప నదులపై ఎగువన ప్రాజెక్టుల నిర్మాణంతో ఏపీకి సరిగా నీరు రావడం లేదని జగన్ గుర్తు చేశారు. బనకచర్లపై జగన్ వ్యాఖ్యలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని ఏపీలో అధికార టీడీపీ మండిపడింది. ఢిల్లీలో సీఎంల చర్చలు జరిగే సమయంలోనే జగన్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారని సైకిల్ పార్టీ ప్రశ్నించింది. నంద్యాల జిల్లాలో జూలై 17న జరిగిన హంద్రీనీవా కాలువకు నీటి విడుదల సందర్భంగా జరిగిన సభలో ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేశారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకించిన జగన్‌ను చరిత్ర క్షమించదని ఆయన అన్నారు. బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తామని శుక్రవారం ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విశాఖపట్టణంలో మీడియాకు చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో జగన్ మాట్లాడిన వ్యాఖ్యలను రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు సైకిల్ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. జగన్ పార్టీని ఇరుకున పెట్టేందుకు ఈ అస్త్రాన్ని వాడుకుంటున్నది.
బనకచర్లపై ఏం జరిగిందో బయటపెట్టాలి: బండి సంజయ్
కేంద్ర జల్‌శక్తిమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఏపీ, తెలంగాణ సీఎంల భేటీలో ఏం జరిగిందో కేంద్రమంత్రి బండి సంజయ్‌కు తెలియకపోవడం విశేషం. ఆ వివరాలు బయటపెట్టాలని బండి డిమాండ్ చేశారు. బనకచర్లపై కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారని.. అసలు బనకచర్లపై చర్చ జరగలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఏం జరిగిందో బయటకు చెప్పాల్సిన బాధ్యత రెండు రాష్ట్రాల సీఎంలపై ఉందని ఆయన అన్నారు. బీజేపీని, కేంద్రప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే రాజకీయ లక్ష్యం కనిపిస్తోందని మండిపడ్డారు.
చంద్రబాబు, రేవంత్ ఇరిగేషన్ గేమ్!
అధికార, ప్రతిపక్ష నేతల మాటలు, విమర్శలు ఎలా ఉన్నా.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రత్యర్థులకు చెక్ పెట్టేలా గేమ్ ఆడుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తమ తమ రాష్ట్రాల్లో రాజకీయంగా పై చేయి సాధించడమే టార్గెట్‌గా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. తమ రాష్ట్రాలకు నష్టం జరిగితే ఊరుకోబోమనే సంకేతాలిస్తున్నారు. అదే జరిగితే పక్క రాష్ట్రంతో తాడోపేడో తేల్చుకుంటామంటూ సవాళ్లు విసురుతున్నారు. అయితే ఇందులో ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయంగా అప్పర్ హ్యాండ్ కోసం గురు శిష్యులు పోటీపడుతున్నారని అంటున్నారు.
చంద్రబాబుపై పోరుకు సిద్దం: రేవంత్
బనకచర్ల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకుంటామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టుపై కేంద్ర జల్‌శక్తిమంత్రి సీఆర్ పాటిల్‌కు గత జూన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈ ప్రాజెక్టుకు కేంద్రం పర్యావరణ అనుమతులు నిలిపివేసింది. ఈ నెల 16న జరిగిన సీఎంల సమావేశంలో బనకచర్లపై చర్చ లేకుండా చేయడం ద్వారా విజయం సాధించినట్టు తెలంగాణ ప్రభుత్వం చెప్పుకొంటున్నది. నాగర్ కర్నూల్ జిల్లా జటప్రోల్లో శుక్రవారం నిర్వహించిన సభలో పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ను అడ్డుకొంటే చంద్రబాబుపై పోరు తప్పదని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాజెక్టుకు అంగీకరించి, ఇప్పుడు అడ్డుకోవాలని చూస్తే ఊరుకొనే ప్రసక్తే లేదని అన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను వెనక్కి తీసుకోవాలని రేవంత్ చంద్రబాబుకు సూచించారు. బనకచర్లే కాదు… పాలమూరు ప్రాజెక్టుల విషయంలో కూడా ఏపీతో అమీ తుమీకి సిద్దమనే సంకేతాలు ఇవ్వడం ద్వారా రాజకీయంగా ప్రత్యర్థులను ఇరుకునపెట్టేందుకు రేవంత్ ప్రయత్నించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుతో రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యారని బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి కూడా ఈ ప్రకటనతో చెక్ పెట్టినట్టైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
రేవంత్ సవాల్ కు చంద్రబాబు ఏమంటున్నారు?
ఇప్పటికిప్పుడు బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లాలనే ధోరణి ఏపీ ప్రభుత్వంలో కనిపిస్తున్నది. విశాఖపట్టణంలో ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి. అయితే నిపుణుల కమిటీ రిపోర్ట్ తర్వాత ఈ అభిప్రాయం మారుతుందా? అనేది చూడాలి. సముద్రంలో వృథాగా పోయే నీటిని మళ్లించి ప్రాజెక్టు కట్టుకొంటే తప్పేంటనేది ఏపీ వాదన. ఈ వాదనను తెలంగాణ తప్పుబడుతోంది. ఈ విషయంలో రెండు రాష్ట్రాల వాదనలు భిన్నంగా ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో రేవంత్, చంద్రబాబు తమ రాష్ట్రాల ప్రయోజనాలపై వెనక్కు తగ్గబోమంటున్నారు. ఒక రకంగా గురు శిష్యులు రాజకీయంగా ప్రత్యర్ధులకు చెక్ పెట్టేందుకు ఇరిగేషన్ ప్రాజెక్టులను అస్త్రంగా వాడుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తద్వారా రాజకీయ గేమ్ లో ప్రత్యర్థులకు చెక్ పెట్టాలని భావిస్తున్నారని అంటున్నారు. ఈ ఇద్దరి గేమ్ ప్లాన్ తో ఆయా రాష్ట్రాల్లోని ప్రత్యర్ధి పార్టీలకు స్పేస్ లేకుండా చేయాలనేది స్ట్రాటజీగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకుల మాట. ఈ గేమ్ లో ఎవరిది పై చేయి అవుతోందో భవిష్యత్తు తేల్చనుంది.