Cabinet Expansion | ’తమ్ముడు’ రెడ్డి మంత్రి అయ్యేనా?
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలుగు నూతన సంవత్సరాది ఉగాది నాడు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సుమారు గంటకు పైగా జరిగిన భేటీలో పావుగంట పాటు గవర్నర్‌తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నది. వారంరోజులుగా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. విస్తరణకు మూడే మూడు తేదీలు అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు.

- గవర్నర్ అంతర్గత భేటీలో రేవంత్ క్లారిటీ!
- చివరి నిమిషం ప్రయత్నాల్లో ఆశావహులు
(విధాత ప్రత్యేకం)
Cabinet Expansion | ఎప్పుడెప్పుడా అని కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖరారైంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలుగు నూతన సంవత్సరాది ఉగాది నాడు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సుమారు గంటకు పైగా జరిగిన భేటీలో పావుగంట పాటు గవర్నర్‌తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నది. వారంరోజులుగా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. విస్తరణకు మూడే మూడు తేదీలు అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు. ఇదెలా ఉన్నా.. విస్తరణ ఖాయమనేది తేలిపోయింది. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బీ మహేశ్ కుమార్ గౌడ్‌తో సుదీర్ఘంగా చర్చించిన విషయం తెలిసిందే. బోధన్ నుంచి గెలుపొందిన పీ సుదర్శన్ రెడ్డి, చెన్నూర్ ఎమ్మెల్యే జీ వివేక్ వెంకటస్వామి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి విస్తరణలో అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కోరారని వార్తలు వచ్చాయి. ఎన్నికలకు ముందు వీరికి స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చానని, వారికి పదవీయోగం కల్పించేందుకు అనుమతించాలని విన్నవించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కే ప్రేమ్ సాగర్ రావుకు అవకాశం కల్పిస్తే పార్టీ పటిష్టం అవుతుందని, అదిలాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లభిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి పార్టీ పెద్దలకు తెలిపారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పలువురు పార్టీ ఫిరాయించినప్పటికీ ఆయన కాంగ్రెస్‌ను వీడకుండా ఉన్నారన్నారు. నల్లగొండ జిల్లా నుంచి ఆర్అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చిందని సమాచారం. మంత్రివర్గంలోకి తీసుకుంటానని ఎన్నికలకు ముందు చెప్పానని, ఆ ప్రకారంగా రాజగోపాల్‌రెడ్డికి ఇవ్వాల్సి ఉందని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. అయితే తమ్ముడికి మంత్రి పదవిని కట్టబెట్టడం పట్ల వెంకటరెడ్డి సుముఖంగా లేరని తెలుస్తున్నది. సోదరులకే పదవులు ఇస్తారా అనే బదనాం మోయాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వాలా? వద్దా? అనేది అధిష్ఠానం నిర్ణయంపై ఆధారపడి ఉందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మంత్రివర్గంలో రెడ్డి కులం వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక మంత్రులుగా ఉన్నారు. కొత్తగా సుదర్శన్ రెడ్డి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మళ్లీ రెడ్లా?
విస్తరణలో కొత్తగా ప్రతిపాదించిన సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి పేర్లపై పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారనే వాదనలు కూడా విన్పిస్తున్నాయి. రెడ్డి కులం వారి నుంచి సరైన ప్రాతినిధ్యం ఉందని, కొత్తగా ఆ కులం నుంచి ఇద్దరిని తీసుకోవాల్సిన అవసరం లేదంటూ రేవంత్ రెడ్డి జాబితాను ఆయన తిరస్కరించారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. రెండు మూడు నెలల క్రితం మంత్రివర్గ విస్తరణపై జాబితా తయారు చేసుకుని రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి రాహుల్‌తో భేటీ అయి చర్చించిన సందర్భంగా.. ఇదేమి జాబితా? అని విసిరికొట్టినట్లు కూడా కాంగ్రెస్ ముఖ్యనాయకుల్లో చర్చ జరుగుతోంది. విస్తరణకు తేదీలు దగ్గరపడుతున్నా అధిష్ఠానం ఇంకా ఆమోదముద్ర వేయలేదు. అధికారికంగా ఒకటి రెండు రోజుల్లో సమాచారం ఇవ్వనుందని అంటున్నారు. మాదిగలు, లంబాడాలు తమ కులం వారికి ప్రాతినిధ్యం కల్పించాలని కాంగ్రెస్ పెద్దలు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌లకు వినతిపత్రాలు అందచేశారు. ముస్లిం మైనారిటీ కోటాలో ఎమ్మెల్యే ఎవరూ లేనందున, ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన సియాసత్ పత్రిక అధినేత అమేర్ అలీఖాన్‌కు ప్రాతినిధ్యం కల్పించే పరిస్థితులు ఉన్నాయి.
మీనాక్షి రాకతో మారిన సమీకరణలు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ రాకతో సమీకరణాలు మారాయి. నిన్నటి వరకు ఎక్కడా విన్పించని పేరు ఒక్కసారిగా తెరమీదకి రావడమే కాకుండా ఎమ్మెల్సీ కూడా అయ్యారు. నటి, మాజీ ఎంపీ ఎం విజయశాంతి ఎమ్మెల్యే కోటాలో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం సంచలనంగా మారింది. వాస్తవానికి ఆమెను రాజ్యసభకు పంపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. అయితే ఆయన ఆలోచనకు భిన్నంగా ఆమెకు రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర ఇవ్వడం రేవంత్ రెడ్డికి మింగుడుపడటం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ అయిన మరుసటి రోజు నుంచే ఆమె మంత్రివర్గంలోకి వస్తున్నారని, అది కూడా హోం శాఖను ఇస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి.
అధిష్ఠానం నాయకురాలిగా ఆమె మంత్రివర్గంలోకి వస్తారని సన్నిహితులు కూడా చెప్పడం ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం. విస్తరణలో మీనాక్షి అభిప్రాయాలు, సూచనలను కాంగ్రెస్ పెద్దలు ఆలకించే పరిస్థితి ఉన్నందున ఏకపక్షంగా నిర్ణయాలు ఉండవని కాంగ్రెస్ ముఖ్యనాయకులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖల్లో కోతలు ఉంటాయంటున్నారు. ఈసారి జరిగే మంత్రివర్గం విస్తరణలో నలుగురిని తీసుకుని సరిపుచ్చుతారా? మొత్తం ఆరు ఖాళీలను భర్తీ చేస్తారా? అనేది తెలియక కాంగ్రెస్ నాయకులు అయోమయానికి గురవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు జాగ్రత్తలు పాటిస్తున్నారు.
మూడు రోజులే మంచి ముహూర్తాలు
ఏప్రిల్ 2వ తేదీ చవితి, 3వ తేదీ షష్టి, 4వ తేదీ సప్తమి. ఈ మూడు తేదీల్లో ఏ రోజున మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనేది క్లియర్‌గా తెలియడం లేదు. అయితే 2వ తేదీ బుధవారం సాయంత్రం లేదా 3వ తేదీ గురువారం ఉదయం విస్తరణకు ముహూర్తం ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ రెండు తేదీల్లో వీలు కానట్లయితే 4వ తేదీని ఎంచుకోవచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో ఆశావహులు తమ ఆఖరి ప్రయత్నాలు చేసుకుంటున్నారు.