Revanth vs Rajagopal | కాంగ్రెస్‌లో ‘పదేళ్ల సీఎం’ లొల్లి! రేవంత్‌ వ్యాఖ్యలపై రాజగోపాల్‌రెడ్డి ఫైర్‌

ఎంత బలమైన నాయకుడైనా పార్టీ హైకమాండ్‌ మాటకు కట్టుబడి ఉండాలనేది కాంగ్రెస్ పాలసీ. హైకమాండ్‌ మాట వినని వారిని పక్కన పెట్టిన సందర్భాలున్నాయి. పార్టీ నుంచి బయటకు వెళ్లిన కొందరు సీనియర్లు స్వంత పార్టీలు పెట్టుకొని సక్సెస్ అయ్యారు. మరికొందరు ఫెయిలయ్యారు. పార్టీ కంటే తానే గొప్ప అనే భావనతో ఉన్న నాయకులను కాంగ్రెస్ నాయకత్వం సహించదని గతంలో జరిగిన ఘటనలే ఉదహరణగా నిలుస్తాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Revanth vs Rajagopal | కాంగ్రెస్‌లో ‘పదేళ్ల సీఎం’ లొల్లి! రేవంత్‌ వ్యాఖ్యలపై రాజగోపాల్‌రెడ్డి ఫైర్‌

Revanth vs Rajagopal | హైదరాబాద్‌, జూలై 20 (విధాత): తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ ‘సీఎం’ పంచాయితీ మొదలైనట్టుంది. ఆ పంచాయితీ కూడా ఇప్పుడు సీఎం ఎవరన్న విషయంలో కాదు.. రాబోయే టర్మ్‌లో సీఎం ఎవరన్న విషయంలో! పదేళ్లు తానే సీఎంగా ఉంటానన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో మరోసారి రచ్చ రాజకీయం మొదలైంది. రేవంత్‌ వ్యాఖ్యలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బాహాటంగానే వ్యతిరేకించారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రత్యేకించి రేవంత్‌రెడ్డి విషయంలో కొందరు నాయకులకు పొసగడం లేదనేది బహిరంగ రహస్యమే. గత ఎన్నికల అనంతరం పార్టీ అధిష్ఠానం ఆశీస్సులతో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కొంతకాలంగా తనకు ఎదురేలేదన్న రీతిలో రేవంత్‌ వ్యవహారం కనిపిస్తున్నది. నేనే.. నేనే.. అనే పదాలు తరచూ ఆయన నోటి నుంచి దొర్లుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా రాబోయే పదేళ్లు తానే సీఎం అని రేవంత్‌రెడ్డి ప్రకటించుకున్నారు. రాబోయే పదేళ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉంటుందని చెప్పడంలో ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. కానీ.. తానే సీఎంనని రేవంత్‌ స్వయంగా ప్రకటించుకోవడం అంతర్గతంగా ఉన్న అసంతృప్తులను బహిర్గతం చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఓపెన్‌గా స్పందించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. రేవంత్‌ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇప్పటికే పార్టీ పెద్దల నుంచి రేవంత్‌కు ఆశించిన మద్దతు లభించడం లేదనే ప్రచారం ఉంది. అనేక పర్యాయాలు ఢిల్లీకి వెళ్లినా రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్‌ దొరకకపోవడం కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. ఈ సమయంలో రేవంత్‌ వ్యాఖ్యలను బాహాటంగా తప్పుబట్టడం ద్వారా రాజగోపాల్‌రెడ్డి గట్టి కౌంటర్‌ వేశారన్న చర్చ నడుస్తున్నది. రేవంత్‌పై పార్టీలో, క్యాబినెట్‌లో కొందరికి అసంతృప్తి ఉన్నదని చెబుతున్నా.. ఎవరూ బాహాటంగా కామెంట్‌ చేయని పరిస్థితే ఇప్పటి వరకూ ఉంది. కానీ.. రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలతో అది రచ్చకెక్కింది. ఇటీవలి మంత్రి మండలి విస్తరణలో రాజగోపాల్‌ రెడ్డికి అవకాశం దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనకు హామీ ఇచ్చినా.. అది నెరవేరలేదు. ఈ అక్కసు లోపల పెట్టుకున్న రాజగోపాల్‌రెడ్డి.. సమయం చూసి దాన్ని బయటపెట్టారనే చర్చలు గాంధీభవన్‌ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

వైఎస్ఆర్ తరహాలో సాగాలనుకున్నారా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేసిన పాదయాత్ర కలిసి వచ్చింది. దాంతో పార్టీ కూడా మారుమాట లేకుండా వైఎస్‌కే సీఎం పదవి అప్పగించింది. ఆ ఎన్నికల్లో బీఆరెస్‌, లెఫ్ట్‌ పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకున్నది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వంపై, పార్టీపై వైఎస్‌ గట్టి పట్టు సాధించారు. ఆ విశ్వాసంతోనే 2009 ఎన్నికల్లో ఒంటరి పోటీకి అధిష్ఠానాన్ని వైఎస్‌ ఒప్పించారు. చెప్పినట్టే మళ్లీ పార్టీని అధికారంలోకి తెచ్చి, రెండోసారి సీఎం అయ్యారు. ఆ సమయంలో ఏపీలో వచ్చిన ఎంపీ సీట్లతోనే కేంద్రంలో రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తన మాటే అధిష్ఠానం వద్ద ఫైనల్ చేయించుకొనే పరిస్థితి వైఎస్‌కు ఉండేదని ఆయన సన్నిహితులు ఇప్పటికీ చెబుతుంటారు. ఈ పరిణామాలను గుర్తు చేస్తున్న కొందరు రాజకీయ పరిశీలకులు.. రేవంత్ రెడ్డి కూడా వైఎస్ తరహాలోనే ముందుకు సాగాలని భావిస్తున్నారా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మొన్నటి ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో సీనియర్లను పక్కన పెట్టి రేవంత్ రెడ్డికి సీఎం పదవిని కాంగ్రెస్ నాయకత్వం అప్పగించింది. రాహుల్ గాంధీతో ఆయనకు ఉన్న సంబంధాలు సీఎం పదవికి కారణమయ్యాయని చెబుతారు. సీఎం అయ్యాక కాంగ్రెస్ నాయకత్వంతో రేవంత్ రెడ్డికి సంబంధాలు తగ్గాయనే వాదన ఉంది. రేవంత్ రెడ్డికి రాహుల్ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదనే ప్రచారాలు బలంగా సాగుతున్నాయి. వాటిని రేవంత్‌ కొట్టిపారేసినా.. ఆ వదంతులు తగ్గలేదు. రాష్ట్రానికి రాహుల్‌ రాకపోవడాన్ని కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. ఈ నెల 4న ఎల్ బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ గ్రామస్థాయి అధ్యక్షుల సమావేశంలో మాట్లాడిన రేవంత్‌.. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు. దాని తర్వాత పలు సందర్భాల్లో వచ్చే పదేళ్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉంటుందని ఢంకా బజాయించి చెబుతూ వచ్చారు. కానీ.. ఏమైందో ఏమోగానీ.. జూలై 18న నాగర్ కర్నూల్ జిల్లా జటప్రోల్ సభలో తానే పదేళ్లు సీఎంగా ఉంటానని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం కాంగ్రెస్ లో చర్చకు కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలను రాజగోపాల్ రెడ్డి తప్పుబట్టారు. సీఎం ఎవరో కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయిస్తుందంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అంతేకాదు.. కాంగ్రెస్‌ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చేందుకు చేసే ప్రయత్నాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు సహించబోరని ఆయన హెచ్చరించడం గమనార్హం.

అధిష్ఠానం తీరు ఎలా ఉంటుంది?

ఎంత బలమైన నాయకుడైనా పార్టీ హైకమాండ్‌ మాటకు కట్టుబడి ఉండాలనేది కాంగ్రెస్ పాలసీ. హైకమాండ్‌ మాట వినని వారు ఎంతటి వారైనా వారిని పక్కన పెట్టిన సందర్భాలున్నాయి. అలా పార్టీ నుంచి బయటకు వెళ్లిన కొందరు సీనియర్లు స్వంత పార్టీలు పెట్టుకొని సక్సెస్ అయ్యారు. మరికొందరు ఫెయిలయ్యారు. శరద్ పవార్, మమత బెనర్జీ, మూపనార్ వంటి వాళ్లు స్వంత పార్టీలు పెట్టి సక్సెస్ అయ్యారు. గులాం నబీ ఆజాద్, ఎన్ డీ తివారీ వంటి వారు మూలకు వెళ్లిపోయారు. పార్టీ కంటే తానే గొప్ప అనే భావనతో ఉన్న నాయకులను కాంగ్రెస్ నాయకత్వం సహించదని గతంలో జరిగిన ఘటనలే ఉదహరణగా నిలుస్తాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించిన తర్వాత తండ్రి భౌతిక కాయం ఇంకా చితికి చేరక ముందే.. తనను సీఎంను చేయాలంటూ మెజార్టీ ఎమ్మెల్యేలతో జగన్‌ పార్టీ హైకమాండ్‌కు లేఖ రాయించారని చెబుతుంటారు. కానీ.. ఆ లేఖను బుట్టదాఖలు చేసిన హైకమాండ్‌.. అనూహ్యంగా రోశయ్యను సీఎం చేసింది. తాజాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం పదవి కోసం ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క ఆఖరు నిమిషం వరకూ ప్రయత్నించినా.. అధిష్ఠానం తన నిర్ణయం తాను తీసుకున్నది. ఉత్తమ్‌, భట్టి ఢిల్లీలో లాబీయింగ్‌ చేసుకున్న సమయంలో రేవంత్‌ మాత్రం హైదరాబాద్‌లోనే ఉన్నారు. తనకే సీఎం పదవి దక్కుతుందనే ధీమాతో ఉన్నారు.

క్యాబినెట్‌లో చోటు దక్కకే అసంతృప్తి?

అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డిని క్యాబినెట్‌లోకి తీసుకుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది. తనకు క్యాబినెట్‌లో చోటు దక్కకుండా జానారెడ్డి అడ్డు పడుతున్నారని, రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఆయన లేఖ రాయడం ఇందులో భాగమేనని రాజగోపాల్‌ రెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అప్పుడు రాజగోపాల్ రెడ్డి అనుమానమే తర్వాత విస్తరణ సమయంలో నిజమైంది. రాజగోపాల్‌రెడ్డికి క్యాబినెట్‌లో చోటు దక్కలేదు. ఇది ఆయనలో అసంతృప్తిని మరింత రాజేసిందని చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకట్ రెడ్డి ఇప్పటికే రేవంత్ కేబినెట్‌లో ఉన్నారు. రాజగోపాల్ రెడ్డికి మొండిచేయికి ఇది కూడా ఒక కారణమేనంటున్నారు. పార్టీ అవసరాల రీత్యా తనకు ఇచ్చిన హామీని అమలు చేయాలనేది రాజగోపాల్ రెడ్డి డిమాండ్. కానీ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో అవకాశం ఇవ్వలేకపోయామనేది అధిష్ఠానం వాదన.

రేవంత్ కు బాసటగా వెంకట్ రెడ్డి

పీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డికి ఇవ్వడంపై అప్పట్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కూడా ఉప్పు నిప్పుగానే వ్యవహరించారు. కాలక్రమంలో రేవంత్ రెడ్డితో సంబంధాలు మంచిగా ఉన్నాయని వెంకట్ రెడ్డి సంకేతాలు ఇస్తున్నారు. 2024 ఆగస్టులో వచ్చే 20 ఏళ్లు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని. రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని ఆయన అన్నారు. 2024 ఏప్రిల్ లో కూడా బీజేపీ శాసనసభపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన విమర్శలకు కౌంటరిస్తూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డే వచ్చే పదేళ్లు సీఎంగా ఉంటారని అన్నారు. 2023 డిసెంబర్‌లో రేవంత్ రెడ్డితో తన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోపై కంచె ఒకడైతే .. అది మించే వాడొకడే అని క్యాప్షన్ ఉంది. ఈ ఫోటో బ్యాక్ గ్రౌండ్‌లో సలార్ సాంగ్ వినిస్తోంది. ఇలా రేవంత్ రెడ్డికి ‘అన్న’ రెడ్డి సపోర్ట్ గా ఉంటున్నారు. కానీ, ‘తమ్ముడు’ రెడ్డి మాత్రం రేవంత్ మాటలను తప్పుబడుతుండటం విశేషం.