తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వ ‘నీలినీడలు’
ప్రత్యర్థి పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను ఎవరికివారే ఖండించుకుంటారులే అనే ఉదాశీనత మెజార్టీ నేతల్లో కనిపిస్తున్నది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, భువనగిరి ఎంపీ చామల కిరణ్, ఎమ్మెల్సీ అద్దంకి, అప్పుడప్పుడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ప్రభుత్వ ప్రతినిధులుగా విప్ ఆది శ్రీనివాస్, అప్పుడప్పుడు ఐలయ్య, బల్మూరి, యెన్నం లాంటి కొందరు నాయకులు తప్ప పార్టీ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు పెద్దగా స్పందిస్తున్న దాఖలాలు కనిపించడంలేదనే అభిప్రాయాన్ని పార్టీ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి.
- బలహీనమైపోయిన పార్టీ గొంతుక
- పార్టీ సంస్థాగత ‘నిర్మాణం’పై తీవ్ర నిర్లక్ష్యం
- ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుల మధ్య తీవ్ర విభేదాలు
- సెగ్మెంట్లను తమ అడ్డాలుగా భావిస్తున్న ఎమ్మెల్యేలు
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
అందివచ్చిన అధికార అవకాశాన్ని వినియోగించుకుని తెలంగాణలో పల్లె నుంచి పట్నం వరకు బలంగా వేళ్లూనుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీపై ‘ప్రభుత్వ’ నీలి నీడలు తీవ్ర ప్రభావాన్ని కనబరుస్తున్నాయి. దీంతో పార్టీ గొంతు బలహీనమైందంటున్నారు. ప్రభుత్వానికి పూర్తి అండగా, అన్నింటా వెన్నంటి నిలువాల్సిన పార్టీ… ప్రభుత్వంలోని భాగస్వాములైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఆధిపత్యం ముందు వెలవెలబోతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కీలక భూమిక పోషిస్తున్న వీరంతా ప్రభుత్వానికే కాకుండా, పార్టీకి కూడా పెద్ద గొంతుకై నిలువాల్సిన చోట తలలు వాల్చుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై, తమపై వచ్చే ఆరోపణలు, విమర్శలను కూడా తిప్పికొట్టుకోలేని దుస్థితిలో మెజార్టీ మంత్రులుండగా… వారికి మద్దతుగా నిలువాల్సిన ఎమ్మెల్యేల్లో ఎందుకో అవసరమైన స్పందన కనిపించడం లేదంటున్నారు. ఇక ప్రభుత్వంపై సాగుతున్న రాజకీయ దాడి, ఒత్తిడికి అడ్డుగోడగా నిలిచి రాజకీయ కార్యాచరణతో ఎదుటి గొంతులను మూయించాల్సిన ‘పార్టీ ముఖ్య నేతలు’ ఒకరో ఇద్దరో మినహా పెద్దగా యాక్టివ్ గా కనిపించకపోగా, కనీసం గొంతు వినిపించడంలేదంటున్నారు.
యేళ్ళుగా పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన అనేక మంది నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. వారిలో కొంత నిరాశ నెలకొన్నప్పటికీ, ఇప్పటికే నామినేటెడ్ పదవులు పొందిన అనేక మంది నాయకులు సైతం నోరు మెదపకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. వీరికి ప్రభుత్వ, పార్టీ గొంతును వినిపించేందుకు చాన్స్ ఇవ్వడం లేదన్న వాదన వినిపిస్తున్నది. మరోవైపు మెజార్టీ జిల్లాలో పార్టీ అధ్యక్షులను స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. ఇటీవల కొత్తవారిని డీసీసీ అధ్యక్షులుగా నియమించిన తర్వాత వారిని ఖాతరు కూడా చేయడంలేదంటున్నారు. వెరసి గ్రూపులు, వర్గాలతో పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారనే అభిప్రాయం క్షేత్ర స్థాయిలో వ్యక్తమవుతోంది. విభేదాలను పరిష్కరించాల్సిన పీసీసీ, క్రమశిక్షణ కమిటీలు చోద్యం చూస్తున్నాయన్న అపప్రథను మోస్తున్నాయి. వరంగల్, నల్లగొండ, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో నెలకొన్న సంఘటనలను పలువురు ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.
పార్టీపై ప్రభుత్వ ‘నీలినీడలు’
ప్రత్యర్థి పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను ఎవరికివారే ఖండించుకుంటారులే అనే ఉదాశీనత మెజార్టీ నేతల్లో కనిపిస్తున్నది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, భువనగిరి ఎంపీ చామల కిరణ్, ఎమ్మెల్సీ అద్దంకి, అప్పుడప్పుడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ప్రభుత్వ ప్రతినిధులుగా విప్ ఆది శ్రీనివాస్, అప్పుడప్పుడు ఐలయ్య, బల్మూరి, యెన్నం లాంటి కొందరు నాయకులు తప్ప పార్టీ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు పెద్దగా స్పందిస్తున్న దాఖలాలు కనిపించడంలేదనే అభిప్రాయాన్ని పార్టీ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి. మంత్రులైతే తమ కార్యక్రమాలకే పరిమితమవుతున్నారు. ప్రభుత్వంపై, పార్టీపై, సీఎం రేవంత్‌పై ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారు తమకేమీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు పొందిన మహిళా నేతలు కొందరు పెద్దగా కనిపించడంలేదంటున్నారు.
స్పందనలో పార్టీ నేతల వెనుకంజ
కాలం మారిందీ… పరిస్థితులు మారాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాల్లో సైతం శరవేగమైన మార్పులు వస్తున్నాయి. దీనికి అనుగుణంగా మార్పులు చేపట్టకుండా, ఇంకా పాత పద్ధతిలోనే నడుపుతామంటే కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లే రేజు దగ్గరలోనే ఉంటుందని పార్టీ శ్రేణులు ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యర్థి పరుగు ముందు చతికిలపడిపోకతప్పదని, వెనక్కి తిరిగి చూసుకుంటే గతం, వర్తమానం తప్ప భవిష్యత్తు శూన్యమవుతోందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
ఇక జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై గానీ, బీజేపీ తీరుపైన గానీ ప్రజల్లో తమ విధానాలు చాటిచెప్పాల్సిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, ఇతర ముఖ్యనాయకులు ఈ విషయాలు అసలు పట్టించుకున్న పాపాన పోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌లు జాతీయ రాజకీయాలపై పార్టీ పరంగా గొంతు వినిపించేందుకు ప్రయత్నించే వారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా తెలంగాణ నుంచి సీఎం రేవంత్ తప్పితే మరొకరు పెద్దగా మాట్లాడుతున్న దాఖలాలు కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. తమ నేతలు సోనియా, రాహూల్, ఖర్గేలాంటి వారిని, కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శిస్తూ, కించపరుస్తున్న సందర్భాల్లో కూడా ఈ నాయకుల్లో చలనం లేదనే విమర్శలున్నాయి. అక్కడెక్కడో ఢిల్లీలో విమర్శిస్తే తమకేంటనే తీరులో వ్యవహరిస్తున్నారని అంటున్నారు. మంత్రుల సంగతి పక్కనపెడితే, ఎమ్మెల్యేలైతే తమతమ నియోజకవర్గాల్లో కూడా పార్టీపై, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ఖండించకుండా చోద్యం చూస్తున్నారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. కాంగ్రెస్‌లో గెలిచిన వారిలో ఎక్కువ మంది కొత్తవారు ఉన్నప్పటికీ వారిని సరైన దిశలో నడిపించడంలో ప్రభుత్వ పెద్దలూ, పార్టీ నిర్లక్ష్యం కూడా కనిపిస్తున్నదని చెబుతున్నారు. ఈ కారణంగా ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతున్నదని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో ఇలానే ఉంటుందని కొందరు సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ విమర్శలను, ఆరోపణలను తిప్పికొట్టకపోవడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయనే చర్చ ఇప్పటికే పార్టీలో మరోవైపు సాగుతోంది.
నత్తనడకన ‘సంఘటన్ సృజన్ అభియాన్’
కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘సంఘటన్ సృజన్ అభియాన్’ పేరుతో ఏఐసీసీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ రాష్ట్రంలో అది నత్తనడకన సాగుతున్నదని అంటున్నారు. ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఆధ్వర్యంలో “సంఘటన్ సృజన్ అభియాన్” కార్యక్రమంపై ఈ నెల 27వ తేదీన గాంధీభవన్ లో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా మండలాలు, పట్టణాలు, డివిజన్లు, గ్రామాల కమిటీల నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అసెంబ్లీ కో ఆర్డినేటర్లను నియమించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. అందరు ముఖ్యనాయకులతో సమన్వయం చేసుకుంటూ కమిటీల జాబితాను పకడ్బందీగా సిద్ధం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే ఈ అభియాన్ ముఖ్య ఉద్దేశమని , గ్రామ స్థాయిలో పటిష్ట కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ ఈ సిద్ధం పూర్తయ్యేసరికి పుణ్యకాలం ముగిసిపోతోందంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram