నెలాఖరులో మంత్రి పదవికి అజారుద్దీన్ రాజీనామా?

మంత్రివర్గంలోకి వచ్చిన ఆరు నెలల్లో చట్టసభలకు ఎన్నికవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో అజారుద్దీన్‌కు ఇప్పుడప్పుడే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశాలు కనిపించడం లేదు.దీంతో ఆయన ఈ నెలాఖరుకు రాజీనామా చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. అధిష్ఠానం అంగీకరిస్తే మళ్లీ మంత్రి పదవి చేపట్టి, ఆరు నెలల్లోపు చట్టసభలకు ఎన్నికయ్యేందుకు అవకాశం ఉంది.

నెలాఖరులో మంత్రి పదవికి అజారుద్దీన్ రాజీనామా?
  • నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా చట్టసభకు ఎన్నిక కావాలి
  • ఇప్పట్లో ఎమ్మెల్సీ అయ్యేందుకు అనుకూలించని పరిస్థితులు
  • రాజీనామా చేసి, మళ్లీ మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం

విధాత, హైదరాబాద్:

రాష్ట్ర మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ తన పదవికి ఈ నెలాఖరుకు రాజీనామా చేసే పరిస్థితులు కన్పిస్తున్నాయి. మంత్రిగా రాజీనామా చేస్తున్నారంటూ తెలంగాణ సచివాలయంలో ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. గాంధీ భవన్‌లో నలుగురు నాయకులు కలిసిన చోట కూడా ఇదే అంశంపై ప్రస్తావించుకుంటున్నారు. మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆరు నెలల వ్యవధిలో సదరు మంత్రి.. ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అజారుద్దీన్‌ విషయలో ఆ గడువు ఏప్రిల్ నెలాఖరుతో తీరనుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి అజారుద్దీన్‌, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయంపై కేంద్రీకృతమైంది.

జూబ్లీహిల్స్‌ నుంచి పోటీ.. ఓటమి

మాజీ క్రికెటర్, హైదరాబాద్ వాసి అజారుద్దీన్ 2023లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. మళ్ళీ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అజారుద్దీన్ సన్నద్ధమయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో గెలుపు గుర్రాల కోసం సర్వే నిర్వహించింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే వరకు మూడు నాలుగు దఫాలు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించగా ప్రస్తుత ఎమ్మెల్యే వీ నవీన్ యాదవ్ పేరు ప్రముఖంగా విన్పించింది. దీంతో ఆయన అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నాయకత్వం పచ్చ జెండా ఊపింది.

మళ్లీ ఆశించి.. మంత్రి పదవితో సంతృప్తి

జూబ్లీహిల్స్‌ టికెట్‌ ఆశించిన అజారుద్దీన్‌ను ఉప ఎన్నికకు ముందుగానే రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గతేడాది అక్టోబర్ 31న లోక్‌భవన్‌లో మంత్రిగా ప్రమాణం చేశారు. నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నిక జరగ్గా, నవంబర్ 14వ తేదీన ఫలితాలు ప్రకటించారు. ఈ ఫలితాల్లో సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై నవీన్ యాదవ్ గెలుపొందారు. అజారుద్దీన్ కూడా నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించి, ముస్లిం ఓట్లు కాంగ్రెస్ వైపు వచ్చేలా చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడంతో తనవంతుగా పని చేసినప్పటికీ ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం దక్కలేదు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న దేవనపల్లి కవిత తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ఈ ఏడాది జనవరి 6వ తేదీన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదిస్తూ బులిటిన్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని మంత్రి అజారుద్దీన్‌తోపాటు కాంగ్రెస్ నాయకత్వం ఎదురు చూస్తూ వస్తున్నది. నిజామాబాద్ నుంచి లోకల్ అథారిటీ కోటాలో జిల్లా పరిషత్ సభ్యులు, మండల పరిషత్ సభ్యులు కవితను ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు.

నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూపులు

దేశంలో ఏ రాష్ట్రంలో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చినా, తెలంగాణలో ఎమ్మెల్సీకి నోటిఫికేషన్ జారీ అవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఎదురు చూసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆమె రాజీనామా చేసి మూడు నెలలు అవుతున్నా ఇంత వరకు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీకాకపోవడం అజారుద్దీన్‌ను మరింత ఒత్తిడికి గురి చేస్తున్నదని అంటున్నారు. ఈ నెలాఖరుకు ఆయనకు ఉన్న గడువు తీరిపోనుండడంతో రాజీనామా చేసే పరిస్థితులు కన్పిస్తున్నాయి.

ఇప్పటికిప్పుడు ఎన్నికల కమిషన్ కమిషన్ ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితులు లేవని సచివాలయంలో అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ తన పదవికి ఈ నెలాఖరుకు రాజీనామా చేయవచ్చంటున్నారు. ఆ తరువాత ఢిల్లీ పార్టీ పెద్దలతో ఉన్న సత్సంబంధాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్న అనుబంధం బట్టి రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చనే వాదన కూడా తెరమీదకి వచ్చింది. ఢిల్లీ పెద్దల నుంచి ఆశీస్సులు లేకపోయినా, ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి సహకారం లేకపోయినా రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి ఉండకపోవచ్చనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తున్నది. రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా అంటే అవుననే విధంగా పరిస్థితులు ఉన్నాయని సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. స్పష్టత రావడానికి మరో మూడు వారాల వరకు వేచి చూడాల్సి ఉంటుందంటున్నారు.

గతంలో హరికృష్ణకు దక్కని చాన్స్‌

  • గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నందమూరి హరికృష్ణ రవాణ శాఖ మంత్రిగా ప్రమాణం చేశారు.
  • అప్పటికి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు.
  • మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆరు నెలల వ్యవధిలో ఎన్నిక కావాల్సి ఉంటుంది.
  • ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడంతో తన మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు.
  • రాజీనామా తరువాత తిరిగి రెండోసారి మంత్రిగా ప్రమాణం చేసేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆయనకు ఆ అవకాశం దక్కలేదు.
  • అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండోసారి మంత్రిగా తీసుకునేందుకు సుముఖంగా లేకపోవడమే కారణమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.
  • తీరా ఎమ్మెల్యేగా నెగ్గాక మళ్లీ ఆయనకు మంత్రివర్గంలో తిరిగి చోటు లభించలేదు.
  • మరి ఇప్పుడు అజారుద్దీన్‌ పరిస్థితి ఎలా ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారి తీస్తున్నది.

ఇవి కూడా చదవండి.. 

అనకొండ ఆవులింత ఇంత భయంకరంగా ఉంటుందా?
డిజిటల్ జనగణనకు శ్రీకారం.. తెలంగాణలో మే 11 నుంచి తొలి దశ
ఘోస్ట్​ మర్మర్: మీ గుండె కొట్టుకుంటే… మేము కనుక్కుంటాం! – అమెరికా సంచలన టెక్నాలజీ
Keelback Snakes | దేశంలోకి కొత్త పాములొచ్చాయ్…