Phone Tapping | మంత్రుల ఫోన్లు ట్యాపింగ్! సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చలు!
తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో ప్రతిపక్షంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ఈ ఆరోపణలు చేయగా.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆరెస్ సైతం ప్రభుత్వంపై అవే విమర్శలు చేస్తుండటం విశేషం. దీనిపై సామాజిక మాధ్యమాల్లో తెగ చర్చలు నడుస్తున్నాయి.

Phone Tapping | హైదరాబాద్, జూలై 29 (విధాత) : బీఆరెస్ అధికారంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని అనుకునేవారు. సిగ్నల్, ఫేస్‌టైమ్ వంటి యాప్స్ ద్వారా మాట్లాడుకునేవాళ్లమని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పారు కూడా! అనేక మంది నాటి ప్రతిపక్ష రాజకీయ నాయకులు తమ ఫోన్లు ట్యాప్ అయినట్టు అనుమానాలను వ్యక్తం చేశారు. వీళ్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయా? లేదా? కేసీఆర్ అన్నట్టు ఇంటెలిజెన్స్ దాని అవసరాల కోసం ట్యాప్ చేసిందా? లేక తన ప్రయోజనాల కోసం అధికారపక్షమే చేయించిందా? అన్నది పక్కన పెడితే.. ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవనేది తేలింది. ఇప్పుడు ఆ వ్యవహారంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ కూడా జరుపుతున్నది. నీచానికి పాల్పడుతూ హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసి విన్నారని కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి ఇప్పటికీ విరుచుకుపడుతూనే ఉంటారు. కట్ చేస్తే.. ఇప్పుడు మళ్లీ అవే విమర్శలు ఆ నోటా ఈ నోటా వినిపిస్తున్నాయి. తమ పార్టీ నేతల ఫోన్లతోపాటు.. కొందరు మంత్రుల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తున్నదనేది ఆ చర్చల సారాంశం. ప్రత్యేకించి ప్రతిపక్ష బీఆరెస్ ఒక అడుగు ముందుకు వేసి.. మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆరోపించడం సంచలనం రేపింది. మా పార్టీ నేతలు, మంత్రుల ఫోన్లను తామెందుకు ట్యాప్ చేస్తామంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కారు పార్టీకి కౌంటరిచ్చారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నా.. అంతర్గతంగా ఇది కలకలం సృష్టిస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో కానీ.. ఇద్దరు మంత్రులు ఫోన్లో మాట్లాడుకున్న మాటలు.. సీఎం దృష్టికి వచ్చినట్టు సామాజిక మాధ్యమాల్లో తెగ ప్రచారం అవుతున్నది.
మంత్రుల మాటలు సీఎంకు ఎలా చేరాయి?
ఈ ఇద్దరు మంత్రులు గంటకు పైగా ఫోన్లో మాట్లాడుకున్నారనేది ఈ ప్రచారం సారాంశం. తమ బాధలను ఇద్దరూ పరస్పరం పంచుకున్నారని అంటున్నారు. పార్టీని వదిలేసి.. వ్యక్తిగత ఇమేజ్‌కు సీఎం ప్రాధాన్యం ఇస్తున్నారనే మాట కూడా వారిద్దరి సంభాషణల్లో చోటు చేసుకున్నదని, సరిగ్గా ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి వారిద్దరిలో ఒక మంత్రితో మాట్లాడే సమయంలో ప్రస్తావన చేశారని తెలిసింది. తాము ఆంతరంగికంగా మాట్లాడుకున్న మాట.. సీఎం నోట వినిపించే సరికి సదరు మంత్రి అవాక్కయ్యారని చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా.. ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తేవాలని కూడా సీఎం సూచించినట్టు తెలుస్తున్నది. కొందరు మంత్రులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్నారన్న చర్చలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి తిరిగి వచ్చేసినా కొందరు అక్కడే మకాం వేసి.. అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారని సమాచారం. అయితే.. వాటిని ఢిల్లీ పెద్దలు పట్టించుకోలేదని తెలుస్తున్నది. అదలా ఉంచితే.. అధిష్ఠానానికి రాసిన లేఖలో వాడిన పదాల గురించి కూడా సీఎం సదరు మంత్రి వద్ద ప్రస్తావించారని చెప్పుకొంటున్నారు. యాదృచ్ఛికమో ఏమోగానీ.. ఈ పరిణామాల తర్వాత ఒక మంత్రి ఫోన్ వాడటం లేదని తెలిసింది. తన ఫోన్ పాడైందని, ఒకటి రెండు రోజుల్లో సెట్ అవుతుందని చెబుతున్నారని అంటున్నారు. ఆయనకు ఎవరైనా ఫోన్ చేయాల్సి ఉంటే.. పీఏ లేదా ఇతరుల నంబర్లకు ఫోన్ చేయించుకుంటున్నారనే చర్చలు, వారం రోజులుగా ఫోన్ స్విచ్చాఫ్‌లోనే ఉందనే గుసగుసలు గాంధీభవన్‌లో వినిపిస్తున్నాయి.
సీఎంకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారా?
హైదరాబాద్ ఖాజాగూడలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఈ ఏడాది జూన్‌లో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ వెనుక కొందరు మంత్రులున్నారనే ప్రచారం సాగింది. ప్రభుత్వ భూమిని కాపాడే ఉద్దేశంతోనే పిటిషన్ వేశామని, దీని వెనుక ఎవరూ లేరని వారు తేల్చి చెప్పారు. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో సమావేశం కావడం కూడా చర్చకు దారితీసింది. తమకు పనులు కావడం లేదని.. ఓ మంత్రిపై వారు ఆరోపణలు చేశారు. ఒక మంత్రి ప్రోద్బలంతోనే మరో మంత్రికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ సమావేశంపై కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారని వార్తలు వచ్చాయి. నలుగురైదుగురు ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావడం పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేస్తుందని మందలించారని తెలిసింది. సమస్యలుంటే పార్టీ సీనియర్లు లేదా ఇంచార్జీల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారని కూడా బయటకు పొక్కింది.
నిఘా నీడలో ఉన్నారా?
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను అప్పట్లో విపక్షాలు చేశాయి. అయితే ఇప్పుడు తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ప్రతిపక్ష బీఆరెస్ ఆరోపిస్తున్నది. సోమవారం సిట్ విచారణకు హాజరైన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ఆరోపణలు చేశారు. డార్క్ వెబ్ లోని టూల్స్ తీసుకొని మంత్రుల ఫోన్లను ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. గతంలో ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా ఉందని ఓ ప్రజా ప్రతినిధి అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. కానీ, ఈ విషయమై బహిరంగంగా మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వాస్తవానికి ఈ ప్రచారంలో నిజమెంత? రాజకీయంగా బురదచల్లేందుకు ఇలాంటి ప్రచారాలు తెరమీదికి తెచ్చారా.. నిజంగానే ఇలా జరుగుతున్నదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు హాజరైన ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్
Rainy Season Health Tips | ఈ ఇన్ఫెక్షన్ల కాలంలో ఇమ్యూనిటీ పెంచేదెలా?
Bihar Boy Builds Aircraft at Home | టాలెంట్ కు సలామ్..రూ. 7వేల ఖర్చుతో మినీ విమానం!
Boda Kakarakaya | కొత్తగా పెళ్లైన జంటలకు.. బోడ కాకరకాయ ఓ వరం..
Bhu Bharati | తెలంగాణలో భూమి చట్టాలు ఘనం.. అమలు శూన్యం!