బీఆర్ఎస్ ‘సంస్థాగతా’నికి టీఆర్‌ఎస్ రూపంలో ఇంటిపోరు
బీఆరెస్ సంస్థాగత నిర్మాణ ప్రయత్నాల్లో కేసీఆర్‌కు కుమార్తె కవిత నుంచి ఇంటి పోరు తప్పదా? ఒకే సమయంలో రెండు పార్టీలు సంస్థాగత నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తికర చర్చలు చోటు చేసుకుంటున్నాయి.
- కేసీఆర్‌కు కంట్లో నలుసుగా మారిన కవిత
- పార్టీ నిర్మాణానికి తండ్రీ బిడ్డల మధ్య పోటీ
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
సుదీర్ఘకాలం తర్వాత పార్టీని క్షేతస్థాయి నుంచి నిర్మాణాత్మకంగా పటిష్టం చేయాలని భావిస్తున్న బీఆర్ఎస్‌కు కొత్తగా తెరపైకి వచ్చిన టీఆర్ఎస్ నుంచి ఇంటిపోరు తప్పేట్లు లేదు. ఇప్పటికే పార్టీ పేరు టీఆర్ఎస్‌తో ప్రాథమికంగా ఇబ్బందులు కలిగిస్తున్న కల్వకుంట్ల కవిత నుంచి పార్టీ బలోపేతానికి చేపట్టే కార్యక్రమానికి కూడా ఎంతో కొంత అడ్డంకులు తప్పేట్లులేవు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేత హరీశ్‌రావుకు కవిత కంట్లో నలుసుగా మారారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పదేళ్ళ తర్వాత కేసీఆర్‌లో మార్పు వచ్చి పార్టీ పటిష్టం కోసం చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. సరిగ్గి ఇదే తరుణంలో నూతనంగా రంగ ప్రవేశం చేసిన టీఆర్ఎస్… సభ్యత్వం, సంస్థాగత బలోపేతానికి నెల పాటు జెండావిష్కరణ కార్యక్రమం ప్రకటించడంతో క్షేత్రంలో ఇద్దరి మధ్య ఎంతోకొంత పోటీ ఏర్పడే అవకాశముందంటున్నారు.
పార్టీపై కేసీఆర్ ప్రత్యేక కేంద్రీకరణ
రాష్ట్రంలో బీఆర్ఎస్ బలాబలాలు తగ్గి, పార్టీ ప్రాభవం సన్నగిల్లుతున్న వాస్తవాన్ని కేసీఆర్ గుర్తించారని, అందుకే పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టారని ఆ పార్టీలో చర్చ సాగుతోంది. తిరిగి పార్టీ పునాదులు బలోపేతం చేయకుంటే మొదటికే మోసమొచ్చే ప్రమాదం ఉందని గుర్తించారంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు సుదీర్ఘకాలం మనుగడ సాధించి, తిరిగి అధికారంలోకి వచ్చిన పరిస్థితులను ఇప్పటికే కొంత అధ్యయనం చేసినట్లు చెబుతున్నారు. కేసీఆర్ అనుభవం, ఇతర పార్టీల అనుభవాలను క్రోడీకరించి తిరిగి పార్టీని పట్టాలెక్కించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు భావిస్తున్నారు. అయితే తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా పార్టీ నాయకత్వంలో మార్పు రానంత కాలం ప్రజలు తిరిగి బీఆర్ఎస్‌ను అక్కున చేర్చుకోవడం అంత సులువుకాదంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకాలం నాటి పార్టీ నాయకులు, కేడర్‌తో పాటు అధికార కాలంలో పార్టీలో చేరిన వారి మధ్య నిజమైన సమన్వయం సాధించడం ప్రధానమంటున్నారు. ఇక పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తేనే రానున్న రోజుల్లో పార్టీకి మనుగడ సాధ్యమని నాయకులు గుర్తించారని చెబుతున్నారు.

ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో కీలక నేతలతో కేసీఆర్ భేటీ
పార్టీ ఆవిర్భవించి 25 యేళ్లు పూర్తయినప్పటికీ పద్నాగేళ్ళు ఉద్యమంలో, పదేళ్ళు అధికారంలో ఉన్నందున ఇతర ప్రాంతీయ పార్టీల మాదిరి ప్రత్యేక అనుభవాలు లేవని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27 సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి, పార్టీ నిర్మాణానికి కేసీఆర్ ప్రత్యేక చర్యలు ప్రారంభించినట్లు భావిస్తున్నారు. తాజాగా ఎర్రవెల్లిలోని తన ఫాం హౌజ్‌లో 23 మంది ముఖ్యనాయకులతో కేసీఆర్ మంగళవారం మరోసారి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు ప్రక్రియ, పార్టీ ఇన్‌చార్జ్‌ల నియామకం సహా పార్టీ బలోపేతం వంటి ముఖ్య విషయాలపై చర్చించినట్లు సమాచారం. పార్టీ సభ్యత్వ నమోదు, నిర్మాణం తదితర అంశాలపై కార్యాచరణ ఇంకా విడుదల చేయనప్పటికీ నేడో, రేపో ఆ పనిలో నిమగ్నమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర కార్యవర్గం తప్ప అన్ని కమిటీలను రద్దు చేసిన నేపథ్యంలో నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు.
నెల రోజుల పాటు టీఆర్ఎస్ జెండా పండుగ
బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణానికి ఆ ఇంటి నుంచి ఏర్పాటైన టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం పోటీగా మారింది. ఇప్పటికే ఆ పార్టీ వ్యవస్థాపకురాలు కవిత నెలరోజుల పాటు జెండా పండుగ నిర్వహించాలని పిలుపునిచ్చారు. మే 20 నుంచి జూన్ 20వ తేదీ వరకు నెల రోజులపాటు రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ, మండల కేంద్రాలు, గ్రామ స్థాయి వరకు పెద్ద ఎత్తున జెండా పండుగ నిర్వహించాలని, అన్ని వార్డుల్లోనూ టీఆర్ఎస్ జెండాలు ఎగురవేయాలని కోరారు. పార్టీ విధానాలను, పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ పిలుపుతో టీఆర్ఎస్, బీఆర్ఎస్ మధ్య కొన్ని చోట్ల పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ పేరు కొంత ఇబ్బందిగా మారగా, రానున్న రోజుల్లో దీని ప్రభావం ఎంతుంటుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కవిత పార్టిని ఏ మేరకు ప్రజలు ఆదరిస్తారనేదానికంటే బీఆర్ఎస్ కు జరిగే నష్టమెంత? అనే చర్చ కూడా సాగుతోంది. ఈ కారణంగా రెండు పార్టీ సభ్యత్వ నమోదు, జెండావిష్కరణలు, సమావేశాలతో గ్రామాల్లో పోటీ పడే అవకాశం ఉందంటున్నారు. బీఆర్ఎస్‌లో ప్రాధాన్యం లభించని కొందరు అసంతృప్తులు టీఆర్ఎస్ నీడన చేరే అవకాశం ఉందంటున్నారు. రెండు పార్టీ పోటీ మధ్య మరోసారి ఏ పార్టీ తెలంగాణకు ఏం చేసిందనే చర్చ, కొన్ని వాస్తవాలు కూడా బహిరంగమయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram