నేడు రావూరి భరద్వాజ గారిపుట్టిన రోజు సందర్బంగా ప్రత్యేక కథనం
*బడి విద్య కూడా దాటని ‘ రావూరి భరద్వాజకుఅత్యున్నత పురస్కారం..!! “జ్ఞాన పీఠ “ పురస్కారాన్ని అందుకున్నఓ సామాన్యుడు ,!! *కొన్ని ఛీత్కారాలు….కొన్ని పురస్కారాలు!! *వీడెందుకు పనికొస్తాడని ? “ చాలా మందిముఖం మీదే చెప్పారు.!! *భరద్వాజ కు పిల్లనియ్యడానికి భయపడేవారట. *చలం ప్రభావంతో " బూతు " రచనలు…!! జర్నలిస్టుగా నిలదొక్కు కొని,సాహితీ వేత్తగా…పరిమళించాడు రావూరి భరద్వాజ.!! విధాత:ఓ గొప్ప వ్యక్తి మన కళ్ళముందే వుంటున్నా…,రోజూ మనతో మాట్లాడుతున్నా…ఆ వ్యక్తిలోని గొప్పతనాన్ని మనం గుర్తించం . […]

*బడి విద్య కూడా దాటని ‘ రావూరి భరద్వాజకు
అత్యున్నత పురస్కారం..!!
“జ్ఞాన పీఠ “ పురస్కారాన్ని అందుకున్న
ఓ సామాన్యుడు ,!!
*కొన్ని ఛీత్కారాలు….కొన్ని పురస్కారాలు!!
*వీడెందుకు పనికొస్తాడని ? “ చాలా మంది
ముఖం మీదే చెప్పారు.!!
*భరద్వాజ కు పిల్లనియ్యడానికి భయపడేవారట.
*చలం ప్రభావంతో ” బూతు ” రచనలు…!!
- జర్నలిస్టుగా నిలదొక్కు కొని,సాహితీ వేత్తగా…
పరిమళించాడు రావూరి భరద్వాజ.!!
విధాత:ఓ గొప్ప వ్యక్తి మన కళ్ళముందే వుంటున్నా…,రోజూ మనతో మాట్లాడుతున్నా…ఆ వ్యక్తిలోని గొప్పతనాన్ని మనం గుర్తించం . అదే వ్యక్తికి ఏదో ఓ రోజు ఒక ‘గొప్ప పురస్కారం ‘ వచ్చింద
నుకోండి..ఇక ఆ మనిషికి బ్రహ్మ రథం పడతాం. ఆయన ఇంతోడు, అంతోడు అంటూ ..ఉన్నవీ,
లేనివీ కలిపి ఆకాశానికి ఎత్తేస్తాం.అది మనిషి బలహీనత .లోకం తీరు కూడా.
రావూరి భరద్వాజ గారిది కూడా సరిగ్గా .ఇలాంటి పరిస్థితే. రచయితగా నవలలు,కథలు రాసినప్పుడు ఆయన్ను ఎవరూ.. అంతగా పట్టించుకోలేదు.కానీ..జ్ఞానపీఠ ‘ పురస్కార ప్రకటన రాగానే ఆయనింటికి ‘ క్యూ ‘కట్టారు..ఇది నా స్వానుభవంతో చెబుతున్న విషయం.ఎప్పుడూ నిర్మానుష్యంగా వుండే..ఆయన ఇల్లు (విజయనగర్ కాలనీ, హైదరాబాద్) ఆరోజు(జ్ఞానపీఠ్ ప్రకటన వెలువడిన రోజు) జనం సంద్రంగా మారింది.పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది .”వి ఐ పి ‘లంతా (నేడు సుప్రీం కోర్టు లో వున్న ఓ న్యాయమూర్తితో సహా) భరద్వాజ గారింటికి బారులు తీరారు.రోజూ చూసే భరద్వాజ గారిని…కాలనీ వాసులు ఆరోజు ప్రత్యేకంగా చూడటం విశేషం.ఇందుకు నేనే…. ప్రత్యక్షసాక్షి. (” అమ్మనుడి ” పత్రిక కోసం ఇంట
ర్వ్యూ చేయడానికి ఆరోజు నేను కూడా భరద్వాజ గారింటికి వెళ్ళాను)
ప్రపంచం కూడా చాలా చిత్రమైంది? ఛీత్కరించిన చోటనే పురస్కారాల పంట పండింది.నువ్వు……. “పనికిరావు “ పొమ్మన్న వాళ్ళే ,ఆయన ఇంటర్వ్యూల కోసం పడిగాపులు పడ్డారు.నమ్మిన చోట నాప
రాళ్ళు కూడా గుడిమెట్లవుతాయి.స్వయం కృషి వుంటే…”బడివిద్య ” పూర్తి కాకున్నా అత్యున్నత
మైన“జ్ఞానపీఠం “ దక్కుతుంది. ఇదంతా. “ రావూరి భరద్వాజ “ గారి జీవితంలో జరిగింది.
ఎత్తుపల్లాలు,ఎగుడు దిగుడులు..జిల్లేళ్ళు,పల్లేర్లు సమంగా అనుభవించిన వాడు. ఓ సామాన్యుడు
స్వయం కృషితో మాన్యుడిగా ఎదిగిన వైనాన్ని తెలుసుకోవాలంటే….“రావూరి భరద్వాజ “గారి జీవితంలోకి ఓ సారి తొంగి చూడాలి.!!
పగలంతా కూలి పని..రాత్రంతా పుస్తకం పఠనం.క్రమంగా పద్యాలు రాయడం మొదలు పెట్టాడు.
రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది.భరద్వాజకు అప్పటికి 17 సంవత్సరాలు తనకు 18 సంవత్సరాలని అబద్ధం చెప్పి సైన్యంలో చేరాడు.1945 లోయుద్ధం ముగిశాక తిరిగి రోడ్డున పడ్డాడు.
1948లో నెల్లూరుకు చేరుకొని ఆచార్య రంగా సిఫార్సుతో జమీన్ రైతు వారపత్రికలో చేరాడు..
అప్పుడే అనేకమంది సాహితీ వేత్తలతో పరిచయాలు కలిగాయి.ఆత్రేయ 8 పేజీల పుస్తకాన్ని అచ్చు
వేస్తే..అందులో..”బక్కి డొక్క” అన్న చిన్న కవిత రాశాడు భరద్వాజ.ఆతర్వాత దీనబంధు వారపత్రికలో చేరాడు.కులాంతర వివాహానికి సిద్ధమయ్యాడు.రోహిణీ అనే అనాథను పెళ్ళాడాలను కున్నాడు.కానీ ఆ ప్రయత్నం నెరవేరలేదు.దీంతో నెల్లూరు వదిలేశాడు.
రోహిణిని మరిచిపోలేక తన ” నీటి కలువలు..”.”పంకజం..” కలియని బాటలు ” అన్న కథల్లో
రోహిణిని నాయికను చేశాడు.ఆ తర్వాత రోహిణి పేరుతో ఒక ప్రచురణ సంస్థను ప్రారంభించి ‘ప్రేమ’
రుణం తీర్చుకున్నాడు..భరద్వాజ.!!
భరద్వాజకు పిల్లనియ్యడానికి భయపడేవారట.ఉద్యోగం లేదు..సద్యోగం లేదు పైగా నాస్తికుడు,పిల్లిని తేవడానికి ఎవరూ ముందుకు రాలేదు.పెద్దల భరోసా పై మల్లయ్య తన రెండో కూతురు కాంతమ్మను యిచ్చి పెళ్ళి చేశారు.ఆ పెళ్ళికి మునిమాణిక్యం నరసింహారావు గారు కూడా వచ్చారట.
ఆ తర్వాత భరద్వాజ తెనాలికి చేరుకొని సినిమా,జ్యోతి,రేరాణి పత్రికల్లో సహాయకుడిగా పనిచేశారు.
ఆ తర్వాత సమీక్ష పత్రికలో చేరాడు.పిమ్మట మద్రాసు వెళ్ళి..చందమామ పత్రికలో చేరాడు.ఆ తర్వాత అభిసారిక,జ్యోతి,చిత్ర సీమల్లో పనిచేశారు.తర్వాత హైదరాబాద్ కు వచ్చి యువ పత్రిక సంపాదక బాధ్యతలు చేపట్టాడు.ఆతర్వాత ఆకాశవాణిలో స్క్రిప్ట్ రైటర్ గా ఉద్యోగం వచ్చింది.పిమ్మట తెలుగు ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్త గా కేంద్ర సమాచార ప్రసారాల శాఖలో చేరారు.
భరద్వాజ జర్నలిస్టుగా నిలదొక్కు కొని,సాహితీవేత్తగా పరిమళించాడు.రవీంద్రుడు,చలం రచనల ప్రభావంతో ఎదిగాడు.అవార్డులు..రివార్డులూ వచ్చాయి.చివరకు విశ్వవిద్యాలయాల గౌరవ
డాక్టరేట్ కూడా పొందాడు.
*రచనకు శ్రీకారం..!!
17వ యేట నుంచి రచనా వ్యాసంగాన్ని ప్రారంభించారు భరద్వాజ.వివిధ సాహిత్య ప్రక్రియల్లో
అనేక రచనలు చేశారు.ఇందులో కేవలం పొట్ట కూటికోసం చేసిన “అతి చెత్త ” రచనలు కూడా వున్నాయి.
*ఇష్టం వున్నా..లేకపోయినా ….ఆకలి,దరిద్రం నా చేత పనికిమాలిన రచనలు చేయించాయి.
డబ్బుల కోసం డిటెక్టివ్ రచనలు చేశాను.అలాగే బూతు రచనలూ చేశాను.” అంటూ.. ఎంతో నిజా
యితీగా చెప్పారు భరద్వాజ.
*ఛీత్కారాలు…..!!
భరద్వాజ గారి జీవితంలో పురస్కారాల కంటే ఛీత్కారాలే ఎక్కువ వున్నాయి. తొలుత తన
“తల్లిదండ్రుల” తో ప్రారంభమైన ఛీత్కారాలు,ఆ తర్వాత జీవితంలో అడుగడుగునా ఎదుర
య్యాయి.
*వీడెందుకు పనికొస్తాడని ? “ చాలా మంది
ముఖం మీదే చెప్పారు.
కొందరు ఆయన వెనుక గుసగుసలాడారు.ఇవన్నీ భరద్వాజకు తెలుసు. తెలిసే వీటన్నిటిని ఆయన సహించారు…భరించారు.
*1944 లో అనుకుంటా…ఓ రోజు భరద్వాజ వారి బంధువుల ఇంటికెళ్ళాడు.స్నానం చేయడానికి సబ్బు కావాలని అడిగాడు.అప్పటికి భరద్వాజ స్నానం చేసి రెండ్రోజులైంది.ఒళ్ళంతా ఒకటే గబ్బు.
భరద్వాజ పరిస్థితిని చూసి వాళ్ళ బంధువులు ఏమనుకున్నారో ఏమో గానీ,” వీడి మొఖానికి
సబ్బు ఒక్కటే తక్కవైందా?అంటూ ఈసడించారు.దాంతో భరద్వాజ మనస్సు చివుక్కుమంది.
నిరసనగా భరద్వాజ “ సబ్బులేకుండానే స్నానం చేశాడు “…నిజానికిదొక్కటే కాదు..ఇలాంటి సంఘటనలు ఎన్నో? ఎన్నెన్నో భరద్వాజ గారి జీవితంలో తారసపడ్డాయి.!
*చలం.గారి ప్రభావం..బూతు రచనలు..!!
గుడిపాటి వెంకట చలం గారి రచనలంటే భరద్వాజ గారికి ఎంతో ఇష్టం.నూనూగు మీసాల నూత్నయవ్వ నంలో చలం ప్రభావంతో భరద్వాజ గారు పుంఖాను పుంఖాలుగా బూతు రచనలు చేశారు .చలం గారితో పరిచయం పెంచుకున్నారు.తొందరగానే వారిద్దరి మధ్య సాహితీ బంధం బలపడింది.
భరద్వాజ గారు రాసిన తొలి పుస్తకం “రాగిణి “ (1950) కి చలం గారు ముందుమాట రాశారు.
(అచ్చయిన ఆయన తొలి కథ మాత్రం “ విమల 1946ఆగస్టు,ప్రజామిత్ర ).
*చలం గారి కథను తిప్పి పంపిన భరద్వాజ !!
భరద్వాజ గారు తెనాలిలో ఓ పత్రికలో పనిచేస్తున్నప్పుడు ‘మన భరద్వాజ వున్నాడు కదా ‘అని
చలం గారు ఓ కథను ప్రచురణకోసం పంపారు.అయితే చలం కథను తిరుగుటపాలోనే తిప్పిపంపారు భరద్వాజ.. చలంగారి కథలో వైవిధ్యం లేకపోవడమే అందుకు కారణం.తన కథను ప్రచురించకుండా తిప్పి పంపినందుకు చలం గారుఏమాత్రం కోపగించు కోలేదట.పైగా..అప్పట్లో భరద్వాజ గారు తన రచనల్లో బూతుల్ని గుప్పించినా, “బాగా వుందయ్యా “ భరద్వాజ అంటూ చలం గారు మెచ్చుకునే వారట.
భరద్వాజ గారు చలం సాహిత్యాన్ని విస్తృతంగా చదివారు. దాంతో చలం భావాలు, ఐడియాలజీ
ఆయనకు బాగానే ఒంటబట్టాయి.ఓ దశలో చలం శైలిని అచ్చు గుద్దినట్లు అనుకరించారు భరద్వాజ.
దీనివల్ల చలం గారి రచనలకు, భరద్వాజ రచనలకు మధ్య భేదం కనుక్కోవడం కూడా కష్టమయ్యేదట.అయితే ఆతర్వాత భరద్వాజ గారు క్రమంగా చలం ప్రభావం నుండి బయటపడ్డారు అది వేరేసంగతి.
*చలంగారిని విభేదించిన భరద్వాజ !!
ఓ రకంగా చలంగారితో భరద్వాజ గారు ‘డిఫర్ ‘ అయ్యారనే చెప్పొచ్చు.దీనికి ప్రధాన కారణం
‘వేశ్యావృత్తిలో “ స్వేఛ్ఛ”ను గురించి చలం వర్ణించిన తీరుకు,లోకంలోని వాస్తవిక పరిస్థితికి మధ్య ఎంతో అంతరాయం వుందని భరద్వాజ గుర్తించారు.చలం గారి మాటలకు,లోకం పోకడలకు
మధ్య ఏమాత్రం సామీప్యత లేదన్నది భరద్వాజ గారి అబ్జర్వేషన్. అప్పటి నుండే చలంగారి భావ
జాలంతో ఎడంగా జరిగారు.భరద్వాజ.సెక్స్,బూతు వంటి భ్రమలు,బలహీనతల నుండి క్రమంగా బయటపడి , సామాజిక స్పృహను అలవర్చుకొని….గొప్ప రచనలు చేశారు
*పాకుడురాళ్ళు.!!
భరద్వాజ గారు..అంతకు ముందు రాసిన ‘పాలపుంత’ కథనే తిరగరాసి “పాకుడు రాళ్ళు”
నవలగా మలిచారు.మద్రాసులో సినిమా కథలు రాస్తున్న సమయంలో ఓ సినీనటి(నవలా నాయిక మంజరి)తో పరిచయమవడం..ఆమె జీవితం లోని బాధలు..వెతలు వెరసి …పాకుడు రాళ్ళు ” కథా
వస్తువైంది.చలనచిత్ర పరిశ్రమ నేపథ్యంలో వెలువడిన తొలి తెలుగు నవల ఇదే కావడం విశేషం.
ఈ నవల నేపథ్యం సినిమారంగం.ఆడాళ్ళు అక్కడ నిలదొక్కొకొని పైకి రావాలంటే ఎన్ని
కష్టాలు పడాలో…ఎంత శారీరక హింసకు గురికావాలో కళ్ళకు కట్టినట్లు దృశ్యీకరించారు…
భరద్వాజ గారు.
*పాకుడు రాళ్ళు” (1965) నవలకు దేశంలో అత్యున్నత జ్ఞానపీఠ పురస్కారం (2012 )
లభించింది. సినీ రంగంలోని స్త్రీల కష్టాల్ని వున్నదున్నట్లుగా వర్ణించిన నవల ఇది.వాస్త
వానికి చాలా దగ్గరగా రాశారు భరద్వాజ.(1965లో కృష్ణాపత్రికలో ధారావాహికంగా
వచ్చింది ) ఇందులోని నాయిక మంజరి పడిన కష్టాల కంటే…నిజ జీవితంలో భరద్వాజ గారు
పడిన కష్టాలేం తక్కువకాదు.
ఉద్యోగాలకు తెలివి పెట్టుబడిలా, ఆడవాళ్ళకు శరీరం పెట్టుబడి కావడమే దౌర్భాగ్యం.ఈ నవలా
నాయిక. మంగకు(సినీ పేరు మంజరి) నాటకాల వల్ల కనీస సంస్కారం, లోకం పోకడ కొంతయినా అబ్బింది. అదీ లేకపోతే..తమ జీవితాలకు అంత మెక్కడో తెలీక, ఆ చీకటి బతుకుల, గతుకులబాటలో సతమతమై,పతనమైపోవడం మినహా మరో మార్గం లేదు.
ఎప్పుడో….అనామకంగా రాలిపోయే కాగితపు పువ్వు ఆమె జీవితం.దీనికి బాధ్యులెవరంటే… కొంత సమాజం మరికొంత కొంత ఆమె పుట్టుక,కర్మల కారణం అంటారు రచయిత.
ఆ సాలె గూళ్ళ నుండి బయటకు రాలేని పరిస్థితి . ఆమెది.. ఒకవేళ బయటపడినా….పెనం మీంచి పొయ్యలోపడ్డ తీరయ్యేది.
మంగమ్మ ఉరఫ్ మంజరి ప్రస్థానం ఈ నవలా ఇతి
వృత్తం.అందం, తెలివీ ఉండీ..,శరీరాన్ని వ్యాపార వస్తువుగా మార్చుకునే ఓ ఆడది చేసిన జీవన
ప్రయాణం.ఇది. ఆమె మగవాళ్ళను ద్వేషించ నక్కరలేదు.అలా ద్వేషిస్తే..అది వంచనే అవుతుంది.. మగాళ్ళను మెట్లలా వాడుకుని ఆమె అత్యంత ఉన్నత స్థానం చేరుకుంటుంది. ఈ ప్రయా ణంలో ఆమెకు ప్రతీ ఒక్కరి మీద అపనమ్మకం, ఎత్తుకు పైయెత్తులు.వేసేది.డబ్పు తెచ్చే సుఖాలను అనుభవించేది..అందాన్ని, మనుషుల్నీ ఎరవేసి తన చుట్టూ కుక్కల్లా తిప్పుకునేది.ఇదంతా ఆమెకు ఓ ఆట. అయితే… తను ఒక స్థాయికి వచ్చాక గౌరవంగా స్థిరపడడం పెద్దసమస్యేం కాదు..అసాధ్యమూ కాదు. కానీ ఆమె సెలిబ్రిటీ జీవితం ఆమెకు వ్యసనం అయిపోతుంది. ఆమెలో ఎక్కడో మానవతా కోణం చూపిస్తూ, తన గత జీవితపు ఛాయలైన రామచంద్రం, రచయిత, వసంత, రాజామణి లను గౌరవించడం ఒక్కటే..గుడ్డిలో మెల్ల.ఆమె ఫక్తు వ్యాపార ధోరణి అలవాట
యిన ప్రముఖ సినీతార. తాడిని తన్నేవాడుంటేవాడి
తల దన్నే వాడుంటాడన్నట్టు, ఈమె కన్నా తెలివైన వాళ్ళు ఈమెను పావుగా వాడుకుంటారు.
*చివరకు…ఒక ఒక ‘ సి(నీ) తార అంతం.
తను లైబ్రరీలో చదువుకోడానికి ఆరోజుల్లో సంవత్సర చందా..3 రూపాయలు కట్టిన ” లైబ్రేరియన్ కొల్లూరి వెంకటేశ్వర్లుకు పాకుడు రాళ్ళు నవలను అంకితమిచ్చి రుణం తీర్చుకున్నారు భరద్వాజ.
*జీవనసమరం ‘..!!
ఈనాడు దిన పత్రికలో భరద్వాజ రాసిన సామాన్యుల బతుకులకు విశేషాదరణ లభించింది.“దైవరాజకీయాలు “ కథకు స్వర్ణ కంకణం లభించింది.1968,
1983 సంవత్సరాల్లో సాహిత్య అకాడమీఅవార్డులు దక్కాయి.1987లో సోవియట్ ల్యాండ్ నెహ్రూ… అవార్డ్ ను అందుకున్నారు.మూడు విశ్వ విద్యాలయాలు గౌరవ డాక్టరేట్ తో సన్మానించాయి.నాలుగు విశ్వవిద్యాలయాల్లో పిహెచ్ డి స్థాయిపరిశోథనలు జరిగాయి.వీరి రచనలు ఇంగ్లీషు,హిందీ,తమిళ,మలయాళ తదితర భాషల్లోకి అనువాద మయ్యాయి.
పొట్టకూటికోసం ,వ్వసాయ కూలీగా,పశువుల కాపరిగా,రంపం లాగే పనివాడిగా,తిత్తులూదే కూలీగా,పేపర్ బాయ్ గా,చిన్న పత్రికల్లో ఉపసంపాదకుడిగా పనిచేశారు.ఆయన జీవిత పాఠశాలలో నేర్చుకున్నఅనుభవ సారాన్ని రచనల్లోరంగరించారు.కాబట్టే ..”జ్ఞానపీఠ”పురస్కారానికిఅర్హులయ్యారు.
*భరద్వాజ సాహిత్య దర్శనం..!!
17నవలలు, 37కథా సంకలనాలు..47 బాలలకథలు.,బాలలకోసం 6 చిన్ననవలలు.11సాహిత్య గ్రంథాలు,33 సైన్స్ కథలు , 3 వ్యాసం సంకలనాలు 8నాటకాలు ఆయన కలం నుంచి జాలువారాయి.భార్య మరణానంతరం రాసిన ఎలిజీ “నాలోని నువ్వు” ఇంకా చిన్న కథలు అవీ ఇవీ.. అన్నీ.కలుపుకుంటే సాహిత్య సాగరమే అవుతుంది.
పాకుడు రాళ్ళు నవల తర్వాత …కాదంబరి,ఇదంజగత్.వేకువ లాంటి నవలల్ని ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని ఉద్దేశించి రాశారు.ఆ తర్వాత రచించిన … “కరిమింగిన వెలగపండు ” నవలపై వివిధ విశ్వ విద్యాలయాల్లో పరిశోథనలు జరిగాయి.1981 లో వచ్చిన జీవన సమరం రచన భరద్వాజకు మంచిపేరు తెచ్చిపెట్టింది. వ్యక్తిగతంగా ఆయనకు కూడా జీవన సమరం రచనంటే ఎంతో ఇష్టం.
*కథలు…!!
రావూరి భరద్వాజ అనేక కథలు రాశారు.ఒకదోమ కథ” …ఒక చీమ కథ.” *తేనీరు “.
*కథానాయకుడు దొరికాడు”.పేదనిజం’.వాడే వీడు “..లాంటి కథలు ఆయనకు కథా రచయి
త గా గుర్తింపు తెచ్చిపెట్టాయి.
*కాంతం..”ఏకాంతం.!!(ఎలిజీ)
ప్రతీ గొప్ప వ్యక్తి వెనుక ఒక స్త్రీ వుంటుందన్న మాటలో ఎంత నిజముందో.. భరద్వాజ గారి సహధర్మచారిణి ” కాంతమ్మ” గారిని చూస్తే..తెలుస్తుంది.”సహధర్మ చారిణి అనే భావనకు
రూపం వస్తే..అది ‘ కాంతమ్మ’ అవుతుందంటారు..భరద్వాజ.
*మొదటి తల్లి పేరు ‘ లేమి ‘(దరిద్రం) ..
నా రెండవ తల్లి పేరు “కాంతం’.అంటారు
భరద్వాజ.
సతీ వినియోగంతో..ఆ పరమ శివుడు పడిన దుఃఖం ఎటువంటిదో తెలీదు కానీ…భరద్వాజ
పడిన దుఃఖం అక్షరాలుగా ప్రవహించి,..5 స్మృతి (ఎలిజీ) రచనలుగా అవతరించాయి.1988 ఆగస్టు
1 న కాంతమ్మ గారు కాలం చేశారు.అప్పటి నుండి భరద్వాజ గారిడైరీలు కాంతమ్మ గారి స్మృతి తో తడిసి ముద్దయ్యాయి.
*నేనిప్పుడు సీతలేని రాముడ్ని..పార్వతి లేని శివుడ్ని.చుట్టూ ఎందరెందరున్నా..అందరి మధ్యా ఒంటరి వాడ్ని…అనేవారు భరద్వాజ.తనకు ప్రాణ ప్రదమైన ” కాంతం ” లేని ” ఏకాంతం” లో కూడా
కాంతాన్ని దర్శించడానికి నా ద్రుష్టి భరద్వాజ.జ్జాన
పీఠం పురస్కారం వచ్చినప్పుడు సంతోషం పెంచుకునేందుకు భార్య పక్కన లేకపోయిందని
బాధపడేవారు..శోకం లో నుంచి శ్లోకం పుట్టినట్లు.ఆయన బాధలోంచి ..స్మృతి కావ్యాలు పుట్టాయి.
ఏకాంతంలో తన భార్య కాంతమ్మను తలుచుకుంటూ..రోజూ రాసుకున్న డైరీలే..ఈ స్మృతి
రచనలు.అవి…
1.నాలోని నువ్వు
2.అఃతరంగిణి
3.ఐతరేయం
4.అయినా ఒక ఏకాంతం
5.ఒకింత వేకువ కోసం.
ఇవన్నీ..స్మృతి కావ్యాలుగా ప్రసిధ్ధికెక్కాయి.
భరద్వాజ గారుప్రత్యేకంగా కవిత్వం రాయలేదు.కానీ…ఆయన వాక్యాలు కవిత్వంలా మైమర
పిస్తాయి.
*నేనో వాన చినుకుగా మారి నీ చిన్నారి పెదవుల
మీద వాలి పోదామనుకుంటున్నాను.
*నేనో వెన్నెల కిరణం గా మారి నీ చెక్కిలి మీంచి
జారిపోయాను కుంటున్నాను.
“నేనో పరిమళం తరంగాన్నయి నిన్ను నోలువునా
ఆవరించుకొందామనుకుంటున్నాను.
…... (ఐతరేయం..పేజి 44 )
ఇటువంటి రసాత్మక వాక్యాలు భరద్వాజ రచనల్లో
కోకొల్లలు.ఈ వాక్యాల్ని చూస్తే..రవీంద్రుని గీతాంజలి లోని సౌందర్యోపాసనను భరద్వాజ గారు ఔపోసన
పట్టారా? అనిపిస్తుంది.కొన్ని చోట్ల గీతాంజలిని
పోలిన పంక్తుల్ని మక్కికి మక్కిలా వాడేశారు కూడా..
*ఎక్కడ అన్నాను రాశులు ప్రక్కనే ఆకలి చావులుం
డవో…
*ఎక్కడ పసిపాపల చేతులు పనులను తాకవో..
*ఎక్కడ పడుతుందని పిడికెడు మెతుకులు కోసం
వ్యభిచరించదో…
*వైద్యం డబ్బుకి కాక..జబ్బుకు లభిస్తుందో..
*ఎక్కడ శుష్క వాగ్దానాలు హోరెత్తించవో…
…... (హంసధ్వని...పేజి. 88 )
రవీంద్రుని సౌందర్య పిపాస కు సామాజిక స్పృహ ను జోడించడం భరద్వాజ ప్రత్యేకత.
భరద్వాజ యేం రాసినా (చలం ప్రభావం
నుంచి బయట పడ్డాక ) సామాజిక స్పృహ
తోనే రాశారు.సమాజం లోని కష్టాలను ,బాధల్ని
అక్షరీకరించారు.
*నాణేనికి రెండో పక్క..!!
కేవలం బూతే …కాదు..”.నాణేనికి రెండో పక్కలా “ తన రచనలకు సామాజిక స్పృహ కూడా వుందని భరద్వాజ గారు రుజువుచేశారు .చలం గారి ‘ మత్తు‘ఒదిలే దాకా భరద్వాజ “బూతు “ రచయితగానే
వున్నారు.నిజానికి చలం ప్రభావంలో నుంచి బయటకు రాకుండా వున్నట్లయితే…ఆయనబూతు
రచయితగానే మిగిలిపోయే వారేమో? చలం గారి భావాలకు , సిద్ధాంతాలకు ఎడంగా జరగడంవల్లనే..భరద్వాజ గారు “జ్ఞానపీఠం “ దాకా చేరుకున్నారా?ఏమో.?
*చివరగా…
*భరద్వాజ పేదరికంలో మగ్గిపోయారు.…
*జీవితంలో ఎదురు దెబ్బలు తిన్నారు..
*భంగపడ్డాడు..అవమానాలు పాలయ్యారు..
అయినా…ఆత్మ విశ్వాసం కోల్పోకుండా..ఎదురొడ్డి నిలిచారు..పడి లేచిన కెరటమయ్యారు..
స్వ సుఖం కంటే…లోకం ఆనందాన్ని కోరుకున్నారు.
*ఆకలి,దరిద్రం,అజ్ఞానం,దోపిడి,ఇవి లేని సమాజం కావాలి. నేను సుఖపడ గలిగేది.. సంతోషం నా
చుట్టూ వున్నవారు సుఖపడితే..కలిగేది ఆనందం.”అంటారు భరద్వాజ.ఆయన తన సుఖం లోని
సంతోషం కంటే, తోటివారి సుఖం వల్ల తనకు కలిగే ఆనందమే మిన్న అనడం భరద్వాజ గారి వ్యక్తిత్వంలో ‘మెచ్చు’ తునక.
దుర్భర దారిద్య్రంలో పుట్టినా. మంచి ❤️మనసున్న మారాజు భరద్వాజ గారు. పుట్టెడు దుఃఖంలో మునిగినా,అందులోనే ఆనందాన్ని వెతుక్కున్న మౌన…
ముని ఆయన.
ఎ.రజాహుస్సేన్..!!
(A.Raja Hussain)
Hyderabad