Maoists surrender intense debate | లొంగుబాటా… వెసులుబాటా! మల్లోజుల, ఆశన్న నిర్ణయంపై మేధావి వర్గం ఏమంటున్నది?

‘అనుభవాలనుంచి గుణపాఠాలు నేర్చుకోలేని గిడసబారిన మెదళ్ల కారణంగానే కమ్యూనిస్టు ఉద్యమం ఇన్ని చీలికలు పేలికలైంది. చరిత్ర మళ్ళీ మళ్ళీ పునరావృతమవుతుందని ఎందుకంటారో ఇప్పుడు మరోసారి అనుభవం అవుతున్నది. మన లక్ష్యాల కోసం, మన ఆకాంక్షల కోసం మరొకరు బలైపోవాలనుకోవడం న్యాయం కాదు’.

Maoists surrender intense debate | లొంగుబాటా… వెసులుబాటా! మల్లోజుల, ఆశన్న నిర్ణయంపై మేధావి వర్గం ఏమంటున్నది?

హైదరాబాద్‌, అక్టోబర్‌ 18 (విధాత ప్రతినిధి):

Maoists surrender intense debate | మొన్న మల్లోజుల వేణుగోపాల్‌.. నేడు ఆశన్న! మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలక భూమికలు నిర్వహించిన సీనియర్‌ నాయకులు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ నేపథ్యంలో వరుస ఎన్‌కౌంటర్లు, వందల కొద్దీ మరణాల దరిమిలా మావోయిస్టు ఉద్యమంలో ‘ఆయుధాలు వదిలేయడం’పై సుదీర్ఘ మేధో యుద్ధమే సాగింది. భిన్నాభిప్రాయాల నడుమ సీనియర్‌ నేతలు మల్లోజుల వేణుగోపాల్‌, ఆశన్న పెద్ద సంఖ్యలో మిలిటెంట్లతో కలిసి లొంగిపోయారు. నిజానికి ఈ పదం వాడొద్దనేది ఆశన్న వినతి. తాము ఆయుధాలు అప్పగించి, సాయుధ పోరాటాన్ని విరమించామే తప్పించి.. ప్రజా ఉద్యమాల్లో మమేకమవుతామని ఆశన్న స్పష్టంగానే చెప్పారు. మల్లోజుల వైఖరీ అంతకు ముందు అదే. అయితే.. మల్లోజుల, ఆశన్న నిర్ణయంపై కరడుగట్టిన మావోయిస్టు మేధావుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రగతిశీల శక్తుల్లో సానుకూలతలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. యావత్‌ దేశంలో ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసేందుకు వీరిద్దరు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా ఉంది. దీనిపై పెద్ద ఎత్తున మేధో మథనమే సాగుతున్నది. “బ‌య‌ట ఉన్న కొంత మంది సోకాల్డ్ మేధావులు ‘వాళ్లు లోప‌ల ఉండి చచ్చిపోవాలి… వారిని మరణాలను తాము బ‌య‌ట ఉండి కీర్తించాల‌న్న‌ట్లుగా ఉంది” ఒక విప్ల‌వ ఉద్య‌మ సంస్థ‌ల మేధావి అన్నారు. మావోయిస్టు పార్టీ అగ్ర‌నేత‌లు మ‌ల్లోజుల కోటేశ్వ‌ర‌రావు, ఆశ‌న్న‌ ప్ర‌భుత్వానికి తుపాకులు అప్ప‌గించి త‌మ అనుచ‌రుల‌తో పెద్ద ఎత్తున బ‌య‌ట‌కు రావ‌డాన్ని త‌ప్పు ప‌డుతూ ఉద్య‌మ‌ ద్రోహుల‌ని, పోలీస్ ఏజెంట్లు అని సోష‌ల్ మీడియా వేదిక‌గా కొంత మంది మేధావులు, బుద్ధిజీవులు చేస్తున్న విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు, అంభాడాల‌కు ఈ వ్యాఖ్య స‌రిగ్గా స‌రిపోతుంద‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఒక‌రు అన్నారు. వాస్త‌వంగా ప్ర‌భుత్వానికి ఆయుధాలు అప్ప‌గించిన మావోయిస్టులు తాము ఆయుధాలు మాత్ర‌మే దించాం.. కానీ ప్ర‌జ‌ల‌తోనే ఉంటామ‌ని ప్ర‌క‌టించారు. వాళ్లు ఈ మాత్రం ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన అష్యూరెన్స్ చాల‌ని మ‌రో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు చెప్పారు. మ‌హారాష్ట్ర‌, ఛత్తీస్‌గఢ్‌ ప్ర‌భుత్వాల‌కు ఆయుధాలు అప్ప‌గించిన మావోయిస్టులు ప్ర‌భుత్వాల‌తో ప‌లు ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిపిన త‌రువాత‌నే ఆయుధాలు అప్ప‌గించిన‌ట్లు ఆశ‌న్న మాట్లాడిన మాట‌ల‌ను బ‌ట్టి స్ప‌ష్టం అవుతున్న‌ది. వాళ్లు న‌మ్మిన సిద్ధాంతం అమ‌లు చేయాల‌న్నా ముందు బ‌త‌కాలి క‌దా? అని ఒక విద్యావేత్త అన్నారు.

నక్సల్‌బరిలో ఉరిమి..

న‌క్స‌లైట్ ఉద్య‌మం పశ్చిమబెంగాల్‌లోని న‌క్స‌ల్‌బ‌రి నుంచి మొద‌లుకొని శ్రీ‌కాకుళం, గోదావ‌రి లోయ‌ల మీదుగా ఛత్తీస్‌గఢ్‌లో అబూజ్‌మాడ్ వ‌ర‌కు వెళ్లింది. కానీ ఈ దేశాన్ని విముక్తి చేసి క‌మ్యూనిస్టు రాజ్యాన్ని స్థాపించే సంగ‌తేమో కానీ వంద‌లామంది మెరిక‌ల్లాంటి యోధులు అసువులు బాశారు. చివ‌ర‌కు అబూజ్‌మాడ్‌లో మావోయిస్టుల ఏరివేత పేరుతో ప్రభుత్వం క‌ర్రెగుట్ట‌ల‌ను జల్లెడ ప‌ట్టింది. ఆదివాసీల‌ను ఊచకోత కోసింది. మిగిలిన వాళ్లు బ‌తుకు జీవుడా అని మోక‌రిల్లే ప‌రిస్థితి తీసుకు వ‌చ్చింది. రాజ్య‌మేలుతున్న రైట్ వింగ్ ప్రభుత్వం దేశంలోప‌ల ఉద్య‌మాలు చేస్తున్న వారిపై శ‌త్రువుల‌మీద ప్ర‌యోగించే ఆయుధాల‌ను ప్ర‌యోగిస్తున్న‌ద‌ని, అదే ప్రజాస్వామిక శక్తులున్న ప్రభుత్వాలు అలాంటి పని చేయలేవని మేధావి వ‌ర్గాలు చెపుతున్నాయి. ఇలాంటి ద‌శ‌లో ప్ర‌జ‌ల త‌ర‌ఫున పోరాడ‌టానికి ప్రాణాలు ఉండాలి క‌దా? ప్రాణం లేకుండా ఎలా పోరాడ‌తారు? అని మ‌రో విద్యావంతుడు ప్రశ్నించారు. వ్య‌క్తిగ‌త, కుటుంబ జీవితాన్ని మొత్తంగా త్యాగం చేసిన‌ మావోయిస్టు పార్టీ అగ్ర‌నాయకులు ప్రభుత్వాల దాడి నుంచి ఉద్య‌మాల‌ను, గిరిజ‌నుల‌ను కాపాడుకోవ‌డానికే ఆయుధం వీడి బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని ఎందుకు అనుకోకూడ‌ద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మావోయిస్టు అగ్ర‌నేత ఆశ‌న్న ప్ర‌భుత్వానికి ఆయుధాలు అప్ప‌గించ‌డానికి ముందు మాట్లాడిన మాట‌లే దీనికి ఉదాహరణగా చెపుతున్నారు.

నాడు.. నేడు

1951లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విర‌మ‌ణ‌ను ఈ ప‌ద్ధతుల్లోనే ప‌రిశీలించాల‌ని వామ‌ప‌క్ష మేధావి ఒక‌రు అన్నారు. అతివాదం, పిడివాదం కాద‌ని, వాస్త‌వ వాదంతో ముందుకు వెళ్లాల‌ని అంటున్నారు. నాడు రావినారాయ‌ణ రెడ్డి సాయుధ పోరాటం విర‌మిద్దామంటే ద్రోహిగా ప్ర‌క‌టించారు. ఫ‌లితంగా 4 వేల మంది తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యవత నాడు నెహ్రూ సైన్యాల చేతిలో చ‌నిపోయారు. అలానే విప్ల‌వం పేరుతో ఆయుధాలు ప‌ట్టిన తెలంగాణ యువ‌కులు వేలాది మంది ప్రభుత్వం చేతిలో చ‌నిపోయార‌ని అంటున్నారు. నాడు రావి నారాయ‌ణ రెడ్డి అయినా.. నేడు మ‌ల్లోజుల వేణుగోపాల్‌రావు, ఆశ‌న్న‌ అయినా ముందు ఉద్య‌మాల‌ను, క్యాడ‌ర్‌ను కాపాడుకోవ‌డం కోసం చేసిన ప‌నిగా చూడాల‌ని అంటున్నారు.

ఆయుధాలు వీడినా ప్ర‌జ‌ల‌తోనే..

ప్ర‌జ‌ల కోసం.. ప్ర‌జ‌ల‌తో క‌లిసి ప్ర‌జాస్వామ్య మార్గంలో ప‌ని చేయ‌డానికే తాము ఆయుధాలు వదిలిపెట్టామని ఆశన్న చెబుతున్నారు. లొంగుబాటు అని పిలిపించుకోవాల‌నుకోవ‌డం లేదని స్పష్టం చేశారు. డిస్ట్రిక్ట్‌ రిజ‌ర్వ్డ్‌ గార్డ్స్‌ (డీఆర్‌జీ)లో చేర‌బోమని తేల్చి చెప్పిన ఆశన్న.. ఎటువంటి నైపుణ్య అభివృద్ధి శిక్ష‌ణ తీసుబోమని, ప్ర‌జ‌ల‌తో కలిసి, ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తామని చెప్పారు. అంతే కాదు.. మూలవాసి బ‌చావో మంచ్ పై విధించిన నిషేధాన్ని ఎత్తి వేయాల‌ని, జైళ్ల‌లో ఉన్న వారిని విడుద‌ల చేయాలని, పెసా చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లతో పాటు అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో గిరిజ‌నుల‌ను వారి భూముల నుంచి బ‌ల‌వంతంగా తరలిచవద్దని, అబూజ్‌మాడ్ వ‌ర‌కు ఆర‌వ షెడ్యూల్‌లో చేర్చి ర‌క్ష‌ణ క‌ల్పించాలనే అంశాలపై నెల‌ల త‌ర‌బ‌డి జ‌రిగిన చ‌ర్చ‌ల్లో ఈ డిమాండ్లు అంగీక‌రించిన త‌రువాత‌నే ఆయుధాలు అప్ప‌గించామ‌ని ఆశ‌న్న స్పష్టంచేయడం గమనార్హం.

విద్రోహం అని కొట్టి ప‌డేయ‌డానికి లేదు…

‘మ‌ల్లోజుల వేణుగోపాల్‌, ఆశ‌న్న‌ చేస్తున్న‌ది విద్రోహం అని కొట్టి ప‌డేయడానికి లేదు. రాజ‌కీయంగా విష‌యం ఏమిట‌నేది ఉండాలి. లొంగిపోవ‌డం ఉద్య‌మానికి న‌ష్టమే కానీ దానికి అనేక కార‌ణాలున్నాయి. శ‌త్రువు ఊచ‌కోత కోశాడు. త‌ల దాచుకునే ప‌రిస్థితి లేదు. వీట‌న్నింటినీ గ‌మ‌నించి, దీనికి దారితీసిన ప‌రిస్థితులు, మూలాలు, ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏమిట‌నేది స‌మీక్షించుకోవాలి. మా పార్టీ రాష్ట్ర క‌మిటీ స‌మావేశం జ‌రిగిన త‌రువాత దీనిపై స్పందిస్తాం’
గోవ‌ర్థ‌న్‌, సీపీఐ ఎంల్ ఎల్‌ (న్యూ డెమొక్ర‌సీ) రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యుడు

డిక్లేన్‌ చేయ‌డం స‌రైన‌దే

‘ప్ర‌పంచవ్యాప్తంగా ఆర్డ్మ్ మూమెంట్స్ డిక్లేన్ అవుతున్నాయి. ఎల్టీటీఈదీ అదే ప‌రిస్థితి. తాలిబ‌న్ లాంటి ఒక‌టి రెండు మిన‌హా మిగతావి స‌స్టెయిన్ కాలేదు. తాలిబ‌న్ స‌క్సెస్ కావ‌డానికి వాళ్ల‌కు ఏదో ఒక అగ్ర‌రాజ్యం బ్యాకెండ్ ఉండి ఆయుధాలు, నిధులు స‌ర‌ఫ‌రా చేయ‌డ‌మే కార‌ణం. ప్ర‌జ‌ల నుంచి వచ్చే రాజ‌కీయ సంస్థ‌లు టెక్నాల‌జీ, రాజ్యం బ‌లం ముందు నిల‌బ‌డ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. రైట్ వింగ్ ఫోర్స్ రాజ్యంలోకి వ‌చ్చాక అంత‌ర్గ‌త శ‌క్తుల‌ను కూడా నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్న‌ది. ఈ ప‌రిస్థితుల్లో డిక్లేన్ చేయ‌డం స‌రైన‌దే. లిబ‌ర‌ల్ ఫోర్స్ రాజ్యంలో ఉన్న‌ప్పుడు ఇలాంటి ప‌రిస్థితి లేదు. చాలా మంది ఉద్య‌మ సంస్థ‌లు ప‌రిస్థితులు అనుకూలంగా ఉన్న‌ప్పుడు త్యాగాలు చేయ‌వ‌చ్చు కానీ, అనుకూలంగా లేని ప‌రిస్థితిలో వృథా త్యాగాలు వ‌ద్ద‌నే బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు అనిపిస్తున్న‌ది’.
సుద‌ర్శ‌న్ బాల‌బోయిన‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, ఉస్మానియా యూనివ‌ర్సిటీ

రక్షించుకోవడం తప్ప మ‌రో మార్గం లేక‌నే…

‘ర‌క్షించుకోవ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేక‌నే బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఒక్క ఏడాదిలోనే 8 మంది కేంద్ర క‌మిటీ స‌భ్యులను చంపేశారు. దీనిని విద్రోహం అనో .. ఇంకోట‌నో బ‌య‌ట సోష‌ల్ మీడియాలో చాలా మంది మాట్లాడుతూ వారిని మాన‌సికంగా హింసిస్తున్నారు ఇది త‌ప్పు. క‌మ్యూనిస్టుల‌కే గ‌డ్డుప‌రిస్థితి ఏర్ప‌డింది. దీర్ఘ‌కాలిక ప్ర‌జాయుద్ధం మొద‌లు కొని ఆలోచ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంది. పోరాట విమ‌ర‌ణ త‌రువాత సీపీఐ, సీపీఎం మొద‌లు కొని క‌మ్యూనిస్టు పార్టీల బ‌లం రోజురోజుకు త‌గ్గుతూ వ‌స్తున్న‌ది. క‌మ్యూనిస్టులు ఇంకా ర‌ష్యా, చైనా విప్ల‌వ కాలం నాటి సామ్రాజ్యవాదం గురించే మాట్లాడుతున్నారు. ఉత్ప‌త్తి వ్య‌వ‌స్థ‌లు మారాయి. పెట్టుబ‌డిదారీ వ్య‌వ‌స్థ వ‌న్నెచిన్నెలు చేస్తున్న‌ది. ఉత్ప‌త్తి నేరుగా క‌నిపించ‌డం లేదు. ఆన్‌లైన్‌లో పెట్టుబ‌డి వ‌స్తున్న‌ది. మ‌నం దీనిని అంచ‌నా వేయాలి. మావోయిస్టులు సుదీర్ఘ ప్ర‌జాయుద్ధాన్ని ఛత్తీస్‌గఢ్‌కు తీసుకువెళ్లారు. అక్క‌డ బ‌త‌కలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. తెలంగాణ‌లో లేకుండా పోయింది. ఉన్న‌వాళ్లు స‌ర్వెవ్ అవుతార‌న్న న‌మ్మకం లేదు. టెక్నాల‌జీ బాగా డెవ‌ల‌ప్ అయింది. యుద్ధాలు మారిపోయాయి. కాలిన‌డ‌క యుద్ధాలు ఎక్క‌డా లేవు. అన్ని ఆకాశ యుద్ధాలే.. ఎక్క‌డో ఉండి ఎక్క‌డో దాడి చేస్తున్నారు. గాజా–ఇజ్రాయిల్, ర‌ష్యా– ఉక్రెయిన్‌ యుద్ధాల‌ను చూస్తే అర్థం అవుతున్న‌ది. ఇక్క‌డ కూడా టెక్నాల‌జీని ఉప‌యోగించి కార‌డ‌వుల్లో క‌ద‌లిక‌లు ప‌సిగ‌ట్టి దాడులు చేస్తున్నారు. స‌మాజంలో వ్య‌క్తి కుదించుకు పోయాడు. నాడు స‌మాజం నుంచి ఆలోచ‌న చేస్తే.. నేడు ‘నేను నా కుటుంబం’ అనే స్థితికి వ‌చ్చాడు. వీట‌న్నింటినీ చ‌ర్చ చేయ‌కుండా ముందుకు వెళ్ల‌లేరు. ఇప్పుడున్న ప్ర‌పంచానికి అన్వ‌యించి చెప్పాల్సిన అవ‌సం ఉంది. ముందు బ‌త‌కండి.. ఆ త‌రువాత చెప్పొచ్చు. కొంత మంది దీనిని ద్రోహం అంటున్నారు కానీ ర‌క్షించుకోవ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేక‌నే వాళ్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. క‌మ్యూనిస్టులకు మునుప‌టి ప్ర‌జాబ‌లం లేదు. ఇంకో మార్గం లేదు. క‌మ్యూనిస్టుల‌కు గ‌డ్డు ప‌రిస్థితి ఏర్ప‌డింద‌నేది వాస్త‌వం’.
అల్లం నారాయ‌ణ‌, సీనియ‌ర్ ఎడిట‌ర్‌, తెలంగాణ మీడియా అకాడ‌మీ తొలి చైర్మ‌న్‌

విభేదించడం విప్లవ ద్రోహమైపోయింది..

‘విభేదించడమే విప్లవ ద్రోహమై ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీలన్నీ లక్షల మంది బుద్ధిజీవులను దూరం చేసుకున్నాయి. ఒక విధాన నిర్ణయం తీసుకుంటే అది శాశ్వతమూ, అనుల్లంఘనీయమూ, సమీక్షలకు, పునరాలోచనలకు అతీతమూ అనుకోవడమే.. మార్పు సత్యం, మార్పు అనివార్యం అన్న మార్క్సిస్టు తాత్వికవాదానికి విరుద్ధం. రావి నారాయణ రెడ్డి డెబ్భైయ్యేళ్ళ క్రితం సాయుధ పోరాటం విరమిద్దామని ప్రతిపాదిస్తే, ఆయనపై పార్టీలో ఒక వర్గం ఆయనపై ద్రోహి అని ముద్ర వేసింది. ఆయన పార్టీ కేంద్ర నాయకత్వాన్ని కలిసేందుకు బొంబాయికి వెళితే , పార్టీ నిధులు తీసుకుని లొంగిపోవడానికి పారిపోయారని పత్రికల్లో రాయించారు. పార్టీ మాత్రం సాయుధ పోరాటం కొనసాగించి అప్పటి రాజ్యం కరకు తుపాకులకు 4000 మంది యోధులు బలిదానం చేసిన తర్వాత 1951 అక్టోబరులో సాయుధ విరమణ ప్రకటించి ఎన్నికల బరిలో దిగింది. ద్రోహి అని విమర్శ ఎదుర్కొన్న రావి నారాయణ రెడ్డికి నల్లగొండ ప్రజలు అఖండ విజయం సాధించిపెట్టారు. అనుభవాలనుంచి గుణపాఠాలు నేర్చుకోలేని గిడసబారిన మెదళ్ల కారణంగానే కమ్యూనిస్టు ఉద్యమం ఇన్ని చీలికలు పేలికలైంది. చరిత్ర మళ్ళీ మళ్ళీ పునరావృతమవుతుందని ఎందుకంటారో ఇప్పుడు మరోసారి అనుభవం అవుతున్నది. మన లక్ష్యాల కోసం, మన ఆకాంక్షల కోసం మరొకరు బలైపోవాలనుకోవడం న్యాయం కాదు’.
క‌ట్టా శేఖ‌ర్‌రెడ్డి, సీనియ‌ర్ ఎడిట‌ర్‌, ఆర్టీఐ మాజీ క‌మిష‌న‌ర్‌.