Telangana Cabinet : తెలంగాణ మంత్రివర్గంలో చోటు కోసం రేసు.. మరి వారిద్దరి పరిస్థితి ఏమిటి?

డిమాండ్ల నేపథ్యంలో క్యాబినెట్‌ కూర్పు ఎలా ఉంటుంది? పార్టీ అధిష్ఠానం అసలు ఇలాంటి ఒత్తిళ్లకు తలొగ్గుతుందా? లేక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో తన మార్కు చూపినట్టు అనూహ్య ఎంపికలు ఉంటాయా? అన్నది గాంధీభవన్‌ వర్గాల చర్చల్లో హాట్‌టాపిక్‌గా ఉన్నది.

Telangana Cabinet : తెలంగాణ మంత్రివర్గంలో చోటు కోసం రేసు.. మరి వారిద్దరి పరిస్థితి ఏమిటి?

Telangana Cabinet : ‘నేను కూడా మంత్రి పదవి రేసులో ఉన్నాను’.. మొన్న.. నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి మాట ఇది. నేడు బాలునాయక్‌దీ అదే మాట. క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు చేపడుతారోగానీ.. మంత్రి పదవి ఆశావహులు మాత్రం ఒకటి.. రెండు.. మూడు.. అంటూ 15 నెలలుగా రోజులు లెక్కపెట్టుకుంటూ వస్తున్నారు. ఇంతకాలం ఒపిగ్గా ఎదురుచూసి.. విస్తరణకు ముహూర్తం సమీపిస్తున్న క్రమంలో తమ మనసులోని మాటను బాహాటంగా వినిపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం 2023 డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డి, మరో 11మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్ర క్యాబినెట్‌లో 18 మందికి అవకాశముండగా.. మరో ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకునే వెసులుబాటు ఉంది. అటు ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15నెలలు గడుస్తున్నా పూర్తి స్థాయి క్యాబినెట్ ఏర్పాటు చేసుకోలేకపోతున్నదని, విద్యాశాఖ, హోంశాఖలకు ప్రత్యేకంగా మంత్రులు లేక పాలన అస్తవ్యస్తంగా సాగుతున్నదని విమర్శిస్తున్నది. ఇంటా బయటా ఒత్తిళ్ల నేపథ్యంలో వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. అయితే రాహుల్ గాంధీ, సోనియాగాంధీ అపాయింట్‌మెంట్‌ దక్కని నేపథ్యంలో విస్తరణ వ్యవహారం వాయిదా పర్వంలో సాగుతున్నది.

భారీ ఆశలే
మంత్రి పదవుల కోసం పార్టీలోని సీనియర్లు, జూనియర్లు.. వివిధ సామాజిక వర్గాలు, జిల్లాలు, రాజకీయ సమీకరణాల కోణంలో భారీ ఆశలే పెట్టుకున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాలకు ప్రస్తుతం క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ జిల్లాల నుంచి మంత్రివర్గ విస్తరణ కోసం ఎదురు చూపులు ఎక్కువయ్యాయి. రానున్న మంత్రివర్గ విస్తరణలో మైనారిటీలకు, ముదిరాజ్ సామాజిక వర్గానికి అవకాశం దక్కనుంది. ప్రధానంగా 6 మంత్రివర్గ స్థానాల కోసం 10 మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్, నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు, మహబూబ్ నగర్ నుంచి వాకిటి శ్రీహరి పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెబుతున్నారు. ఎస్టీ కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే ఎన్ బాలునాయక్, నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలమైన ఆశావహులుగా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్ వంటి వారు ఆశలు పెట్టుకున్నారు. మైనార్టీల నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ రేసులో ఉన్నప్పటికీ చివరి నిమిషంలో మైనార్టీ కోటాలో కొత్త ముఖం తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణ జటిలంగా తయారైంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకే పరిమితమవుతారా.. లేక మొత్తం క్యాబినెట్‌ను పునర్వ్యవస్థీకరిస్తారా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మంత్రి పదవుల సర్ధుబాటులో భాగంగా ప్రస్తుతమున్న ఇద్దరు మంత్రులను తప్పించవచ్చని.. అలాగే ఎమ్మెల్సీలను కూడా ఇద్ధరిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని గాంధీభవన్‌ వర్గాల్లో వినిపిస్తున్నది. మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్ కీలక భూమిక వహించడం తథ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నేనూ రేసులో ఉన్నా: బాలు నాయక్
మంత్రి పదవిపై దేవరకొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ బాహాటంగా తన గళం వినిపించారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు లంబాడీలకు మంత్రి పదవి దక్కలేదని..ఇప్పటి వరకు తమ సామాజిక వర్గం నుంచి క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం లభించలేదని ఆయన అంటున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్ధతుగా నిలిచిన లంబాడీలంతా ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా క్యాబినెట్‌లో తమ వాళ్ళు లేరనే అసంతృప్తితో ఉన్నారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ హయాంలో తమ సామాజిక వర్గానికి క్యాబినెట్‌లో స్థానం దక్కిందని, తమ సామాజిక వర్గానికి కేసీఆర్ ఎక్కడా అన్యాయం చేయలేదని.. అయినా కాంగ్రెస్ పార్టీకి లంబాడీలు ఓట్లు వేశారని బాలూ నాయక్‌ వ్యాఖ్యానించడం ఆసక్తిని రేపుతున్నది. తమ సామాజిక వర్గానికి అధిష్ఠానం, సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గతంలో బాలూ నాయక్‌కు డిప్యూటీ స్పీకర్‌ పదవిని ఇస్తారన్న ఊహాగానాలు వచ్చాయి. అయితే.. తనకు డిప్యూటీ స్పీకర్, తమ వాళ్లకు ఏదో పదవి ఇస్తే సరికాదని.. క్యాబినెట్‌లో చోటు కల్పించాలన్నదే తమ ఏకైక డిమాండ్ అని బాలు నాయక్ స్పష్టం చేశారు.

44% జనాభా మాది.. మంత్రి పదవులు ఇవ్వాల్సిందే : మల్ రెడ్డి
44% జనాభా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. 10 జిల్లాల తెలంగాణ సాధించుకున్నామని..10 జిల్లాలకు మంత్రులు ఉండాల్సిందేనని అన్నారు. 10 జిల్లాల ప్రామాణికంగా ముందుగా మంత్రి పదవులు ఇవ్వాలన్నదే తన డిమాండ్ అని మల్‌రెడ్డి చెబుతున్నారు. పైగా.. 44% జనాభా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవులు రాకపోతే ప్రజా పాలన అని ఎలా అంటామని ఎదురు ప్రశ్నించారు. గతంలో తాను అన్న మాటకు కట్టబడి ఉన్నానని.. తమ జిల్లాలకు మంత్రి పదవుల కేటాయింపులో రిజర్వేషన్లు.. సామాజిక సమీకరణలు అడ్డు వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ ఎవరిని చెప్తే వారిని గెలిపించుకుంటామని విచిత్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో ప్రాతినిధ్యం లేని జిల్లాల వారికీ అవకాశం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ డిమాండ్ల నేపథ్యంలో క్యాబినెట్‌ కూర్పు ఎలా ఉంటుంది? పార్టీ అధిష్ఠానం అసలు ఇలాంటి ఒత్తిళ్లకు తలొగ్గుతుందా? లేక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో తన మార్కు చూపినట్టు అనూహ్య ఎంపికలు ఉంటాయా? అన్నది గాంధీభవన్‌ వర్గాల చర్చల్లో హాట్‌టాపిక్‌గా ఉన్నది.