ఏదైనా సామెతను, ఉపమానాన్ని అతిగా ఉపయోగించినప్పుడు పాతది దాని అర్ధాన్ని, అందాన్ని కోల్పోతుంది. ‘చారిత్రాత్మక విజయం’ వాటిలో ఒకటి. ఇటీవల కాలంలో సర్పంచ్ ఎన్నికల విజయాన్ని సైతం ‘చారిత్రాత్మక’ అని వర్ణించడం మామూలైపోయింది. కానీ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ విజయాన్నిమాత్రం అలా వర్ణించకపోతే చారిత్రకమనే పదమే సిగ్గుపడుతుంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అవమానకరమైన ఓటమిని అందించడం, అనేక కారణాల వల్ల ఈ దేశంలో ప్రజాస్వామ్యవాదులకు, బుద్ధిజీవులకు చారిత్రాత్మకంగా మాత్రమే గుర్తుకు వస్తుంది. మోషా (మోడీ+షా)లకు బానిసలుగా మారిన మీడియాకు ఈ విజయం ఇప్పుడు చారిత్రాత్మకంగా కనిపించకపోవచ్చుగానీ, 2024లో మాత్రం కచ్చితంగా కనిపిస్తుందని ఆశిద్దాం.
భారత్‌లో విజృంభించిన కోవిడ్, దాని తాలూకు మరణాలు, ఆస్పత్రుల్లో సామాన్యుల ఆర్తనాదాలు, ఆక్సిజన్ కూడా అందక చనిపోయినవారితో కిక్కిరిసిపోయిన స్మశానాలు, దేశంలోనే తయారైన వ్యాక్సిన్ దేశప్రజల్లో కనీసం 7-8 శాతానికి కూడా అందకపోవడం, కేంద్రం నిమ్మకునీరెత్తినట్లు ఉండటం- దేశ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రగిల్చింది.
సరిగ్గా ఈ సమయంలో జరిగిన ఎన్నికల్లో ఓటును ఎవరికి వేయాలన్నది బెంగాల్ ఓటర్లు సరిగ్గానే అర్థం చేసుకున్నారు. అందుకే రెండుసార్లు మోడీని ప్రధానిగా చేయడానికి అవకాశాలను కల్పించిన పశ్చిమ బెంగాల్, మోడీని రెండు-మూడేళ్లు ముందే ప్రధాని పదవిని వదిలి వెళ్లేంత స్థాయిలో ప్రభావితం చేసింది. ఈ ఫలితాల తర్వాత ప్రజల్లోనే కాదు, సొంత పార్టీలోనూ మోడీ షాల ప్రాభవం మసకబారకతప్పని పరిస్థితి.
దేశాన్ని నడిపే నాయకత్వం నిష్క్రియాపరత్వం ప్రదర్శిస్తే దేశ ప్రజలు ఎలాంటి దుర్భర పరిస్థితుల్లోకి నెట్టబడతారో భారత్‌లో ఇప్పటి కోవిడ్ తీవ్రత, దాని పర్యవసానాలే సజీవ సాక్ష్యం. దేశం, ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం, అధిక ధరలు, తీవ్రమవుతున్న నిరుద్యోగం మోడీ గ్రాఫ్‌ను మసకమార్చడం ఖాయంగా తెలుస్తోంది. ఈ విషయం బిజేపీ జీవనాడి అయిన ఆరెస్సెస్‌కు కూడా బెంగాల్ ఫలితాలతో బాగా అర్థమైనట్లుంది. ఏ పార్టీ నాయకత్వంపైన అయినా ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడం మొదలైన తర్వాత..ఆ పార్టీ శ్రేణులు కూడా ఆ నాయకత్వం మీద విశ్వాసం కోల్పోవడం జరుగుతుంది. ప్రత్యామ్నాయాల కోసం వెదకడం మొదలవుతుంది. బిజేపీలో ఇది ఇప్పటికే మొదలైందని ఆ పార్టీ నేతగా ఉంటు, ఆరెస్సెస్‌కు అతి దగ్గరగా ఉండే సుబ్రమణ్యస్వామి ట్వీట్లే చెబుతున్నాయి. మోడీ -అమిత్ షా విధానాలపై, ప్రభుత్వ వైఫల్యాలపై సుబ్రమణ్య స్వామి తన పదునైన భాషతో పెడుతున్న ట్వీట్లు అన్నీ ఇన్నీ కావు. పైకి సుబ్రమణ్యస్వామి ఒంటరి స్వరంగా కనిపిస్తున్నా… అతను ఒంటరి కాదని, అతని వెనుక సంఘ్ సహకారం ఉందనే విషయం మోడీ, షాలకు కూడా తెలుసు. బెంగాల్ ఫలితాల తర్వాత మోడీ నాయకత్వంపై ఈ తరహా విమర్శలు ఇటు ప్రజల్లో, అటు సొంత పార్టీలో మరింత పెరిగినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.
మమతా బెనర్జీ విజయం చారిత్రకం అనడానికి ఇంకో బలమైన కారణం కూడా లేకపోలేదు. 294 సీట్లు ఉన్న బెంగాల్ అసెంబ్లీలో గత ఎన్నికల్లో అంటే, 2016లో మమతా బెనర్జీ పార్టీ 209 సీట్లు సొంతం చేసుకుంటే, ఈ ఎన్నికల్లో 213 సీట్లు దక్కించుకోవడం. అంతేనా…టిఎంసీ హ్యాట్రిక్ విజయం కూడా మమతకు రాత్రికి రాత్రే జాతీయ ప్రజాదరణ గల నేతను చేసిపెట్టింది. గత ఎన్నికల కంటే 43 సీట్లను పెంచుకుని మొత్తం 77 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్షంగా బిజేపీ మారినప్పటికీ…మమతను భారతదేశ ప్రజలు మాత్రం భవిష్యత్ ప్రధాని అభ్యర్థి అన్న అభిప్రాయంతోనే చూస్తున్నారు. ఇక్కడ ఒకే ఒక నష్టం మమతకు జరిగింది, అదేంటంటే నందిగ్రామ్‌లో స్వల్ప మెజార్టీతో సువేందు అధికారి చేతిలో ఓడిపోవడమే. కానీ దేశప్రజల్లో ఆమె ప్రభను ఇది ఏమాత్రం తగ్గించలేదు.
బెంగాల్ ఎన్నికలు ఎలా జరిగాయో దేశ ప్రజలందరికీ తెలుసు. 8 విడతలుగా ఎందుకు జరిపారో కూడా ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ అధికార బలం, ఎన్నికల కమిషన్, ఈడీ, సిబిఐ, ఐటి శాఖలతోపాటు విచ్చలవిడిగా వెదజల్లిన డబ్బులు, కుట్రలు ఒకవైపు…..ఇన్ని వ్యవస్థలతో పోరాడుతూ మధ్యలో గాయపడి, వీల్‌చైర్‌కే పరిమితమైన దీదీ ఇంకోవైపు. ఈ సమయంలో వచ్చిన ఈ గెలుపు మమత తేజస్సును బెంగాల్ సరిహద్దుల నుంచి దేశం నలుమూలలకూ వ్యాపింపజేసింది. ఈ గెలుపు తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్న బిజెపియేతర పార్టీలన్నింటికీ నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇన్నాళ్లు ఆయా పార్టీల మధ్య ఏకాభిప్రాయం కొరవడిన ప్రధాని అభ్యర్థి చిక్కుముడి వీడిపోయింది. ఆ పార్టీలన్నింటికీ మమతా బెనర్జీ ఇప్పుడు ఏకైక ఆమోదయోగ్య నాయకురాలుగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో మోడీకి ఏకైక ప్రత్యామ్నాయం మమతే అన్నది కూడా రూఢీ అయింది.
1996లో సీపీఎం చేసిన రెండో “చారిత్రాత్మక తప్పు” వల్ల బెంగాలీ నుంచి జ్యోతి బసును భారత ప్రధానమంత్రి అవ్వకుండా నిరోధించింది. 25 ఏళ్ల తరువాత, ఇప్పుడు మమతా బెనర్జీ రూపంలో బెంగాల్‌కు మరో కొత్త అవకాశం కనిపిస్తోంది. న్యూఢిల్లీ నుండి దేశాన్ని నడిపించే మొదటి బెంగాలీగా మమత బెనర్జీ మారగలరా? అనే సందేహం బెంగాల్ ప్రజలకేకాదు, దేశ ప్రజలకూ ఇకపై పెద్దగా రాకపోవచ్చు.
ఎగ్జిట్ పోల్ సర్వేలు, ప్రీపోల్ సర్వేలు చూసి బెంగాల్‌లో బిజేపీ గెలిచిపోతుందని భయపడిన అనేకానేకమందికి ఊరట కలిగిస్తూ బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పుకు దేశప్రజలు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే, మమత ప్రధాని కావడం పెద్ద కష్టమేమీ కాదు. రవీంద్రనాథ్ ఠాగూర్, నజ్రుల్ ఇస్లాం, స్వామి వివేకానంద, నేతాజీ సుభాస్ చంద్ర బోస్ వంటి దిగ్గజాలను దేశానికి అందించిన బెంగాల్ నుంచి మమత లాంటి విలక్షణమైన నేత దేశ ప్రధాని పదవికి పోటిపడితే బిజేపియేతర పార్టీలన్నీ ఏకతాటిపై వచ్చి మద్దతు ఇచ్చే వాతావరణం ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటోంది. మమత రూపంలో మోడీ-షాల ప్రభ వచ్చే ఎన్నికల నాటికి తుడుచుపెట్టుకుపోయినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది.
పశ్చిమ బెంగాల్ విజయంలో జాతీయ ప్రాముఖ్యత కూడా ఇమిడి ఉంది. బిజేపిని నిర్ణయాత్మకంగా ఓడించడం ద్వారా బెంగాల్ ఓటర్లు బెంగాల్‌ను కాపాడుకోవడమేగాక, దేశాన్ని రక్షించారనే కీర్తిని కూడా సంపాదించుకున్నారు.
2024 ఎన్నికల్లో బిజేపీ చూపించేందుకు అభివృద్ధి, పాలనారంగాల్లో గొప్ప విజయాలేమీ లేవు. అందుకే వారు తిరిగి మతాన్నే ఆశ్రయిస్తారు. కాకపోతే మోడీ, షాలకు ఈసారి మూడవ హిందూత్వ ఐకాన్ యోగి ఆదిత్యనాథ్ జతకట్టవచ్చు. ఈ ముగ్గురు హిందూ-ముస్లిం విభజన, ద్వేషపూరిత రాజకీయాలను తప్పక ఆశ్రయిస్తారు. ఇలాంటి రాజకీయాలను ఆదరించి దేశం ఇప్పటికే భారీ మూల్యం చెల్లించింది. భవిష్యత్‌లో ఇలాంటి వారిని ఆదరిస్తే దేశానికి, రాజ్యాంగానికి, సమాజానికి జరిగే నష్టం నివారించడానికి దేశ ప్రజలు ఏం చేయాలో బెంగాల్ అది చేసి ఒక మార్గదర్శిగా మారింది. అందుకు ఆ రాష్ట్ర ఓటర్లకు రుణపడి ఉండాలి.
బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ, షాల ప్రదర్శించిన అతి విశ్వాసం, అహంకారం అంతా ఇంతా కాదు. దీదీ ఓ దీదీ అని, స్కూటీ జిబ్‌లు అంటూ చేసిన గేలి కూడా గుర్తుంది. 200 సీట్లకుపైనే బిజేపీ గెలుచుకుంటుందని, మే 2న దీదీ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలంటూ అమిత్ షా పలికిన ప్రగల్భాలూ మరచిపోలేము.
బెంగాల్ ఎన్నికలను మోడీ వర్సెస్ మమతా యుద్ధంగా మార్చినప్పటికీ, బిజెపి సంఖ్య మూడు అంకెలను కూడా తాకలేదు. నలుగురు పేద ముస్లిం ఓటర్లు సితాల్‌కుచి వద్ద కేంద్ర భద్రతా దళాల బుల్లెట్లకు పడిపోయినప్పుడు, పశ్చిమ బెంగాల్‌లోని ఒక మాజీ బిజెపి చీఫ్ ఇంకా ఎక్కువ మందిని చంపి ఉండాల్సిందని ప్రకటించారు. అమిత్ షా కూడా అదే తరహా దురహంకార పలుకులు పలికారు. కానీ వీరిని ప్రధానికాని, బిజేపీ పెద్దలుకానీ, చివరకు సంఘ్ పరివార్ కానీ మందలించలేదు. బెంగాల్ ఫలితాల తరువాత జరిగిన చిన్నపాటి హింసను భూతద్దంలో చూపిస్తున్న నేటి బిజేపీ నేతల నోరు ఆ రోజు ఏమైందన్నది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది.
దేశంలో రెండో వేవ్ కరోనా తీవ్ర రూపం దాల్చనుందనే ఫిబ్రవరిలోనే హెచ్చరికలు వచ్చాయి. అయినా బెంగాల్‌లో ఎన్నికలను 8 దశలుగా జరపాలని మోడీ, షాలు మొండిగా ఈసీని ఒప్పించారు. అంతేనా? కోవిడ్ నిబంధనలు పక్కనపెట్టి బెంగాల్ అంతటా అనేక ర్యాలీలు, బహిరంగసభలు నిర్వహించారు. బాధ్యతాయుత పదవుల్లో ఉండి కరోనా ‘సూపర్ స్ప్రెడర్స్’ ను పెంచిపోషించారు. ఒకటి, రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని మమత ఎన్నికల సంఘాన్ని గట్టిగా కోరినా ఈసీ కూడా పెడచెవిన పెట్టేలా చేశారు. మరొక నిబంధనను కూడా మోడీ ఉల్లంఘించారు. విదేశీ గడ్డ నుండి తన పార్టీ కోసం (పరోక్షంగా) ప్రచారం చేసిన మొదటి భారత ప్రధాని అయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని మాటువా సామాజికవర్గం ఓట్లను ప్రభావితం చేసే లక్ష్యంతో మార్చిలో తన అధికారిక బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా ఒరాకాండిలోని గురు హరిచంద్ ఠాకూర్ మందిరాన్ని సందర్శించి అనైతిక ప్రచారం చేశారు.
కోవిడ్ సంక్షోభాన్నిఎదుర్కోవడంలో వైఫల్యం, పశ్చిమ బెంగాల్‌లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అతని వినయపూర్వకమైన ఓటమి అనే రెండు కన్వర్జెంట్ వైఫల్యాల కారణంగా మోడీ ప్రభ తీవ్రంగా దెబ్బతినింది.
గ్లోబల్ మీడియా కూడా గత ఏడు సంవత్సరాలలో ఎప్పుడూ మోడీని విమర్శించనంతగా ఈ ఏడు వారాల్లో విమర్శించింది. మోడీలో గొప్ప ప్రపంచ నాయకుడిగా చూడాలనుకునేవారి ఆశలను ఆవిరిచేయడంలో కరోనా వైరస్ పరిణామాలతోపాటు, వెన్నుచూపని పోరాట పటిమగల మమత కూడా జతకలిసింది. కరోనా వైరస్‌ను ఎప్పటికైనా భారత్ జయించగలదు. ఢిల్లీలో సింహాసనాన్ని బెంగాల్ జయించగలదు అన్న నమ్మకంవైపు దేశం నడుస్తోందిప్పుడు.
రొద్దం శ్రీనివాసులు.