PM Kisan Funds| రైతులకు గుడ్ న్యూస్..ఈ నెలలోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు!

విధాత, హైదరాబాద్ : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పథకం 20వ విడత నిధుల కోసం రైతులు ఎదురుచూపులు పడుతున్నారు. 2019సంవత్సరంలో ప్రారంభమైన ఈ పథకంలో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు ఏటా మూడు వాయిదాలలో రూ.2000 చొప్పున రూ.6000 కేంద్రం అందిస్తుంది. ఫిబ్రవరి నెలలో 19వ విడత నిధులు విడుదల చేసిన కేంద్రం..20వ విడత జూన్ నెలలోనే వేయాల్సి ఉంది. అయితే పీఎం కిసాన్ అప్ డేట్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దఫా పీఎం కిసాన్ నిధులు ఆలస్యమయ్యాయి. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 20న బీహార్ రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో 20వ విడత నిధులు అప్పటిలోగానే రైతుల ఖాతాల్లో జమా చేస్తారని సమాచారం.
లబ్దిదారులు తమ వివరాల తాజా పరిస్థితి..అప్ డేట్ సమాచారం కోసం పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. 20వ విడత నిధులు అందుకోవాలంటే రైతులు తప్పనిసరిగా ఇ-కేవైసీ పూర్తి చేసి ఉండాలి. అలాగే బ్యాంక్ ఖాతాతో ఆధార్ నంబర్ లింక్ చేసుకుని ఉండాలని తెలిపారు.