Dragon Fruit Farming | 8 గుంటల భూమిలో నెలకు రూ. 50 వేల సంపాదన.. ఓ వెల్డర్ విజయం ఇదీ..
Dragon Fruit Farming | చదువు పెద్దగా అబ్బలేదు.. స్కూల్ ఏజ్‌లోనే చదువును మానేశాడు. వెల్డింగ్( Welding ) పని నేర్చుకున్నాడు. ఓ మంచి ప్రయివేటు లిమిటెడ్ కంపెనీలో వెల్డర్( Welder )గా స్థిరపడ్డాడు. అది కూడా మలేసియా( Malaysia ) రాజధాని కౌలాలంపూర్( Kuala Lumpur )లో. కానీ అక్కడ ఏర్పడిన ఓ ముగ్గురు రైతుల( Farmers ) పరిచయం.. ఆ వెల్డర్ జీవితాన్ని మార్చేసింది. వెల్డర్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. పొలం బాట పట్టాడు. కేవలం 8 గుంటల భూమిలోనే అద్భుతాలు పండిస్తున్నాడు. నెలకు రూ. 50 వేల వరకు సంపాదిస్తూ పది మంది రైతులకు ఆదర్శంగా నిలిచాడు. మరి రైతుగా మారిన ఆ వెల్డర్ గురించి తెలుసుకోవాలంటే ఒడిశా( Odisha ) వెళ్లక తప్పదు.

Dragon Fruit Farming | ఒడిశా( Odisha )లోని ఇసాన్‌పూర్( Ishanpur )కు చెందిన బాబులి మల్లిక్( Babuli Mallick ) వృత్తి రీత్యా వెల్డర్. చెన్నైకి చెందిన ఓ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీలో 2012లో వెల్డర్‌గా విధుల్లో చేరాడు. అదే ఏడాది ఆ కంపెనీ మల్లిక్‌ను మలేషియా రాజధాని కౌలలంపూర్( Kuala Lumpur )కు తరలించింది. అక్కడ కూడా మల్లిక్ వెల్డర్ పని చేస్తూ జీవనం సాగించాడు.
వెల్డర్‌గా విధులు నిర్వర్తిస్తూనే ఖాళీ సమయాల్లో అక్కడున్న రైతులను కలిసేవాడు. అలా మల్లిక్‌కు ఓ ముగ్గురు రైతులు పరిచయమయ్యారు. వారంతా డ్రాగన్ ఫ్రూట్స్ పండిస్తున్న రైతులే. ఆ ముగ్గురు రైతులు కూడా తమకున్న తక్కువ పొలంలోనే డ్రాగన్ ఫ్రూట్స్( Dragon Fruits ) పండించడం.. లాభాలు గడించడం భలే అనిపించింది మల్లిక్‌కు. వారిని చూసి మల్లిక్ ఎంతో ప్రేరణ పొందాడు.
2022లో కౌలలంపూర్ నుంచి ఒడిశాకు
ఇక సొంతూరుకి రావాలని మల్లిక్ నిర్ణయించుకున్నాడు. 2022లో కౌలలంపూర్ నుంచి ఒడిశాలోని ఇసాన్‌పూర్‌కు మల్లిక్ వచ్చేశాడు. డ్రాగన్ ఫ్రూట్ పండించాలనుకున్నాడు.. కానీ తనకున్న పొలంలో సాధ్యమా..? అని అనుకున్నాడు. ఉన్న పొలంలో తన తండ్రి వరి పండిస్తున్నాడు. అది తిండికి అవుతుంది. ఇక వరి పంటకు కచ్చితంగా నీరు అధికంగా కావాల్సిందే. నీరు లేని వరి పంట మనుగడ సాగించలేదు. వరి పంటతో పోల్చితే డ్రాగన్ ఫ్రూట్ పంటకు నీరు చాలా తక్కువ అవసరం. మండుటెండల్లోనూ రోజుకు రెండు లీటర్ల నీటితో ఒక్కో డ్రాగన్ మొక్కను సాగుబడి చేయొచ్చు అని మల్లిక్ నిర్ణయించుకున్నాడు.
లీజుకు 8 గుంటల భూమి
ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. 8 గుంటల భూమిని లీజుకు తీసుకున్నాడు. 2022లో డ్రాగన్ ఫ్రూట్ సాగు ప్రారంభించాడు. మొదట రూ. లక్ష పెట్టుబడి పెట్టాడు. కాంక్రీట్ పిల్లర్స్, మొక్కలను కొనుగోలు చేసి వాటిని నాటేందుకు రూ. లక్ష ఖర్చు అయింది. అంతేకాదు ఈ సాగును ఆర్గానిక్ పద్ధతిలో చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో వర్మి కంపోస్టు, జీవామృతం సొంతంగా తయారు చేయడం ప్రారంభించాడు. స్కూల్ విద్యను మధ్యలోనే మానేసిన మల్లిక్.. యూట్యూబ్‌లో ఆన్‌లైన్ వీడియోలను చూసి వర్మి కంపోస్టు తయారు చేయడం మొదలెట్టాడు.
ఏడాదికి 30 నుంచి 50 కేజీల వరకు పండ్లు..
తొలుత మొత్తం 25 కాంక్రీట్ పిల్లర్స్‌తో పాటు 100 మొక్కలను కొనుగోలు చేశాడు. ఒక్కో మొక్క ఖరీదు రూ. 70కి కొనుగోలు చేశాడు. ఇక ఒక్కో పిల్లర్ నాలుగు మొక్కలను అనుసంధానం చేశాడు. అలా డ్రాగన్ ఫ్రూట్ సాగును చేశాడు. మొదటి పంటలో ఒక్కో చెట్టు నుంచి ఐదు నుంచి ఆరు కేజీల డ్రాగన్ ఫ్రూట్స్ దిగుబడి వచ్చాయి. ఆ తర్వాత మరో ప్రాంతంలో 55 పిల్లర్లతో 120 మొక్కలకు విస్తరించాడు. ఇప్పుడు ఒక్కో పిల్లర్‌కు అనుసంధానం చేసిన డ్రాగన్ మొక్క ఏడాదికి 30 నుంచి 50 కేజీల వరకు పండ్లను ఇస్తుంది. వచ్చే ఏడాది నాటికి అది 60 కేజీలకు చేరు అవకాశం ఉందని మల్లిక్ తెలిపాడు.
నెలకు రూ. 50 వేలు సంపాదన..
ప్రస్తుతం మార్కెట్‌లో డ్రాగన్ ఫ్రూట్స్‌ను కేజీల లెక్కన విక్రయిస్తున్నామని, ఒక్కో కేజీ రూ. 200 నుంచి రూ. 220 దాకా విక్రయిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఒక్క పండ్లనే కాదు.. పక్కనే నర్సరీ ఏర్పాటు చేసి డ్రాగన్ మొక్కలను కూడా విక్రయిస్తున్నట్లు మల్లిక్ పేర్కొన్నాడు. ఒక్కో మొక్క ధరను రూ. 50గా నిర్ణయించామన్నారు. స్థానికులతో పాటు కటక్, ఖోర్దా, పూరి నుంచి రైతులు తరలివచ్చి మొక్కలను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపాడు. అలా డ్రాగన్ ఫ్రూట్స్, ఆ మొక్కలు విక్రయించి నెలకు రూ. 50 వేలు సంపాదిస్తున్నట్లు మల్లిక్ స్పష్టం చేశాడు. ఇప్పటి వరకు నష్టాలు అనేది తెలియదు అని పేర్కొన్నాడు. భవిష్యత్‌లో మరిన్ని లాభాలు గడిస్తానని మల్లిక్ నవ్వుతూ చెప్పాడు.