తెలంగాణలో ఎమర్జన్సీకి డయల్ 112 సేవలు షురు!

తెలంగాణలో అత్యవసర సేవల కోసం 'డయల్ 112'ను డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. పోలీస్, అంబులెన్స్, ఫైర్ సేవలు సహా 18 అత్యవసర సేవలు ఇకపై ఒక్క నంబర్ ద్వారానే అందుబాటులో ఉంటాయి.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Aug 05, 2026, 4:39 pm IST
Read Time: 3 mins
తెలంగాణలో ఎమర్జన్సీకి డయల్ 112 సేవలు షురు!

తెలంగాణ రాష్ట్రంలో అత్యవసర సేవల కోసం వేర్వేరు నంబర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఇకపై లేదు. ఇప్పటివరకు పోలీసు సేవలకు వినియోగిస్తున్న ‘డయల్ 100’ స్థానంలో కొత్తగా ‘112’ నంబర్‌ను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నట్లు పోలీసు శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని పౌరులకు అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన, స్మార్ట్ , సమన్వయంతో కూడిన సహాయాన్ని అందించడానికి తెలంగాణ పోలీసు శాఖ ‘నెక్స్ట్-జనరేషన్ TG-ERSS డయల్ 112’ వేదికను అందుబాటులోకి తెచ్చింది.

తెలంగాణ పోలీసుల కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి డయల్‌ 112 సేవలను డీజీపీ సీవీ ఆనంద్‌ ప్రారంభించి పోస్టర్‌ను ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక (ఫైర్) శాఖల అత్యవసర సేవలు ఇకపై ఈ ఒక్క నంబర్ ద్వారానే లభిస్తాయని డీజీపీ ప్రకటించారు. ప్రతి ఒక్కరు 112 నెంబర్ సేవ్ చేసుకోవాలని సూచించారు. అత్యవసర సమయాల్లో అండగా ఉండేందుకే ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.డయల్‌ 112 ద్వారా 18 సేవలు అంబాటులోకి వస్తాయన్నారు. ఒకేసారి 960కాల్స్ తీసుకునేలా సిస్టమ్ను ఆప్డేట్ చేసినట్లుగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీజీలు, సీపీలు, సీఐడీ చీఫ్‌ చారుసిన్హా, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ షికాగోయల్‌ హాజరయ్యారు.