Jogi Ramesh | మాజీమంత్రి జోగి రమేష్ కుమారుడి అరెస్టు.. నివాసంలో ఏసీబీ సోదాలు
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై ఏసీబీ దాడిచేసింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి

విధాత : వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై ఏసీబీ దాడిచేసింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 15 మంది అధికారులు సోదాలు చేపట్టారు.. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సీఐడీ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములు కోనుగోలు చేసి విక్రయించినట్లు గుర్తించినట్లు తెలుస్తున్నది. తనిఖీల సందర్భంగా ఏసీబీ అధికారులు అగ్రిగోల్డ్ భూముల కేసులు ఏ 1గా ఉన్న జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను అరెస్ట్ చేశారు. ఏ 2గా ఉన్న జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వరరావును కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
అటు సీఎం చంద్రబాబు ఇంటి పై దాడి కేసులోనూ జోగి రమేష్ కు ఇవాళ విచారణకు రావాలని తాడేపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం విచారణకు హాజరవుతానని జోగి రమేష్ తెలిపారు.
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మేము ఎలాంటి తప్పు చేయలేదని అధికారులు క్లియరెన్స్ ఇచ్చాకనే 2300 గజాల భూమిని మేము కొనుగోలు చేశామని,, విక్రయించామని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిందని మాజీ మంత్రి జోగి రమేష్ తెలిపారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు తో చంద్రబాబు నా కుమారుడిని అరెస్టు చేయించారని ఆరోపించారు. రాజకీయంగా కోపం ఉంటే నాపై తీర్చుకోవాలని అమాయకుడైన నా కుమారుడిని అరెస్టు చేయించడం అన్యాయమని జోగి రమేష్ విమర్శించారు.