తెలంగాణ వాటాపైనా ఏపీ అప్పు ఆంధ్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ
విధాత,అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ తన లెక్కల్లో తెలంగాణ వాటానూ కలిపి చూపించి అధిక రుణం తీసుకుందని, అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రుణ పరిమితిలో కోత పెడుతున్నామని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. 2021-22లో ఆంధ్రప్రదేశ్ రుణ పరిమితిని రూ.27,668 కోట్లకే పరిమితం చేస్తున్నట్టు రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్‌కి ఇటీవల రాసిన లేఖలో స్పష్టం చేసిన కేంద్ర ఆర్థికశాఖ దానికి కారణాలను వివరించింది. 2016-17 నుంచి 2019-20 […]

విధాత,అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ తన లెక్కల్లో తెలంగాణ వాటానూ కలిపి చూపించి అధిక రుణం తీసుకుందని, అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రుణ పరిమితిలో కోత పెడుతున్నామని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. 2021-22లో ఆంధ్రప్రదేశ్ రుణ పరిమితిని రూ.27,668 కోట్లకే పరిమితం చేస్తున్నట్టు రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్‌కి ఇటీవల రాసిన లేఖలో స్పష్టం చేసిన కేంద్ర ఆర్థికశాఖ దానికి కారణాలను వివరించింది. 2016-17 నుంచి 2019-20 వరకు తెలంగాణ వాటాగా చెల్లించిన అప్పునకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రుణం తెచ్చుకుందని, రూ.15,025.03 కోట్లు అధికంగా రుణ పరిమితిని వినియోగించుకుందని గుర్తించినట్టు పేర్కొంది. ఇకపై ఆంధ్రప్రదేశ్ తన రుణాల చెల్లింపు వివరాలు కేంద్రానికి తెలియజేసేటప్పుడు దానిలో ఎంత మొత్తం ఆంధ్రప్రదేశ్ వాటానో, ఎంత మొత్తం తెలంగాణ వాటానో స్పష్టంగా తెలియజేయాలని కేంద్ర ఆర్థికశాఖ సూచించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న అప్పును ఇప్పటికీ తిరిగి చెల్లిస్తున్నారు. అప్పుడు తీసుకున్న అప్పులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏ నిష్పత్తిలో రుణం తిరిగి చెల్లించాలన్న విషయంలో స్పష్టత ఉన్నా.. తెలంగాణ చెల్లించాల్సిన వాటానూ ఆంధ్రప్రదేశే చెల్లిస్తోంది. ఆ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌కి తెలంగాణ తిరిగి సర్దుబాటు చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరుతో తీసుకున్న అప్పును తిరిగి అదే హెడ్ కింద చెల్లించాల్సి ఉండటంతో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.
తెలంగాణ వాటాగా చెల్లించిన మొత్తం కూడా లెక్కల్లో ఆంధ్రప్రదేశ్ చెల్లించినట్టే ఉండటంతో, ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌కి అదనంగా రుణం తీసుకునే వెసులుబాటు లభించింది. దీంతో 2016-17 నుంచి 2019-20 వరకు తెలంగాణ అప్పుగా చెల్లించిన రూ.15,025.03 కోట్ల రుణ పరిమితిని కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో మినహాయించేసింది.